చిరంజీవి మంచి నటుడు. తెలుగు సినిమా పరిధిని అవధులు మించి తీసుకెళ్లారు. డాన్సులు, ఫైట్లు కేవలం ఉపాంగాలుగా వుండే రోజుల్లో సినిమాల్లో ప్రవేశించి, వాటికి ఎక్కడ లేని ప్రాధాన్యతా తెచ్చిపెట్టారు. మగవాళ్లు ఫైట్లు చేస్తే చూడవచ్చు, డాన్సులు చేస్తే చూడగలమా? అనుకునే రోజుల్లో నాగేశ్వరరావుగారు స్టెప్పులేసి చూపించారు. దానితో తప్పనిసరి పరిస్థితుల్లో యితర నటులు కూడా 'స్టెప్పులు' వేశారు. కానీ చిరంజీవి ఫుల్ స్కేల్ డాన్సే చేసేశారు. ఆయన డాన్సుల కోసం, ఫైట్ల కోసం ఆడిన సినిమాలున్నాయి. ఇప్పుడు డాన్సు చేయని హీరోలను వూహించే పరిస్థితి లేదు. ఒక తరం యువతను చిరంజీవి విపరీతంగా ప్రేరేపించారు. ఆయన ముందు తరం హీరోలు స్వయంకృషితో పైకి వచ్చినట్లు చూపగా కసితో, పట్టుదలతో అనుకున్నది సాధించడం అనేది యీయన తెరపై చాలా బాగా ఆవిష్కరించి చూపారు. అలాటి పాత్రలు యితరులు కూడా వేసినా చిరంజీవి నటనలో వున్న 'ఇంటెన్సిటీ' ఆయనను అగ్రశ్రేణిలో నిలబెట్టింది. పోనుపోను ఆయన నటనలో చాలా యీజ్ వచ్చింది. కామెడీని కూడా అవలీలగా చేయగలనని చేసి చూపించారు. తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా క్లీన్ రికార్డు మేన్‌టేన్ చేశారు. ఏ గాడ్‌ఫాదర్ లేకుండా కేవలం తన ప్రతిభతో పైకి వచ్చారన్న విషయాన్ని అందరూ గుర్తించారు. వచ్చిన తర్వాత కూడా ఎదిగేకొద్దీ ఒదగాలన్న సూక్తిని అమలు చేసి చూపారు. సభావేదికపై ఆయన వినయం, నవ్వు మొహం, మర్యాద కొట్టవచ్చినట్టు కనబడతాయి. ఆయన ఎవరితో విరోధం పెట్టుకున్నట్టు కనబడదు. నచ్చకపోతే దూరమై పోతాడు తప్ప, పబ్లిగ్గా ఛాలెంజ్‌లు విసరడాల్లాటివి లేవు. పెద్దపెద్ద దర్శకుల వద్ద పనిచేసినపుడు కూడా అదే ఒద్దిక చూపారు. కలహించి సినిమా మధ్యలో మానుకోవడాలు వార్తల వరకు రాలేదు.
ఇన్ని సుగుణాలు, యింత టాలెంటు వున్న ఆయన గత కొన్నేళ్లగా సినిమాలు వేయడం లేదంటే అంతకంటె విషాదం యింకేం వుంటుంది? ఆయనకు 60 యేళ్లు పూర్తయిన యీ వేళ సింహావలోకనం చేసుకుని చూసుకుంటే అనిపిస్తుంది – చిరంజీవి తన కెరియర్‌ను యింతకంటె బాగా ప్లాన్ చేసుకుని వుంటే బాగుండేదేమో అని! (ముందుగా ఒక సాంకేతికపరమైన సందేహం. 60 ఏళ్లు పూర్తయితే షష్టిపూర్తి అంటాం. ఈయన విషయంలో ఆ వేడుకకు ఆ పేరు పెట్టలేదెందుకో! పైగా 60వ పుట్టినరోజు అన్నారు. ఆగస్టు నెలలోనే 69వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకున్నాం. స్వాతంత్య్రం వచ్చాక 8 ఏళ్లకు పుట్టిన చిరంజీవిగారికి ఆగస్టులో వచ్చినది 61వ పుట్టినరోజు అవుతుంది) కెరియర్ గురించి నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలంటే ఆయన స్టార్ ఇమేజే ఆయన కాళ్లకు సంకెలగా మారింది. 