ఎమ్బీయస్‌ : ఆంధ్రకు పరిశ్రమలు తరలివస్తాయా? – 2

ఆంధ్రమూలాలు వున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలో పుష్కలంగా వున్నారు. ఆంధ్రకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని సవరించడానికి మనమేదైనా చేయాలి, అక్కడకు తరలివెళ్లి ఆదుకోవాలి అనే సెంటిమెంటు రాష్ట్రావతరణ సమయంలో కాస్త కనబడింది. సినిమా…

ఆంధ్రమూలాలు వున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలో పుష్కలంగా వున్నారు. ఆంధ్రకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని సవరించడానికి మనమేదైనా చేయాలి, అక్కడకు తరలివెళ్లి ఆదుకోవాలి అనే సెంటిమెంటు రాష్ట్రావతరణ సమయంలో కాస్త కనబడింది. సినిమా పరిశ్రమ వెళ్లిపోతుందా? చీలిపోతుందా? అని కూడా అనుకున్నారు. అక్కడా స్టూడియోలు కడతాం అన్నారు కొందరు. ఇప్పటిదాకా ఎవరూ కట్టినట్లు లేదు. వైజాగ్‌లో రామానాయుడు గారి స్టూడియో ఏ మేరకు యాక్టివ్‌గా వుందో తెలియదు. అయినా యిప్పుడు స్టూడియోలను నమ్ముకునేవారు తగ్గిపోయారు. ఇళ్లలోనే తీసేస్తున్నారు. ఇళ్ల స్థలాలిచ్చి, రాయితీలిచ్చి పిలుచుకుని వస్తేనే మద్రాసు నుండి తరలి రావడానికి దశాబ్దాలు పట్టింది, యిక్కణ్నుంచి యిప్పట్లో వెళుతుందా? అని కొందరు సందేహించారు. బొంబాయితో కాని, మద్రాసుతో కాని హైదరాబాదు కున్నంత కనెక్టివిటీ ఆంధ్రలో ఏ పట్టణానికీ యింకా లేదు. ఎయిర్‌పోర్టులు ఎప్పుడు వస్తాయో, వాటికి రద్దీ ఎప్పుడు పెరుగుతుందో, టిక్కెట్ల ధర ఎప్పుడు తగ్గుతుందో చూశాకనే ఆలోచించవచ్చు అనుకున్నారేమో తెలియదు. 

తెలుగు చలనచిత్ర పరిశ్రమ తెలుగునేలకు తరలి రావడానికి కారణభూతుడు నాగేశ్వరరావుగారు. తనతో సినిమా తీసేవాళ్లందరూ హైదరాబాదులోనే తీయాలనే షరతు పెట్టి బలవంతాన లాక్కుని వచ్చారు. ఇప్పుడు అంత కమిట్‌మెంట్‌ వున్న హీరో ఎవరు? వైజాగ్‌లోనో, విజయవాడలోనో షూటింగ్‌ చేస్తేనే సైన్‌ చేస్తా అనే హీరో ఒక్కడూ వుండడు. అమెజాన్‌లో తీస్తావా, ఆస్ట్రేలియాలో తీస్తావా? అని అడుగుతారు. అయినా అప్పట్లో ఎయన్నార్‌ ఏడాదికి ఆరేడు సినిమాలు వేసేవారు కాబట్టి వాటికి సంబంధించిన వారందరూ రావలసి వచ్చేది. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా అంటే రెండేళ్లు పడుతోంది. అప్పుడప్పుడు వెళ్లి వచ్చినా సరిపోతుంది. కంటిన్యువస్‌గా వుండవలసిన పని లేదు. సినిమా షూటింగుల్లో లైట్ల కారణంగా భయంకరమైన వేడి. బయట వాతావరణపు వేడి కూడా తోడవుతే యింకా మండిపోతుంది. హైదరాబాదు వాతావరణానికి అలవాటు పడ్డాక వేరే చోటికి వెళ్లడం కాస్త కష్టమే. కానీ సముద్రతీరం, నదీతీరం వంటి లొకేషన్స్‌ కావాలంటే కోస్తాకు వెళ్లాల్సిందే. తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయాక అలాటి లొకేషన్స్‌ కోసం విదేశాలు వెళదామంటున్నారు స్టార్లు. 

