జనసేనాని పవన్ కల్యాణ్ సాధారణంగా ఎన్ని కార్యక్రమరాల్లో పాల్గొన్నా తరచుగా చెప్పే మాట ఒక్కటే.. ‘నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. నేను మీకు మేలు చేస్తా’ అని మాత్రమే. ‘జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి విపక్షాలు అన్నీ ఒక్కటి కావాలి.. వ్యతిరేక ఓటు చీలకూడదు’ అని మాత్రమే అంటుంటారు.
అలాంటిది ఇప్పుడు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత.. ఆయన మాట కాస్త మారింది. ‘జగన్ ప్రభుత్వం పోవాలి.. ఎన్డీయే ప్రభుత్వం రావాలి’ అని పవన్ అంటున్నారు. సాధారణంగా బిజెపిని కలుపుకుని మాట్లాడే అలవాటు లేని పవన్.. ఇప్పుడు మాత్రం.. జగన్ ప్రభుత్వం పోవాలి.. ఎన్డీయే ప్రభుత్వం రావాలి.. అని అనడం చిత్రమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రస్తుతానికి ఎన్డీయే అంటే జనసేన- బిజెపి మాత్రమే. తెలుగుదేశం ఇంకా ఆ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు పూర్వం ప్రధాని నరేంద్రమోడీని చంద్రబాబునాయుడు ఎన్నెన్ని మాటలు అన్నారో అవన్నీ తమకు గుర్తున్నాయని, చంద్రబాబునాయుడును మళ్లీ దగ్గరకు రానిచ్చే అవకాశమే లేదని బిజెపి నాయకులు అంటుంటారు.
మొన్నటికి మొన్న ఎన్డీయే భాగస్వామి పక్షాల సమావేశం నిర్వహించినప్పుడు కూడా.. తమ జట్టునుంచి వెళ్లిపోయిన అన్ని పార్టీలనూ, చిన్నాచితకా ఇతర పార్టీలనూ కూడా పిలిచారు గానీ.. తెలుగుదేశాన్ని మాత్రం ఆహ్వానించలేదు. అంటే చంద్రబాబును నమ్మడానికి వారు సిద్ధంగాలేరని సంకేతం. పవన్ మాత్రం ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం రావాలి.. అని సెలవిస్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం తెలుగుదేశం లేని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందనే భ్రమలో ఉన్నారా? అనేది ప్రజల సందేహం.
పవన్ కల్యాణ్ అంతరంగంలోని కోరిక ప్రకారం.. తెలుగుదేశాన్ని కూడా ఎన్డీయేలోకి తిరిగి తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉంటారు. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడం ద్వారా.. ఆయనను నాలుగోసారి ముఖ్యమంత్రి చేయడానికి తన వంతు పాటుపడాలనేది ఆయన లక్ష్యం. ఆ విషయాన్ని ఆయన నిర్మొహమాటంగా పలుమార్లు ప్రకటించుకుంటూనే ఉన్నారు. అయితే పవన్ వ్యూహంలో పావులాగా బిజెపి కూడా మారుతుందా? లేదా? అనేది మాత్రమే క్లారిటీ రావడం లేదు.
ఇప్పుడు ఎన్డీయే పక్షాల సమావేశం పెట్టుకున్న నాటికి చంద్రబాబును అనుమానంగానే చూస్తూ.. ఇంకొన్నాళ్లు పోయిన తర్వాత.. కేవలం అధికారం కోసం, స్వార్థంతో చంద్రబాబును దగ్గరకు చేర్చినంత మాత్రాన అలాంటివన్నీ అవకాశవాద పొత్తులు అనే సంగతి ప్రజలు గుర్తించకుండా ఉంటారా? ఈ కూటమి బంధాన్ని ఈసడించుకోకుండా ఉంటారా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.