30 త‌ర్వాత‌.. అమ్మాయి సింగిల్ గా.. హ్యాపీనేనా?

పాశ్చాత్య దేశాల్లో 30 యేళ్లు దాటిన త‌ర్వాత అమ్మాయిలు సింగిల్ గా ఉండ‌టం అనేది కొత్త‌గా చ‌ర్చ‌లోకి వ‌స్తున్న అంశం కాదు. అయితే భార‌త‌దేశానికి ఇదే కొత్త‌. 30 దాటిన త‌ర్వాత కూడా.. అనేదే…

పాశ్చాత్య దేశాల్లో 30 యేళ్లు దాటిన త‌ర్వాత అమ్మాయిలు సింగిల్ గా ఉండ‌టం అనేది కొత్త‌గా చ‌ర్చ‌లోకి వ‌స్తున్న అంశం కాదు. అయితే భార‌త‌దేశానికి ఇదే కొత్త‌. 30 దాటిన త‌ర్వాత కూడా.. అనేదే మ‌న‌కు ఒక పెద్ద ఆశ్చర్యార్థ‌కం. 

ఒక‌వైపు అబ్బాయిల్లో చాలా మందికి 30 దాటినా పెళ్లి కాలేద‌నే బెంగ ప‌ట్టుకుంది. చాలా ప్ర‌య‌త్నాలు చేసినా.. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో 30 దాటినా పెళ్లి కాని వారి సంఖ్య భారీగానే ఉంది. దీనికి కార‌ణాల్లో ఒక‌టి లింగ నిష్ఫ‌త్తిలో తేడా ఉండటం, దాంతో పాటు అమ్మాయిల‌కు పెరిగిన ప్రాధాన్య‌త‌ల రీత్యా పెద్ద ఉద్యోగం లేక‌పోయినా, భారీగా ఆస్తిపాస్తుల్లేక‌పోయినా, విదేశాల‌కు వెళ్లే ఛాన్సులు లేవ‌న్నా.. అబ్బాయికి పెళ్లే క‌ష్టం అయిపోతోంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో ఈ ధోర‌ణి క‌నిపిస్తూ ఉంది. ఒక హై క్లాస్ సంగ‌తి స‌రేస‌రి! వాళ్ల‌లో ఏదో జీవితంలో ఒక‌సారి విదేశానికి వెళ్ల‌డం కాదు, ఏడాదికో రెండు మూడు దేశాలు తిర‌గ‌గ‌లిగేంత స్థాయి ఉండాలి!

ఇక అబ్బాయిల పాట్లు అలా ఉంటే, అమ్మాయిల్లో 30 దాటినా పెళ్లి చేసుకోక‌పోవ‌డం, 35 ద‌గ్గ‌ర ప‌డుతున్నా సింగిల్ గా ఉండ‌టం రొటీన్ అవుతోంది. మ‌రి ఇండియ‌న్ సొసైటీలో 30 దాటినా ఒక అమ్మాయి పెళ్లి లేకుండా ఉంటే.. త‌న మానాన త‌ను హ్యాపీగా ఉండ‌గ‌ల‌దా? అనేదే ప్ర‌శ్న‌! ఇలాంటి వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నా..సొసైటీ మాత్రం 30 దాటాకా కూడా పెళ్లి చేసుకోక‌పోతే అమ్మాయిని చిన్న చూపు చూసే ధోర‌ణితోనే ఉంద‌నేది స‌త్యం. ఎందుకంటే.. అమ్మాయిల పెళ్లికి క‌నీస వయ‌సు పెరిగినా, నూటికి 90 మందికి 28 యేళ్ల లోపు అయితే పెళ్లి అవుతోంది. మిగిలిన ప‌ది శాతం మంది మాత్రం ఇంకాస్త వేరే ధోర‌ణితో వ్య‌వ‌హరిస్తూ ఉండ‌వ‌చ్చు.

ఇంత‌కీ 30 త‌ర్వాత కూడా ఎలాంటి వారు వివాహానికి దూరంగా ఉంటున్నారంటే.. చ‌దువుల్లో ఏ విదేశాల్లోనో పీహెచ్డీలు పూర్తి చేసుకురావాల‌నుకునే వారేమీ కాదు! ఇలాంటి వారు ఏ ఒక్క శాత‌మో ఉండ‌వ‌చ్చు. పెళ్లి అంటే అతి ఒక ర‌కంగా త‌మ లైఫ్ స్టైల్ కు ప్ర‌తిబంధ‌కంగా భావించే వాళ్లే 30 త‌ర్వాత కూడా సింగిల్ గా ఉండ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. పెళ్లి అంటే ఎవ‌డో ఒక‌డికి బానిస‌లా ప‌డి ఉండ‌టం అనే భావ‌న వారిని దానికి దూరంగా జ‌ర‌గ‌నిస్తోంది. సిటీ క‌ల్చ‌ర్ లో ఇలాంటి వాళ్లు ఎక్కువ‌.