'చిరంజీవి సినిమా అంటే బ్లాక్ బస్టర్ అయి వుండాలి. తారాగణం, సాంకేతికగణం అన్నీ మెగా స్థాయిలో వుండాలి. ఆయన సినిమా ముందు తక్కినవన్నీ వెలతెలబోవాలి' అనే అంచనా ఆయన ప్రగతికి గుదిబండగా మారింది. ఆయన సినిమాలు ఒకదాన్ని మించి, మరొకటి హిట్ అయిపోతూ వుండడం, దాన్ని బట్టి ఆయనపై అభిమానుల ఆశలు పెరిగిపోవడం ఆయన తప్పు కాదు కదా అనవచ్చు. కానీ ముందుచూపు వున్న నటుడు ఆ స్టేజిలోనే జాగ్రత్తపడతాడు. అమితాబ్ బచ్చన్‌ను చూస్తే ఆ విషయం బాగా అర్థమౌతుంది. స్టార్‌డమ్ కలకాలం వుండదని ఆయన గ్రహించాడు కాబట్టి, తారగా తళుకుబెళుకు తగ్గిపోయిన తర్వాత కూడా నటుడిగా కొనసాగేందుకు వీలుగా ముందు నుండీ ప్లాన్ చేసుకున్నాడు. ఒక పక్క మాస్ స్టార్‌గా వేస్తూనే అనేక హృషీకేశ్ ముఖర్జీ తరహా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. కమ్మర్షియల్ సినిమాల స్థాయిలో ఆ సినిమాలు హిట్ కాలేదు. కానీ ఆ విధంగా డీ గ్లామరైజ్‌డ్ అమితాబ్‌ను చూడడానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అలాటి పాత్రలు అంగీకరించడానికి ఆయనా అలవాటు పడ్డాడు. అందువలన స్టార్‌గా కెరియర్ ముగిసిపోగానే, యాక్టర్‌గా పుంజుకోవడానికి సులభమైంది. ఇప్పుడు పూర్తి నెగటివ్ పాత్రలు కూడా సునాయాసంగా వేసేస్తున్నాడు.
ఆయన కంటె చిరంజీవి 13 ఏళ్లు చిన్నవాడు. చిరంజీవి నటనా జీవితానికి సెమికోలన్ పడి ఎనిమిదేళ్లయింది. (అతిథి పాత్రలు వదిలేయండి) అప్పుడాయనకు 52 ఏళ్లు. అమితాబ్ విషయంలో ఆయన తన 52 వ యేటి నుంచి యిప్పటివరకు గత 21 ఏళ్లగా దాదాపు నూరు సినిమాలు వేశారు. వాటిలో కభీ ఖుషీ కభీ గమ్.., మొహబ్బతే, ఏకలవ్య, ఆంఖే, సర్కార్, వీర్ ఝారా, బాగ్‌బాన్, పా, ఆంఖే, బుడ్‌ఢా హోగా తేరా బాప్, బడేమియా-ఛోటేమియా.. యిలాటి ఎన్నో సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రలు వేశారు. చిరంజీవి విషయంలో అలాటిది ఊహించగలమా? ఆయన కెరియర్ యింకెన్నాళ్లు వుండబోతోంది? వాటిలో ఎన్ని సినిమాలు వేయబోతున్నారు? ఎంతో నటనాపటిమ వుండి, మందీమార్బలం, హంగూ ఆర్భాటం వుండి కూడా చిరంజీవి వృత్తిజీవితంలో యింత గ్యాప్ రావడమేమిటి? రాజకీయాల్లోకి వెళ్లడం చేత అనేది సులభంగా తట్టే సమాధానం. కానీ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కొత్తలో, తర్వాత మంత్రి అయిన తర్వాత తప్ప తక్కిన రోజుల్లో ఆయనకు రాజకీయాలు పార్ట్-టైమ్ వ్యవహారంగానే వున్నాయి. మహా అయితే 12-18 నెలలు దాని కింద తీసేసినా కనీసం ఆరేళ్లు వృథాగా పోయింది. ఎందువలన? తన యిమేజికి తగిన కథలు రావటం లేదని ఆయన ఫీల్ కావడం చేత! ఈ 150 వ సినిమా గురించి న్యూస్ యివాళ్టిదా చెప్పండి. ఆరేళ్లగా వింటున్నాం. ఇప్పటిదాకా ఏదీ తేల్చుకోలేక పోతున్నారు. ఎందుకంటే చిరంజీవి సినిమా అనగానే యిద్దరు హీరోయిన్లుండాలి, ఫైట్లుండాలి, డాన్సులుండాలి, మసాలా వుండాలి, కామెడీ వుండాలి, దేశానికి సందేశం వుండాలి, రాజకీయపరమైన యిమేజికి యిబ్బంది వుండకూడదు, నేటి యువహీరోలకు ఏ మాత్రం తీసిపోనని ఆయన నిరూపించుకోవడానికి స్కోపు వుండాలి, అన్నిటినీ మించి అది రికార్డులు బద్దలు కొట్టాలి.
