భాజపా ఒక నిర్ణయం బలంగా తీసేసుకుంది. ఆ నిర్ణయం వెనుక దురాలోచన కాదు..దూరాలోచనే. ఒక రకంగా చూస్తే అదొక రాజకీయ రణతంత్రం. ఆ తంత్రానికి బలౌతున్నది మాత్రం చంద్రబాబు పాలిత తెదేపా.
ఆధిపత్యపోరులో ఎంత తక్కువమంది ఉంటే గెలుపు అంత సుసాధ్యమౌతుంది.
ఆంధ్రప్రదేశులో ప్రస్తుతం ఉన్న పార్టీలు వైకాపా, తెదేపా, జనసేన. ఆ మూడూ ప్రాంతీయ పార్టీలే. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ చచ్చిపోయి దాదాపు దశాబ్దమౌతోంది. మరో జాతీయ పార్టీ భాజపా తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రలో భాజపా ఏ మాత్రం శక్తి పుంజుకోలేదు.
ఇక ప్రాంతీయ పార్టీల్లో వైకాపా అధికారంలో ఉంది, బలంగానూ ఉంది. జనసేనకి ఇంతవరకు ట్రాక్ రికార్డ్ లేదు..కానీ రాష్ట్ర రాజకీయాల్లో స్థానం కోసం తనదైన శైలిలో ప్రయత్నిస్తోంది.
ఇక మిగిలింది తెదేపా….40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ. 2019 వరకు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒక వెలుగు వెలిగిన పార్టీ. కానీ ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో ఉంది.
అంచనాల ప్రకారం 2019 నుంచి ఇప్పటి వరకు తెదేపాకి దాదాపు 3%-4% వరకు ఓట్ షేర్ తగ్గిందని తెలుస్తోంది. అది చాలా దారుణం…ప్రమాదఘంటిక మోగుతున్నట్టే. కానీ ఈ విషయం చెప్తే చంద్రబాబే కాదు జగన్ కూడా నమ్మరు. వాస్తవాలు కొన్ని అలాగే ఉంటాయి. నమ్మాలంటే ఎన్నికలవ్వాలి.
ఇక కొన్ని స్థానాల్లో ఉన్న ప్రాబల్యం వల్ల ఓవరాల్ గా జనసేన స్వల్పంగా పుంజుకుంది. కానీ ఆ పుంజుకున్న సంఖ్యతో సొంతగా నిలబడి గెలవడం సాధ్యం కాని పని. అలాగని ఓట్ షేర్ గణనీయంగా తగ్గిపోయిన తెదేపాతో జతకూడి గెలవడం అంతకంటే కష్టమైన పని.
అయినప్పటికీ అసలు చంద్రబాబుకి కనీసం మానసిక బలం కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్న భాజపా జనసేనని తన పక్కకు లాగేసుకుంది. చంద్రబాబుని ఒంటరి వాడిని చేసింది. ఇదంతా చేస్తే భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుందని కాదు. కేవలం తెదేపాని ఓడించి వైకాపాని గెలిపించడమే ఇక్కడ భాజపా ఆలోచన.
తెదేపాకి ఇంతటి దుస్థితి పట్టడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి వారసుడు పరమ వీక్ కావడం, చంద్రబాబు వృద్ధుడవడం. అందుకే ఆ పార్టీ ఎలాగూ మూలుగుతోంది కాబట్టి ఒక చావుదెబ్బ బలంగా కొట్టేసి శాశ్వతంగా పడుకోబెట్టేసే నిర్ణయం తీసుకుంది భాజపా.
ఇందులో ఒక దూరాలోచన ఉంది భాజపాకి.
ప్రస్తుతం రాష్ట్ర భాజపాలో ఆకర్షణ గల నాయకులు లేరు. అసలు ఆ.ప్ర భాజపా ముఖచిత్రం ఎవరంటే నిన్నటి వరకు సోము వీర్రాజు, కన్నా లాంటి వాళ్లు కనపడేవారు. ముఖ్యమంత్రి స్థాయి కాదు కదా కనీసస్థాయి జనాకర్షణ లేని నాయకులు వాళ్లు. అందుకే ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆమె మాత్రమే ఎందుకు అనే దానికి ఇక్కడ భాజపా దూరాలోచన అర్ధమవుతుంది.
రేపు ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం చెందాక అందులోని ఒకానొక సామాజిక వర్గానికి చెందిన నాయకులెవరూ సైకిల్ ని పట్టుకుని కూర్చోరు. మూకుమ్మడిగా భాజపాలో చేరడం తప్ప వాళ్లకి వేరే ఆప్షన్ ఉండదు. అప్పుడు భాజపా రాష్ట్ర ముఖచిత్రం మారుతుంది. అనుభవమున్న సీనియర్ నాయకులెందరో పార్టీలో కనిపిస్తుంటారు. అప్పుడున్న పరిస్థితిని బట్టి జనసేనతో విడిపోయి ఆ పార్టీని భూస్థాపితం చేసే పని పెట్టుకుంటారా లేక ప్రస్తుతానికి “శత్రువుకి శత్రువు మిత్రుడు” ఫార్ములాతో వైకాపాతో సామరస్యంగానే ఉన్నా 2024 ఫలితాల తర్వాత భాజపా వారు లెక్కలు మారుస్తారా అనేది ఆధారపడి ఉంటుంది.
అప్పటికి భాజపాకి, వైకాపాకి కామన్ శత్రువైన తెదేపా మ్యాపులో ఉండదు కనుక ఇక ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రస్తుతం తెదేపావారు కలలుగంటున్న అంశాలు కొన్ని అప్పుడు జరగొచ్చు. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం వెల్ఫేర్ స్ఖీములు ఇచ్చే పరిస్థితి లేకుండా రాష్ట్రానికొచ్చే కేంద్ర నిధుల్ని ఆపడం. వైకాపా ప్రాణం నవరత్నాల్లో ఉంది కనుక దాని పీక నొక్కే పని పెట్టుకుంటారు భాజపా వారు.
ఏ విధంగా అయితే తెదేపా నుంచి నాయకులు భాజపాలోకి దూకుతారని భావిస్తున్నారో అదే విధంగా ప్రజలు కూడా వైకాపా వ్యతిరేకత వల్ల భాజపాని నమ్ముకుని ఓట్లేసి గెలిపిస్తారని సుదూరాలోచన చేసారు భాజపా పెద్దలు.
అయితే ఇవన్నీ భాజపా ప్రభ కొనసాగుతున్నంత వరకే. కాలమహిమ వల్ల ఏ కాంగ్రెస్సో కేంద్రంలో అధికారపీఠం మీదికొస్తే పైన అనుకున్న ఆట కట్టవుతుంది.
ఏది ఏమైనా చదరంగం ఆడే గ్రాండ్ మాష్టర్స్ ఒక ఎత్తు వేసేటప్పుడు కనీసం 10-15 ఎత్తులు ముందుగా ఊహిస్తారట. జనసేనని తెదేపా నుంచి విడగొట్టడం, జనసేనని తన పంచన మాత్రమే ఉంచుకోవడం, పురందేశ్వరని భాజపా రాష్ట్ర అధ్యక్షరాలిగా నిలపడం..ఈ ఎత్తులన్నీ భాజపా రాష్ట్ర అధికారాన్ని భవిష్యత్తులో కైవసం చేసుకునే ఆలోచనలతో వేసినవే.
– హరగోపాల్ సూరపనేని