చిరులీక్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయన తన కొత్త సినిమాలకు సంబంధించిన సంగతుల్ని, అందరికంటే ముందు లీక్ చేస్తుంటారు. తాజాగా భోళాశంకర్ లో పవన్ ను ఇమిటేట్ చేసిన విషయాన్ని కూడా చిరంజీవి లీక్ చేశారు. ఇప్పుడు మరోసారి లీకులు మొదలయ్యాయి. అయితే ఈసారి బన్నీ నుంచి..
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్-1 పాన్ ఇండియా లెవెల్లో హిట్టవ్వడంతో, పార్ట్-2పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే, ఎప్పటికప్పుడు పుష్ప-2 సెట్స్ నుంచి వర్కింగ్ స్టిల్స్ లీక్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి ఏకంగా బన్నీనే తన సినిమా నుంచి లీక్ ఇచ్చాడు. ఏకంగా సినిమాలోని ఓ డైలాగ్ ను బయటపెట్టాడు.
“సినిమా పేరు పుష్ప-2, ది రూల్. ఒకటే ముక్క ఉంటుంది. బయటకు చెబుతానని కూడా నేను అనుకోలేదు. కానీ చెప్పేస్తున్నాను. ఈడంతా జరిగేది ఒకటే రూలు మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్”
ఇలా పుష్ప-2లో కీలకమైన డైలాగ్ ను బయటపెట్టాడు బన్నీ. బేబి సినిమా సక్సెస్ అయిన సందర్భంగా బన్నీ ఆ సినిమాను మెచ్చుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్ పెట్టారు. ఆ వేదికపై ఇలా పుష్ప-2 డైలాగ్ ను లీక్ చేశాడు అల్లు అర్జున్.