ఇన్ని గుణకార, భాగహారాల మధ్య కథ కుదరటం లేదు. ఈ లెక్కల్లో ఆయనకు వయసు పెరుగుతోంది, మరిందరు కుర్రహీరోలు తయారవుతున్నారు, బాహుబలి సినిమా వచ్చి ఎవరికీ ఓ పట్టాన అందనంత కొత్త రికార్డు నెలకొల్పింది, మధ్యలో ప్రేక్షకులకు ఆయన నటన చూసే అవకాశం మిస్సవుతోంది. చిరంజీవి సినిమా అనగానే యీ దినుసులన్నీ వుండి తీరాలి, కమ్మర్షియల్‌గా సక్సెసయి తీరాలి అని పట్టుబట్టి కూర్చోవడం వలననే విలువైన సమయం వృథా అవుతోంది. అలాటి శషభిషలు పెట్టుకోకపోవడం చేతనే అమితాబ్ యాక్టర్‌గా అందరినీ అలరించగలుగుతున్నారు. అమితాబ్ లాగానే కమ్మర్షియల్ సినిమాలతో బాటు పారలల్ సినిమాల్లో వేయడానికి చిరంజీవి కూడా ప్రయత్నించకపోలేదు. కానీ అలాటివి ఎన్ని సినిమాలున్నాయి చెప్పండి. 32 ఏళ్ల వయసులో ''రుద్రవీణ'', 33 ఏళ్ల వయసులో ''స్వయంకృషి'', 37 ఏళ్ల వయసులో ''ఆపద్బాంధవుడు''. వయసు వస్తున్న కొద్దీ అలాటివి ఎక్కువగా వేసి వుండాల్సింది కానీ అవి సరిగ్గా ఆడలేదని ఆ మార్గం వదిలేశారు. తను వేసిన ఆ తరహా సినిమాలు కొన్ని ఫెయిలవుతున్నా అమితాబ్ ఆ ఛానెల్ తెరిచే వుంచుకున్నారు కాబట్టి స్టార్ నుంచి యాక్టర్‌గా సులభంగా మారిపోగలిగారు. మధ్యవయసు వచ్చిన కొద్దీ చిరంజీవి కథను తన చుట్టూ తిప్పుకుంటూ వచ్చారు – గ్లామర్ తగ్గలేదని చూపుకోవడానికి కాబోలు! కెరియర్ మొదట్లో వేసిన ''47 రోజులు'', ''రాణువ వీరన్'' వంటి నెగటివ్ పాత్రల జోలికి మళ్లీ వెళ్లలేదు.
ఆయన కంటె అయిదేళ్లు పెద్దవాడైన రజనీకాంత్‌కి కూడా యిలాటి అవస్థ వుంది కానీ ఆయన తన సినిమాల్లో కథ బలంగా వుండేట్లు చూసుకున్నారు. దానికి తన స్టయిల్‌తో మెరుగులు దిద్దారు. కానీ చిరంజీవి కథ ప్రాధాన్యత కంటె సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకోవడానికి ప్రయత్నించి భారం పెంచుకున్నారు. ''నరసింహ'' సినిమాలో రజనీకాంత్ తనతో సమానమైన పాత్రను రమ్యకృష్ణకు యిచ్చి భారం పంచుకున్నారు. ''బాషా'', ''అరుణాచలం'', ''అన్నామలై'' ''ముత్తు'', ''రోబో'' వంటి అనేక రజనీకాంత్ సినిమాల్లో కథ, స్క్రీన్‌ప్లే బలంగా వున్నాయి. ''చంద్రముఖి''లో రజనీ పాత్ర నిడివి పరంగా పెద్దది కాదు. అలాటి పాత్రను చిరంజీవి తెలుగులో వేసి వుండవచ్చు. రజనీ సినిమాల్లో ఫెయిల్యూర్స్ కూడా వున్నాయి. కానీ అనారోగ్యంగా వున్నా నటుడిగా ఆయన ప్రస్తుతం బిజీగా వున్నాడు. ఆరోగ్యంగా వున్నా చిరంజీవి నటుడిగా యాక్టివ్‌గా లేరు. అదీ బాధ. కమలహాసన్‌ను యాక్టర్‌గా, రజనీకాంత్‌ను స్టార్‌గా చూస్తాం కాబట్టి చిరంజీవిని రజనీకాంత్‌తోనే పోల్చి చూడాలి. ''నరసింహ''లో రజనీకాంత్ ద్వితీయార్థంలో పెళ్లీడుకు వచ్చిన పిల్ల తండ్రిగా వేశారు. చిరంజీవి యీ దశలో అలాటి పాత్రను అంగీకరిస్తారా? అంగీకరించి వుంటే రీమేక్ చేసి వుండేవారేమో! అంతెందుకు, ''దృశ్యం'' సినిమా చిరంజీవి వేసి వుండవచ్చు. కానీ ఆయన చూపు ''గబ్బర్‌సింగ్'' వంటి సినిమా మీదే వుంది. ఇటీవలే వేదికపై ఆ సంగతి చెప్పారు.
