వివేకా హత్య కేసులో సీబీఐ తుది చార్జిషీట్ సంచలనం రేకెత్తిస్తోంది. గతంలో తానే వేసిన చార్జిషీట్లో గూగుట్ టేక్ అవుట్‌కు సంబంధించిన సమాచారం తప్పని, తుది చార్జిషీట్లో సీబీఐ పేర్కొనడం గమనార్హం. దీంతో విచారణలో నిజాలు నిగ్గు తేల్చడంలో సీబీఐ ఔట్ అయ్యిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు వేసిన తుది గడువు ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో గత బుధవారం దర్యాప్తు సంస్థ తుది చార్జిషీట్‌ను వేసింది. వివేకా హత్య కేసులో నిందితులను గూగుల్ టేక్ అవుట్ పట్టించిందని ఇంత కాలం సీబీఐ చెబుతూ వచ్చింది. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన సాంకేతిక సమాచారం ఆధారంగానే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితులు సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకాను హత్య చేసిన అనంతరం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లోనూ, ఇంటి పరిసరాల్లోనూ ఉన్నారని గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నట్టు సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇదే సీబీఐ ఇప్పుడు మాట మార్చింది. సీబీఐ రెండు నాల్కుల ధోరణి గురించి చెప్పుకుందాం.
“మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో 2019, మార్చి 14న రాత్రి సునీల్ యాదవ్ వున్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. సునీల్ సెల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించాం” అని సీబీఐ గతంలో పేర్కొంది. తాజాగా తుది నివేదికలో మాట మార్చింది. అబ్బే… అదంతా నిజం కాదని సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో స్పష్టం చేసింది.
“వివేకా ఇంట్లో 2019, మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత సునీల్ యాదవ్ లేడు. 2019, మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, 8.12 గంటలకు ఇంటిలోపల వున్నాడు. గతంలో గ్రీన్విచ్ కాలమానం ప్రకారం గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నాం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. భారత కాలమానం ప్రకారం దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో సమాచార సేకరణలో పొరపాటు పడ్డాం” అని సీబీఐ అత్యంత కీలకమైన చివరి చార్జిషీట్లో పేర్కొనడం సంచలనం రేకెత్తిస్తోంది.
వివేకా హత్య కేసులో చివరి చార్జిషీట్ అత్యంత కీలకమైందని కొంత కాలంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ చార్జిషీట్ వివేకా హత్య కేసులో దోషులెవరో తేలుతుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయానికి సంబంధించి ఇంత కాలం సాగుతున్న ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని సీబీఐ వేసిన తుది చార్జిషీట్ తేల్చి చెబుతోంది.
అంతేకాదు, కడప ఎంపీ సీటే హత్యకు దారి తీసిందనే వాదనలో కూడా పస లేదని ఇదే చార్జిషీట్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తనకిచ్చిన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ బయట పెట్టింది. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ సీటును ఆశించలేదని వైఎస్ షర్మిల వాంగ్మూలం ఇచ్చినట్టు సీబీఐ పేర్కొంది. అలాగే ఎన్నికలకు మూడు నెలల ముందు బెంగళూరులోని తన ఇంటికి వైఎస్ వివేకా వచ్చారని, ఎంపీగా పోటీ చేయాలని కోరారని ఆమె తెలిపారు. కానీ తనకు ఆ సమయంలో కడప రాజకీయాలపై ఆసక్తి లేదని చిన్నాన్నకు స్పష్టం చేసినట్టు షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొందని సీబీఐ చార్జిషీట్ వేసింది.
దీంతో బయట ప్రచారం అవుతున్న దానికి, వాస్తవాలకు పూర్తిగా విరుద్ధం వుందని తేలిపోయింది. వివేకా హత్య కేసులో ఇంత కాలం వైఎస్ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేసి, చివరికి తేల్చలేక సీబీఐ చేతులెత్తేసిందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. అవినాష్‌ను టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఇరకాటంలోకి నెట్టాలనే రాజకీయ అదృశ్య శక్తుల కుట్రలు పని చేయలేదని చెప్పొచ్చు.