ఇక విలేజ్ నుంచి వ‌చ్చినా.. కొంత‌మంది త‌మ‌ను అర్థం చేసుకునే వాడు కావాలి, త‌మ‌ను తెగ ఇష్ట‌ప‌డే వాడు కావాలి, తాము చెప్పిన‌ట్టుగా చేసే వాడు కావాల‌నే ధోర‌ణితో.. ఒక వైపు పెళ్లి సంబంధాల‌ను చూడ‌టాన్ని కొన‌సాగిస్తూనే, అన్నింటికీ నో చెబుతూ పోతుంటారు. ఇలాంటి వారికి ఎంత‌కూ తృప్తి తీర‌క‌.. సంబంధాల వేట‌లోనే సంవ‌త్స‌రాలు గ‌డిచిపోతూ ఉంటాయి. వీరి వ‌య‌సు 30 దాటేసినా.. ఇంకా సంబందాలను చూస్తూ సింగిల్ గా కాలం గ‌డిపేస్తూ ఉన్నారు.

మ‌రి కొంద‌రు కెరీర్ లో ఇంకా ఎదిగిపోవాల‌ని, అప్ప‌టికే ఉద్యోగం చేస్తూ.. అందులో మ‌రిన్ని హైట్స్ కు రీచ్ కావ‌డ‌మే ధ్యేయ‌మంటూ పెళ్లిని వాయిదా వేయ‌డం జ‌రుతుంటుంది. ఇంకొంద‌రు త‌మ లైఫ్ స్టైల్ కు, హాబీస్ కు పెళ్లిని అడ్డుగా భావిస్తూ ముప్పై త‌ర్వాత కూడా సింగిల్ గా సాగిపోతూ ఉంటారు. ఎలా చూసినా.. ప్ర‌స్తుత స‌మాజంలో ఒక ప‌ది శాతం మంది అమ్మాయిలు 30 త‌ర్వాత కూడా సింగిల్ గా కొన‌సాగుతున్నారు. మ‌రి వీరు త‌మ ధోర‌ణితో హ్యాపీగా ఉన్నారా.. అంటే త‌మ ఆనందానికి ఏమీ లోటు లేద‌ని వారు సూటిగా చెబుతున్నారు!

వారి ఆలోచ‌నా ధోర‌ణి వారికి రాజీ ప‌డ‌ద‌గినదిగా అనిపిస్తోంది కాబ‌ట్టే వారు సింగిల్ గా ఉంటున్నారు. పెళ్లే చేసుకోవాల‌నుకుంటే చేసుకోవ‌డం పెద్ద క‌ష్టం కాక‌పోయినా, వారి కార‌ణాల‌తో వారు సింగిల్ గా ఉంటున్నారు. ఒక్క డేటింగ్ యాప్ ఓపెన్ చేసినా రిలేష‌న్ ల‌భించడం పెద్ద క‌ష్టం కాదు ఈ రోజుల్లో. అయిన‌ప్ప‌టికీ వాటి జోలికి తాము వెళ్లి ఇబ్బందులు ప‌డ‌ద‌లుచుకోవ‌డం లేద‌నే మాట ఈ అమ్మాయిల నుంచి వినిపిస్తూ ఉంది. 

అయితే పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి అభిప్రాయాలే వినిపిస్తూ ఉంటాయి అమ్మాయిల నుంచి. అప్ప‌టికే ఒకటీ రెండు రిలేష‌న్ ల‌లో దెబ్బ‌తిని ఉండ‌టం, లేదా డేటింగ్ క‌ల్చ‌ర్ ఉన్న ఆ దేశాల్లో  సింగిల్ ఉండ‌టాన్ని అమ్మాయిలు క‌న్వీనెంట్ గానే ఫీల్ అవుతున్నార‌నే విష‌యాన్ని మీడియా ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చింది. ఇప్పుడు ఇండియా విష‌యంలో అదే జ‌రుగుతూ ఉంది. అయితే సామాజిక ధోర‌ణిలో మాత్రం తేడా ఉంది. 

పాశ్చాత్య దేశాల్లో సింగిల్ గా ఉండిపోవాల‌నే అమ్మాయిల‌కు స‌మాజం నుంచి తేడా చూపు ఉండదు. ఇండియాలో మాత్రం సిటీల‌ను ప‌క్క‌న పెడితే, సింగిల్ గా ఉండే అమ్మాయంటే చిన్న చూపే!