అసలు యీ 150 అంకెపై అంత అబ్సెషన్ దేనికి? ఆ అంకె చేరడానికి ''స్టయిల్'', ''మగధీర''లో వేసిన అతిథి పాత్రలను కూడా 148, 149గా చెప్పేసి ఈ 150 మీద భారం పెట్టేశారు. దాంతో ఆయనకూ, అభిమానులకూ నెర్వస్‌నెస్. మామూలు సినిమా ప్రేక్షకుడికి యీ అంకెల గోల లేదు. రజనీకాంత్ 150 వ సినిమా ఏదో ఎవరైనా పట్టించుకున్నామా? సినిమా బాగుంటే చూశాం, లేకపోతే తిరక్కొట్టాం. ఇప్పుడైతే హీరోలు ఏడాదికి, రెండేళ్లకో సినిమా వేస్తున్నారు కాబట్టి దేని తర్వాత ఏది వస్తుందో చెప్పగలుగుతున్నారు. గతంలో వరసగా వేసుకుంటూ వెళ్లిపోయే రోజుల్లో ఏ సినిమా ముందు వస్తుందో, వెనక వస్తుందో చెప్పలేకపోయేవారు. ఇప్పుడు కూడా చిరంజీవి 150, 151, 152 సినిమాలు ఒక్కసారి ఎనౌన్సు చేసి దిగితే ఏది ముందు వస్తుందో ఎవరూ చెప్పలేరు. షూటింగు అయిపోయినా కంప్యూటర్ గ్రాఫిక్స్ దగ్గర ఆలస్యమై పోతోంది. ప్రతీ కళాకారుడికీ, మీదు మిక్కిలి నటుడికి మామూలుగానే టెన్షన్ వుంటుంది – గతంలో కంటె మెరుగ్గా చేయాలనే ప్రెషర్ వుంటుంది. అది సాధ్యం కాదని అభిమానులకు చెప్పినా వారు వినిపించుకోరు. అందువలన వారిని దబాయించి మనకు నచ్చినవి మనం చేసుకుంటూ పోవాలి. ఇలా 150వ సినిమా ప్రతిష్ఠాత్మకమైనది అని మనమే టెన్షన్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పటికీ కాలు ముందుకు పడదు. పడ్డాక కూడా లక్ష సందేహాలు వస్తాయి.
