నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తే.. ప్రత్యర్థుల మీద బురద చల్లడానికి.. మధ్యలో ఇతర ప్రభుత్వ వ్యవస్థలను కూడా బజారుకీడుస్తూ చులకనగా మాట్లాడితే, లేకిగా ప్రవర్తిస్తే.. అందరూ చూస్తూ ఊరుకుంటారని అనుకోవడం భ్రమ. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను, పారదర్శకంగా లబ్ధిదారులకు అందించడానికి జగన్ సర్కారు ఏర్పాటుచేసిన అద్భుతమైన వాలంటీరు వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్ నోటిదూకుడుతో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి.
రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడానికి.. మానవ అక్రమరవాణా వ్యవహారాలకు వాలంటీరు వ్యవస్థ కారణం అంటూ పవన్ కల్యాణ్ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు ప్రతిష్ఠ ప్రజల్లో పెరుగుతుండడానికి వాలంటీర్లుకూడా ఉపయోపగడుతున్నారనే అక్కసుతో అనుమానంతో పవన్ ఆ వ్యవస్థనే కించపరిచేలా మాట్లాడారు. అయితే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోలేదు. ఆయన మీద ప్రాసిక్యూషన్ కు ఆదేశిస్తూ జీవో జారీచేసింది.
వారాహి యాత్రలో ఏలూరు సభలో అన్నమాటలపై.. పవన్ పై కేసు నమోదు చేసేందుకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్సీఆర్డీ నివేదిక ప్రకారం ఏపీలో మొత్తం 29 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని అన్నారు. 14వేల మంది ఆచూకీ మత్రం పోలీసులకు దొరికిందన్నారు.
వాలంటీర్ల వ్యవస్థ సేకరిస్తున్న వివరాలను వాడుకుని మహిళల అక్రమ రవాణా జరుగుతున్నదని ఆరోపించారు. దీనిపై వాలటీర్లు ఆగ్రహించి పవన్ పట్ల నిరసనలుతెలియజేయడం జరిగింది. ఆయన బొమ్మలను చెప్పులతో కొడుతూ, దిష్టిబొమ్మలను దహనం చేస్తూ అనేక రూపాల్లో వారి నిరసనలను తెలియజేశారు. అయితే ఈ నిరాధార ఆరోపణలతో వలంటీర్ల వ్యవస్థ పరువు తీశారనే ఆరోపణతో ఆయన మీద సీఆర్ పీసీ 199(4) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు.
ఈ జీవో మీద కూడా పవన్ రెచ్చిపోతున్నారు. తాను ఏ విషయం కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడని, పర్యవసానాలు ఏమైనా సరే సిద్ధంగా ఉంటానని ఆయన అంటున్నారు. కానీ.. 29వేల మంది మహిళలు అదృశ్యం అయినట్టుగా, అక్రమరవాణా అయినట్టుగా చెప్పేసిన పవన్ ఆ వ్యాఖ్యలను నిరూపించడం ఒక పట్టాన తేలే సంగతి కాదు. 14వేల మంది మహిళలు పోలీసులకు దొరికారని అంటున్నారు. వారి వివరాలు ఉంటాయి గనుక.. వారి ద్వారా.. అక్రమరవాణాకు గురయ్యారో ఇంకేమైనా కారణాలున్నాయో తేలుతుంది.
తాను చేసిన ఆరోపణలకు ఆయన ఆదారాలు చూపడం కష్టం. న్యాయపరంగా వాతావరణం ఆయనకు ప్రతికూలంగా ఉన్నదనే నిపుణులు చెబుతున్నారు. సీఆర్పీసీలో ఈ సెక్షన్ 199(4) కింద చేసే నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష పడుతుంది. బెయిల్ వస్తుంది, జరిమానాకు అవకాశం ఉంది. పవన్ ఈ మాటల ద్వారా.. రెండున్నర లక్షల మంది వాలంటీర్ల ప్రతిష్ఠను దెబ్బతీశారని ప్రభుత్వం కోర్టులో గట్టిగా వాదన వినిపిస్తే గనుక.. ఆయనకు శిక్ష తప్పదు.
రెండేళ్ల జైలుశిక్ష పడిందంటే.. పవన్ రాజకీయ జీవితం అక్కడితో అంతం అవుతుంది. అప్పీలుకు అవకాశం ఉంటుంది గానీ.. జైలుశిక్ష పడ్డ తర్వాత.. ఆయన ఎన్నికల్లో పోటీచేయడానికి ఉండదు. ఆరేళ్లపాటు ఎన్నికలకు దూరం అవుతారు! పవన్ తన నోటిదూల కారణంగా జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానానికి ఎండ్ కార్డు వేసుకున్నట్టుగా అవుతుందని నిపుణులు అంటున్నారు.