బ్రిటన్‌ బాటలో నడవలేమా?

అనేక విషయాల్లో మనం విదేశాలను అనుసరిస్తున్నాం. అక్కడి సంస్కృతిని దిగుమతి చేసుకుంటున్నాం. టెక్నాలజీని తెచ్చుకుంటున్నాం. మన దేశంలో ఏదైనా విధానం ప్రవేశపెట్టాలంటే అది విదేశాల్లో ఏవిధంగా అమలు చేస్తున్నారోనని అక్కడికెళ్లి అధ్యయనం చేస్తున్నాం. ఇక…

అనేక విషయాల్లో మనం విదేశాలను అనుసరిస్తున్నాం. అక్కడి సంస్కృతిని దిగుమతి చేసుకుంటున్నాం. టెక్నాలజీని తెచ్చుకుంటున్నాం. మన దేశంలో ఏదైనా విధానం ప్రవేశపెట్టాలంటే అది విదేశాల్లో ఏవిధంగా అమలు చేస్తున్నారోనని అక్కడికెళ్లి అధ్యయనం చేస్తున్నాం. ఇక ఆర్థిక రంగంలోనైతే విదేశాలకు ఎర్ర తివాచీ పరుస్తున్నాం. ఇన్ని చేస్తున్న మనం కొన్ని మంచి విధానాలను ఎందుకని అనుసరించలేకపోతున్నాం? వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని తయారుచేసుకున్నప్పటికీ ప్రధానంగా మన రాజ్యాంగం బ్రిటన్‌ రాజ్యాంగాన్ని అనుసరించి ఉంటుంది. మన పాలనా వ్యవస్థను బ్రిటన్‌ పాలనా వ్యవస్థ ఆధారంగానే రూపొందించుకున్నాం. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్‌ పాలకులు మన దేశాన్ని పాలించినప్పుడు చేసిన చట్టాలే ఇంకా అమల్లో ఉన్నాయి. చాలా విషయాల్లో బ్రిటన్‌ బాటలో నడుస్తున్న మనం వారు తీసుకొస్తున్న ఒక మంచి చట్టాన్ని అధ్యయనం చేసి మన దేశంలోనూ అమలు చేయొచ్చు కదా..! నిజానికి ఇది కొత్త విషయం కాదు. మన దేశంలోనూ ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండే. ఎంతో కాలంగా జరుగుతున్న చర్చే. అదే..‘రైట్‌ టు రీకాల్‌’. ఒక్కమాటలో చెప్పాలంటే తప్పు చేసిన ప్రజాప్రతినిధులను చట్టసభల్లో ఉండకుండా చేయడం.

ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ప్రజలకు వారు తప్పు చేస్తే, ప్రజా కంటకంగా తయారైతే వెంటనే తప్పించే అవకాశం లేదు. మళ్లీ ఎన్నికల్లోనే వారి జాతకం తేలుతుంది. అంటే ఎన్నుకున్న తరువాత ఐదేళ్ల పాటు ప్రజాప్రతినిధులను ప్రజలు భరించాల్సిందే. ఇన్నేళ్లు ఎందుకు భరించాలి? మధ్యలోనే ఇంటికి ఎందుకు పంపకూడదు? ఆ హక్కు ప్రజలకు ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశాల్లో తలెత్తుతున్న మౌలికమైన ప్రశ్న. ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసిన బ్రిటన్‌లోనూ శతాబ్దాలుగా అవినీతి నేతలను ప్రజలు భరిస్తూనే ఉన్నారు. ఎన్నుకున్న నేతలు అవినీతికి పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేకపోయారు. కాని..తప్పు చేసిన నేతలు చట్ట సభల్లో ఉండకూడదనే వాదన క్రమక్రమంగా బలం పుంజకుంది. ఈ వాదన బలపడటానికి, డిమాండ్‌ విస్తృతం కావడానికి అక్కడ జరిగిన అనేక కుంభకోణాలు దోహదం చేశాయి. ప్రధానంగా 2009లో ‘ది డెయిలీ టెలిగ్రాఫ్‌’ సృష్టించిన ప్రకంపనలు రీకాల్‌ బిల్లు తేవాలనే డిమాండ్‌ను మరింత బలపరిచాయి. బ్రిటన్‌ ఎంపీల అవినీతిపై, వారు ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్న తీరుపై ది డెయిలీ టెలిగ్రాఫ్‌ వరస కథనాలు ప్రచురించడం దేశంలో సంచలనం కలిగించింది. ఎంపీలంతా ఠారెత్తిపోయారు. కొందరు వారికి వారే రాజీనామాలు చేయగా, కొందరిని పార్టీలే బయటకు వెళ్లగొట్టాయి. కొందరు ప్రజల వద్దకు వెళ్లి క్షమాపణలు వేడుకున్నారట.

బ్రిటన్‌లో కాబట్టి ఇలా జరిగిందిగాని మన దేశంలో అంతగా పట్టించుకునేవారు కాదు. ఈ కుంభకోణం తరువాతనే రీకాల్‌ పై ఎక్కువ చర్చలు జరిగాయి. మొత్తం మీద గత నాలుగేళ్లుగా జరిగిన విస్తృత చర్చల తరువాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రేపు కీలక చర్చ జరుగుతుంది. దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లు తేవడంపై సుముఖంగానే ఉన్నాయి. కాబట్టి ఇది చట్టం కావడం కష్టం కాదు. మన దేశంలోనూ రీకాల్‌ విధానం ఉండాలని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. మేధావులు, న్యాయ కోవిదులు, సామాజిక కార్యకర్తలు కూడా ఇదే మాట చెబుతున్నారు. కాని దీనిపై రాజకీయ నాయకులకు ఆసక్తి లేదు. తమ రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగే లేదా రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ఏ విధానాన్ని నాయకులు అంగీకరించరు.

వాస్తవానికి నేరం చేసిన నాయకులు ఉంటే జైల్లో ఉండాలి లేదా ఇంట్లో ఉండాలి. కాని మన దేశంలో నేరగాళ్లంతా చట్టసభల్లోనే ఉంటారు. ఎంపీల్లోగాని, వివిధ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల్లోగాని కేసులు లేనివారు చాలా తక్కువ. తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నవారు మంత్రులై చట్టాలు చేస్తున్నారు. 2011లో అప్పటి ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ రీకాల్‌ విధానం మన దేశంలో ప్రవేశపెట్టడం కష్టమని చెప్పారు. మనది చాలా పెద్ద దేశమని  అది ఇక్కడ అమలు చేయడం కష్టమని అన్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాలు రీకాల్‌ విధానాన్ని వ్యతిరేకించాయన్నారు. మన దేశంలో రీకాల్‌ విధానం రాకపోయినా ‘రైట్‌ టు రిజెక్ట్‌’ విధానం ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. పాలకులు తలచుకుంటే రీకాల్‌ విధానం అమలు చేయడం కష్టం కాకపోవచ్చు. కాకపోతే చిత్తశుద్ధి ఉండాలి.