రాజ్ కపూర్ కెరియర్ ఒకసారి పరికించండి. ఆయనకు దర్శకత్వంలో ఆసక్తి. ఆ విభాగంలోనే చేరి, నటుడయ్యాడు. హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూండగానే నిర్మాత-దర్శకుడిగా మారి ''ఆగ్'' అనే సినిమా కొత్తరకంగా తీశాడు. ఆడలేదు. అప్పుడు ''బర్సాత్'' అని మ్యూజికల్, రొమాంటిక్ సినిమా తీశాడు. బాగా డబ్బు వచ్చింది. ఇక వరుసగా కమ్మర్షియల్ సినిమాలు తీశాడు. వాటి మీద వచ్చిన డబ్బుతో ఆర్‌కె స్టూడియో కట్టాడు. కమ్మర్షియల్స్ తీస్తూనే తనలో వున్న కళాతృష్ణను చల్లార్చుకోవడానికి ''జాగ్‌తే రహో'' వంటి నవ్యధోరణి సినిమా తీశాడు. తనే హీరో. చింపిరి దుస్తులతో, మాసిన గడ్డంతోనే సినిమా అంతా కనబడతాడు. పాటే కాదు, మాటా లేదు. చివర్లో అయిదు నిమిషాలు తప్ప! ''బూట్ పాలిష్'' అని పిల్లలపై సినిమా తీశాడు. దానిలో లోకల్ ట్రెయిన్ ప్రయాణీకుడిలా తను ఒక్కసారి కనబడి మాయమై పోతాడు. ''అబ్ దిల్లీ దూర్ నహీ'' సినిమాను ఒక బాలనటుడు ప్రధాన పాత్రధారిగా తీశాడు. వీటిలో కొన్ని ఆడాయి. కొన్ని ఆడలేదు. నష్టాలను తట్టుకోవడానికి ఆయనకు వేరే చోట నుండి డబ్బు వచ్చింది. రంగుల సినిమాలు వచ్చిన చాలా రోజులకు ''సంగమ్'' అని కలర్‌లో, విదేశాల్లో షూట్ చేసి తీశాడు. సూపర్‌గా ఆడింది. తర్వాతి సినిమా వచ్చేందుకు ఆరేళ్లు పట్టింది. ''సంగమ్'' కంటె బాగా తీయాలన్న పట్టుదలే దానికి కారణం. చివరకు ''మేరా నామ్ జోకర్'' వచ్చి ఘోరంగా ఫ్లాపయింది. హీరోగా తన రోజులు చెల్లిపోయాయని గుర్తించి, డైరక్టర్‌గా స్థిరపడి ''బాబీ''తో మొదలుపెట్టి మళ్లీ అనేక సూపర్ హిట్ సినిమాలు తీశాడు.
చిరంజీవికి కూడా ఆర్థికంగా మంచి దన్ను వుంది. ప్రొడక్షన్ హౌస్ వుంది. ఇతరులను పెట్టి ''బూట్ పాలిష్'' వంటి ప్రయోగమో, తనతో ''జాగ్‌తే రహో'' వంటి ప్రయోగమో చేసి వుండవచ్చు. అలాటిది ఏదీ చేయలేదు. రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ వేషాలు తగ్గినపుడు డైరక్షన్‌వైపు వెళ్లిపోయారు. చిరంజీవి ఆ దిశగా ఆలోచించలేదు. అలాటప్పుడు తనలో వున్న నటరాజ అంశను పూర్తిగా ఆవిష్కరించే అవకాశం కూడా లేకుండా తనే అవరోధాలు కల్పించుకుంటున్నారు. స్టార్ ఇమేజి చట్రం చాలా పటిష్టమైనది. దాన్ని బద్దలు కొట్టడం మాటలు కాదు. అంతరాళంలోకి దూసుకుపోయే రాకెట్ ఒక్కో కక్ష్యను దాటుకుంటూ వెళుతున్నపుడు బరువు వదుల్చుకుంటూ వెళుతుంది. తనను పైకి తీసుకు రావడానికి ఉపయోగపడిన ప్లాట్‌ఫాంనే పై ఆర్బిట్‌లోకి వెళ్లాక వదిలిపెట్టేస్తుంది. అప్పుడే ముందుకు దూసుకుని వెళ్లగలుగుతుంది. అలాగే తారామండలంలోకి ఉవ్వెత్తున ఎగసి వెళ్లడానికి చిరంజీవికి స్టార్ యిమేజి ఉపయోగపడింది. ఆయన దానిని ఏ 45 వ ఏటో వదిలిపెట్టేసి వుంటే భారరహితంగా ముందుకు సాగి యింకా ఎన్నో సినిమాలు, మంచి సినిమాలు, భిన్నతరహా సినిమాలు చేసి వుండేవారు. 60 ఏళ్లు పూర్తయినా యింకా ఆ భారాన్ని మోస్తూ వుండడంతోనే ఆయన గమనం చాలా మందంగా సాగుతోంది. తను లెజెండ్ అనీ, తన పాటికి తను వెళుతూ వుంటే కొత్త పుంతలు ఏర్పడతాయనీ ఆయన మర్చిపోతున్నాడు. పాత పుంతల్లోనే తచ్చాడుతూ కొత్తగా వచ్చినవారితో పరుగుపందెంలో పాల్గొనడానికి చూడడం ఆయనకు అనవసరమైన మానసిక శ్రమ.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)