దేశానికి “స్ట్యాట్చూ ఆఫ్ యూనిటీ'' అవసరం ఎంత? జాతీయ ఐక్యత గురించి వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి అవసరమే.. అయితే అంత భారీ విగ్రహం మాత్రం అవసరమా? అనేది శేష ప్రశ్న. వందలు కాదు, వేలు కాదు ఏకంగా దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. విరాళాల రూపంలో అయితేనేమీ.. ప్రభుత్వ ఖర్చుతో అయితేనేమీ… ఇప్పుడు ఈ విగ్రహానికి పెడుతున్న ఖర్చు మాత్రం భారీ స్థాయిలోనే ఉంది.
పేరు కూడా స్ట్యాట్చూ ఆఫ్ లిబర్టీకి అనుకరణలా ఉంది. ఏదో అమెరికాను చూసి వాతలు పెట్టుకొన్నట్టుగానే ఉంది. ఎత్తు విషయంలో ప్రపంచ రికార్డును సృష్టిస్తున్నామని అంటున్నారు. మరి ఏ వరల్డ్ ట్రేడ్ టవర్స్ లాంటివో నిర్మించి.. ప్రపంచంలోనే అతి ఎత్తైన వాణిజ్య సముదాయాన్ని నిర్మించామని అంటూ ఆ ఘనతను ప్రచారం చేసుకొంటే.. అదొక ముచ్చట. అంతే కానీ… కదలని, ఉపయోగపడని విగ్రహాలను ఎంత ఎత్తుతో నిర్మిస్తే ఏం ప్రయోజనం?!
వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చూడగానే జాతీయ ఐక్యత పొంగుకొస్తుందా? ప్రజల మధ్య నిప్పులు పోస్తున్న ఈ తరం రాజకీయ నేతలు ఉండగా ఐక్యత అనేది సాద్యం అవుతుందా? మాయవతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దాదాపు 600 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును పోసి తన విగ్రహాలను తనే పాతించుకొంది. ఆ విషయంలో చాలా విమర్శలు కూడా వచ్చాయి. విగ్రహాల కోసం అంత సొమ్ములు ఖర్చు పెడుతున్నారేమిటి? అంటూ అందరూ విరుచుకుపడ్డారు. సగం భారత దేశంల అర్ధాకలితో మండుతోంటే… విగ్రహాలకు ఖర్చు చేయడం ఏమిటి? అంటూ భారతీయ జనతా పార్టీ వాళ్లు కూడా విరుచుకుపడ్డారు.
పటేల్ ఎప్పుడూ తన విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయమని అడగలేదు. అసలు సమస్య పటేల్ ను భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వాడుకోవడంతోనే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎంత సేపూ నెహ్రూ, ఇందిర, రాజీవ్ ల భజనలో మునిగిపోయి పటేల్ , పీవీలను మరిచిపోయింది. ఆ పాయింట్ ను పట్టుకొని మోడీ రెచ్చిపోయాడు. కాంగ్రెస్ వాది అయినప్పటికీ పటేల్ ను సొంతం చేసుకొన్నాడు. మోడీ చతురత ఏస్థాయిలో ఉంటుందంటే.. ఆయనకు ఏపీ, తెలంగాణల్లో అడుగుపెట్టినప్పుడే పీవీ గుర్తుకు వస్తాడు. పటేల్ గుజరాతీ వ్యక్తి కాబట్టి.. గుజరాత్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి… సెంటిమెంటుతో కొడుతున్నాడు.
మరి ఈ విగ్రహ స్థాపనకు పెడుతున్న ఖర్చును బట్టి చూసుకొంటే… మొత్తం 2,500 కోట్ల రూపాయలు. ఇటీవల మార్స్ ఆర్బిట్ మిషన్ మామ్ కు అయిన ఖర్చుతో పోల్చినప్పుడు దాదాపు ఆరు సార్లు మామ్ తరహా ప్రయోగాలను నిర్వహించడానికి అయ్యే ఖర్చు, ఈ విగ్రహ నిర్మాణానికి అయ్యే ఖర్చు సరిసమానం. మరి మామ్ ప్రయోగంతో మన దేశం పేరు మార్మోగింది. మరి ఉక్కుమనిషి ని విగ్రహంతో ఎంత ప్రతిష్ట పెరుగుతుందో చూడాలి!