ఇతర పరిశ్రమల విషయానికి వస్తే తెలంగాణ ఏర్పడగానే ఆంధ్ర వాళ్ల పని పడతానంటూ కెసియార్‌ నాగార్జున కన్వెన్షన్‌పై పడడం, అయ్యప్ప సొసైటీ బిల్డింగులు కూల్చడం యివన్నీ చూడగానే అందరూ తట్టా, బుట్టా సర్దడం మొదలుపెట్టారు. కానీ అంతలోనే సద్దు మణిగింది. అయ్యప్ప సంఘటన కేవలం ఝలక్‌ యివ్వడానికే అని తేల్చేశారు కెసియార్‌. పద్మాలయా స్టూడియోస్‌, రాఘవేంద్రరావు కాంప్లెక్స్‌, ల్యాంకో హిల్స్‌, ఐ మ్యాక్స్‌ – యిలాటి అనేక సంస్థలపై ఉద్యమ సమయంలో గర్జించిన, హెచ్చరించిన, కేసులు పెట్టిన తెరాస నాయకులు యిప్పుడు చల్లారిపోయారు. తమ ప్రజలనే స్థానికులు, స్థానికేతరులుగా విడగొట్టడానికి ఉద్దేశించిన ఫాస్ట్‌ పథకాన్ని ఫాస్టూ లేదు, గీస్టూ లేదు అంటూ రద్దు చేశారు. వచ్చే ఏడాది మళ్లీ ముందుకు తెస్తారేమో తెలియదు. ఉద్యమసమయంలో ప్రయివేటు పరిశ్రమల్లో కూడా స్థానికులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని చేసిన వాగ్దానాలపై కిమ్మనటం లేదు. కూలీలుగా వచ్చినవారితో కాదు, ఆంధ్ర పెట్టుబడిదారులతోనే మా పేచీ అంటూ ప్రకటించినవారు యిప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులతోనే వూరేగుతున్నారు. తవ్వించి పారేస్తానన్న రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఒక్క అంగుళం కూడా అసైన్‌డ్‌ భూమి లేదని కెసియార్‌ ప్రకటించారు. ఉందని ప్రభుత్వం వేసిన కేసు కోర్టులోనే వుంది. ఫార్మా సిటీ, ఫిల్మ్‌ సిటీ ఏ సిటీ ప్లాన్‌ చేసినా పక్కన ఆంధ్రులు వుంటున్నారు. 

ఇదేమిటి యిలా అంటే ఉద్యమనాయకత్వం వేరు, పరిపాలన వేరు అని సమాధానం చెప్తున్నారు. ఈ విషయం అప్పుడు తెలియదా? తెలంగాణ వస్తే ఆంధ్రుల్ని తరిమేసి తమకే అన్నీ కట్టబెడతారని ఆశ పెట్టుకున్న సామాన్యులు ఉసూరుమంటారు కదా అని అడిగితే జవాబు వుండదు. ఈ ఉద్యమాలు యిలాగే వుంటాయి. పాలకులు మారతారు కానీ పెట్టుబడిదారులు ఎప్పుడూ సురక్షితంగానే వుంటారు. వారు లేకపోతే అభివృద్ధి ఎక్కడిది? అభివృద్ధి కావాలంటే శాంతి వుండాలి. వాళ్లను అల్లరి పెట్టకూడదు. ఇవాళ పేపర్లో వచ్చింది – కెసియార్‌ తన ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ 'ఆంధ్ర-తెలంగాణ పేచీలు మర్చిపోండి. గతం గతః, తెలంగాణకు నష్టం కలిగినప్పుడే స్పందిద్దాం' అన్నారుట. (రేపే యింకోలా మాట్లాడినా ఆశ్చర్యపడనక్కరలేదు) అంటే అర్థం ఏమిటి? 'మా పేచీలు ఆంధ్రప్రభుత్వంతోనే. ఆంధ్ర  ప్రాంతీయులు యిక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే సతాయించకండి, సతాయిస్తే మేం సంతోషిస్తాం అని అనుకోకండి.' అనే సంకేతం యిచ్చినట్లే కదా! మహారాష్ట్ర మహారాష్ట్రులకే అని నినదించిన శివసేన గుజరాతీ పెట్టుబడిదారులను బొంబాయి నుంచి తరిమివేసిందా? తరిమివేస్తే ఉద్యోగాలు పోయి మరాఠీవారే శివసేన దుంప తెంపుతారని తెలుసు వాళ్లకు, అందుకే గుజరాతీల పెట్టుబడులు అప్పటికంటె పెరిగాయి. 

భవిష్యత్తు ఎలా వుంటుందో తెలియదు కానీ కెసియార్‌ ప్రస్తుతానికి తన రాష్ట్రంలో వున్న ఆంధ్ర పారిశ్రామిక వేత్తలకు వ్యతిరేకంగా వెళ్లటం లేదు. ఇక్కడ వేడి పుట్టి వుంటే వాళ్లూ తరలి వెళ్లేవారేమో కానీ, కాస్త నిదానించారు. పైగా తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాదులో రియల్‌ ఎస్టేటు స్తంభించింది. తక్కిన జిల్లాల్లో భూముల రేట్లు తగ్గుముఖం పట్టాయి. కొనేవాళ్లు కనబడటం లేదు. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలలో ఎకరానికి 5 లక్షలుంటే ఆంధ్రలో ఓ మాదిరి ఊళ్లో కూడా 50 లక్షలుంటోందిట. ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే భూమి విషయంలోనే యింత తేడా వుంటే ఆలోచించడా? భూమి రేటు తగ్గించడం ఆంధ్రప్రభుత్వం చేతిలో కూడా లేదు. ఇప్పటికే భూములుంటే కొత్త యూనిట్లు అక్కడ పెడుతున్నారేమో తెలియదు కానీ వున్నవాటి తరలింపు అంత జోరుగా కనబడటం లేదు. 
(సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click Here For Part-1