నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఆ లుక్ ఇలా వచ్చిందో లేదో అలా ట్రోలింగ్ షురూ అయింది. ప్రభాస్ లుక్ ఏమాత్రం బాగాలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ పై విమర్శలు దాదాపు తగ్గాయి. దీనికి కారణం తాజాగా రిలీజైన గ్లింప్స్.
ప్రాజెక్ట్-కె గ్లింప్స్ రిలీజైంది. అన్నట్టు ఈ గ్లింప్స్ గురించి చర్చించే ముందు ఓ చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఈ సినిమా పేరు ఇకపై ప్రాజెక్టు-కె కాదు. దీనికి 'కల్కి 2898 ఏడీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు.
పూర్తిగా ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది 'కల్కి 2898 ఏడీ'. టైటిల్ చూస్తుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. మహావిష్ణువు చివరి అవతారం కల్కి అనే విషయం తెలిసిందే. ఈ మేరకు గ్లింప్స్ లో కొన్ని షాట్స్ కల్కి అవతారాన్ని కూడా సూచించాయి.
గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. కాస్ట్యూమ్స్ నుంచి లైటింగ్ వరకు ప్రతిది హాలీవుడ్ స్టయిల్ లో ఉండేలా జాగ్రత్తపడ్డాడు నాగ్ అశ్విన్. అయితే ప్రారంభ సన్నివేశాలు మాత్రం కొన్ని హాలీవుడ్ సినిమాల్ని తలపించాయి.
మంచి-చెడుల మధ్య జరిగే భీకర యుద్ధంతో కలియుగం ముగుస్తుందనే విషయాన్ని గ్లింప్స్ లో చెప్పారు. ఇక టైటిల్ ప్రకారం చూసుకుంటే.. 2898 సంవత్సరంలో జరుగుతున్న కథగా 'కల్కి 2898 ఏడీ' ని చూపిస్తున్నారు.
సూపర్ హీరోగా ప్రభాస్ లుక్, అతడి ఎంట్రీ బాగుంది. అమితాబ్, దీపిక పదుకోన్ ను కూడా వీడియోలో చూడొచ్చు. కామిక్ కాన్ కు హాజరై, గ్లింప్స్ రిలీజ్ లో భాగమైన కమల్ హాసన్ మాత్రం వీడియోలో లేడు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
సినిమాను 2024లో రిలీజ్ చేస్తామని మాత్రమే ప్రకటించారు. ఇంతకుముందు చెప్పినట్టు సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ వేయలేదు. మొత్తమ్మీద కల్కి గ్లింప్స్ రావడంతో, ఫస్ట్ లుక్ పై ట్రోలింగ్ బాగా తగ్గింది.