ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎలా వుందో కానీ, ఆయన్ను ఎన్నుకున్న నరసాపురం ప్రజలు మాత్రం సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో తమ ఎంపీ మీడియా ముందుకొచ్చి వాపోవడం వారి మనసుల్ని కలచి వేస్తోంది. తాజాగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తనను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బండబూతులు తిట్టారని రఘురామకృష్ణంరాజు వాపోవడం గమనార్హం.
వైసీపీతో విభేదిస్తున్న రఘరామ తన పని తాను చేసుకుపోతే సమస్యలొచ్చేవి కావు. ఆయన్ను అత్యున్నత చట్టసభకు పంపిన పాపానికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. వైసీపీ ట్యాగ్ లైన్ తగిలించుకుని, అదే పార్టీపై అవాకులు చెవాకులు పేలడం ఆయనకు వ్యసనంగా మారింది. అతి ఎప్పటికీ మంచిది కాదు. ప్రతి ఒక్కరికీ ఒక సమయం అంటూ వస్తుంటుంది. బ్యాడ్ టైమ్ అనేది జీవితంలో తారస పడుతుంటుంది. అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
మన నడవడిక బాగుంటే, ఏదైనా సమస్య వస్తే అయ్యో పాపం అని పది మంది చేయూతనివ్వడానికి ముందుకొస్తారు. లేదంటే పది మందికి మరికొందరు తోడై పిడిగుద్దులు వేస్తారు. రఘురామ విషయంలో ఏం జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరికి ఆయన మాటలు తేనెలా తియ్యటి రుచి కలిగిస్తున్నాయి. మరికొందరికి చేదు అనిపిస్తున్నాయి. చేదు అనిపించిన వాళ్ల నుంచి రియాక్షన్ ఎదురవుతోంది.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తనను విశాఖ ఎంపీ తిట్టడంపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. చంపించేస్తా నా కొడకా…లేపేస్తా, ఎవరడ్డమొస్తాడో చూస్తా అనేంత తీవ్రస్థాయిలో తోటి ఎంపీ నోరు పారేసుకున్నారంటే, ఆయన మనసు ఎంతగా గాయపడి వుంటే, అంతేసి మాట అని వుంటారో అనే చర్చకు తెరలేచింది. తనను విశాఖ ఎంపీ దూషించడానికి కారణాన్ని కూడా రఘురామే చెప్పారు.
విశాఖలో ఎంవీవీ భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్ ఘటనపై ఎన్‌ఐఏతో విచారణ జరపాలని గత నెల 17న ప్రధానికి లేఖ రాయడం ఆయనకు కోపం తెప్పించి వుంటుందని రఘురామ అన్నారు. పుణ్యానికి వెళితే పాపం ఎదురైనట్టుగా ఉందని ఆయన అన్నారు. తన మంచీచెడులను విశాఖ ఎంపీ చూసుకోలేరా? ఇతరుల వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ సమస్యలను కోరి తెచ్చుకోవడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఇతరులకు గిట్టని పనులు చేస్తూ, ఆంధ్రాకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. గతంలో గోరంట్ల మాధవ్‌తో కూడా ఇలాగే పెట్టుకుని దెబ్బలు తినే వరకూ వెళ్లడాన్ని పలువురు ఎంపీలు గుర్తు చేస్తున్నారు. ఇక సీఐడీ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. రఘురామను గెలిపించి తప్పు చేశామని సిగ్గుపడేలా చేస్తున్నారని నరసాపురం ప్రజానీకం అంటోంది.
గౌరవప్రదమైన ఎంపీ పదవిలో వుంటూ, దానికి వన్నె తెచ్చేలా నడుచుకోవడం మానేసి, మచ్చ తెస్తున్నాడని రఘురామపై నెటిజన్లు మండిపడుతున్నారు. రఘురామ ఇప్పటికైనా తన తీరు మార్చుకుని, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేస్తే , తిట్టడాలు, కొట్టడాలు లాంటి ఘటనలు చోటు చేసుకోవని హితవు చెబుతున్నారు.
తిట్టించుకుంటున్న, కొట్టించుకుంటున్న రఘురామకే కాదు, ఆయనపై ఆ పనులు చేసే వారు కూడా బహుశా సిగ్గుపడుతూ వుంటారు. తమకు ఆ పరిస్థితులు ఎదురైనందుకు. రఘురామకు ఎటూ ఏవీ లేవని, ఆయన వల్ల తాము కూడా ప్రజల్లో చులకన కావాల్సి వస్తోందని విశాఖ ఎంపీ తన సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం.