హరియాణాలో బిజెపి తిరుగులేని విజయం సాధించింది. ఎవరి అండా లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచగల రీతిలో 33% ఓట్లతో 52% సీట్లు తెచ్చుకుంది. 2009లో తెచ్చుకున్న 9%తో పోలిస్తే యిది చాలా ఎక్కువ. మొన్న పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే మాత్రం 1.50% తక్కువ. హరియాణాలో ఎన్నడూ లేనంత బలం సంతరించుకోవడానికి ముఖ్యకారణం – రాజకీయ కులప్రాబల్యాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నం! హరియాణా ఏర్పడిన దగ్గర్నుంచీ అక్కడ జాట్ల ఆధిపత్యమే నడుస్తోంది. కిసాన్ ఐక్యత పేరుతో చరణ్ సింగ్ నుండి దేవీ లాల్ దాకా అందరూ జాట్ ఓట్లను కొల్లగొట్టి కాంగ్రెసు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశారు. అది చూసి కాంగ్రెసు పార్టీ కూడా జాట్లకే పట్టం కట్టనారంభించింది.
దానికి పరాకాష్ట భూపేందర్ సింగ్ హూడా పాలన. అతని కాబినెట్లో సగం మంది జాట్లే. జాట్ల పట్ల అనేక రకాలుగా పక్షపాతం చూపించాడు. అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. పార్టీ సహచరులను కూడా పట్టించుకోలేదు. 90% టిక్కెట్లు తన యిష్టప్రకారమే యిచ్చాడు. పిసిసి అధ్యకక్షుడి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమంది ప్రజాదరణ కోల్పోయారని తెలిసినా వారికీ, వేరే పార్టీ నుంచి ఫిరాయించి వచ్చినవారికీ టిక్కెట్టు యిచ్చాడు. ఇతను యింత పెత్తనం చెలాయిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం వూరుకోవడానికి కారణం సోనియా అల్లుడు వాధ్రాకు యితనికి వున్న స్నేహం. అతనికే కాదు, ఢిల్లీలోని అనేకమంది ప్రముఖులకు ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లో వున్న ప్రాంతాలను కారుచౌకగా కట్టబెట్టాడు. ఆ ప్రాంతాల్లో అంటే సోనేపట్్, ఝజ్జర్, రోహతక్ – అంతకు ముందు ఎరగనంత అభివృద్ధి సాధించాడు. అందుకే అక్కడ కాంగ్రెసుకు చాలా సీట్లు వచ్చాయి. భివాని వంటి యితర ప్రాంతాల్లో కూడా గెలుచుకుని మొత్తం మీద 20% ఓట్లు తెచ్చుకుంది. 2009లో తెచ్చుకున్న 35% ఓట్లతో యిది చాలా తక్కువనే కాదు, పార్లమెంటు ఎన్నికలలో తెచ్చుకున్న 23% కంటె కూడా తక్కువ. పట్టణ ప్రాంతాలు, సిఖ్కులు తనకు ఓటేస్తారని హూడా వేసుకున్న అంచనాలు ఫలించలేదు.
ఇక లోక్‌దళ్ అయితే పూర్తిగా జాట్ల మీద, గ్రామీణ ప్రాంతాలమీద ఆధారపడిన పార్టీ. ఎప్పుడూ ఓట్లు పడే హిస్సార్, ఫతేబాద్, సిర్సాలో బాగా భివాని, జింద్ ప్రాంతాల్లో కొద్దిగా యీసారీ పడ్డాయి. దాని ఓట్లశాతం యించుమించు ఒకేలా వుంది. కానీ సీట్ల సంఖ్యలోనే తేడా వచ్చింది. 2009లో 25.8% ఓట్లతో 31 సీట్లు తెచ్చుకుంది, ఇప్పుడు 1.70% ఓట్లు తగ్గాయి, కానీ సీట్లు 40% తగ్గి 19 వచ్చాయి. మధ్యలో పార్లమెంటు ఎన్నికలలో 24.4% ఓట్లు వచ్చాయి. అంటే ఎన్ని అవినీతి కేసులున్నా, నాయకులు జైల్లో వున్నా దాని అనుయాయులు దానికే ఓటేశారన్నమాట. తేడా ఏమొచ్చిందంటే హూడా విధానాల వలన విసిగిపోయిన జాటేతర కులాలు (వీళ్ల జనాభా 74% వుంది) బిజెపికి సాలిడ్‌గా ఓట్లేశారు. వీళ్లను ఆకట్టుకోవడానికి బిజెపి చేసిన దేమిటి? ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. అందువలన జాట్ కానివాళ్లు కూడా ముఖ్యమంత్రి కావచ్చనే సందేశం యితర కులాలకు వెళ్లింది.
అంతకంటె ముఖ్యంగా డేరా సచ్చా సౌదా అనే మతసంస్థ బిజెపికి తోడ్పడింది. ఇది సిఖ్కుల్లో ఒక శాఖ. శిఖ్కు మతం కులవ్యవస్థకు వ్యతిరేకమే అయినా దానిలోనూ కులప్రాతిపదికపై చీలికలున్నాయి. దళితులు, వెనకబడినవారికి గురుద్వారాలో చిన్నచూపు చూడడంతో వారు వాటికి దూరంగా వుండడం గమనించిన కొందరు మతగురువులు వేరే శాఖలు మొదలుపెట్టి వాళ్లను ఆకర్షించసాగారు. శిఖ్కు మతానికి, హిందూ మతానికి పెద్దగా తేడా లేకపోవడంతో వారితో బాటు హిందువుల్లోని దళితులు, వెనకబడిన జాతుల వారు కూడా యీ శాఖల్లో చేరారు. నిరంకారీలు, నామ్‌ధారీలు వంటి అనేక శాఖలు పుట్టుకుని వచ్చాయి. అటువంటి శాఖల్లో ఒకటి 'డేరా సచ్చా సౌదా'. 1948లో ఏర్పడింది. దీన్ని నడుపుతున్నది బాబా గుర్మీత్ రామ్ రహీమ్. పదో తరగతి వరకు చదివాడు. కానీ అతని తెలివితేటలు అమోఘమని, ఆతనికి బిల్డింగ్ డిజైన్ నుంచి కారు డిజైన్ దాకా అన్నీ వచ్చని చెప్తారు. అంతేకాదు, భక్తిగీతాల ఆల్బమ్స్ ఆరిటికి అతనే సంగీతం సమకూర్చాడట. ఆల్బమ్ పేరు కూడా వింతగా వుంటాయి. ఒక దాని పేరు 'హై వే లవ్ చార్టర్'. దానిపై అతని బొమ్మ రాక్‌స్టార్ అవతారంలో వుంటుంది. ఈ మధ్యే తనను హీరోగా పెట్టి సినిమా తీయబోతున్నాడు.
డేరా అనుయాయులందరూ తమ యింటిపేరును 'ఇన్సాన్' (మనిషి) అని పెట్టుకోవాలి. మెడలో ఒకటి అంకె వున్న లాకెట్ వేసుకోవాలి. దాని అర్థం దేవుడొక్కడే, మనుషులంతా ఒక్కటే అనిట. అందరూ కలిసి సామూహికంగా భజనలు చేయడం, ప్రార్థనల్లో పాల్గొనడం, సాంఘిక కార్యకలాపాలు చేయడం జరుగుతూ వుంసాంఘికంగా తమకు గుర్తింపు కలగజేస్తున్న డేరా గురువంటే భక్తులకు పరమ గురి. అందువలన విరాళాలు యిబ్బడిముబ్బడిగా యిస్తూ వుంటారు. వాటితో డేరా అనేక స్థిరాస్తులు కొని, అనేక వ్యాపారాల్లో దిగింది. గతంలో రాధాస్వామి అనుయాయులైన సత్సంగులు కూడా దయాల్బాగ్ పేరుతో ఆస్తులు సంపాదించి, భవంతులు కట్టి, సబ్బులు, తువ్వాళ్లు, తలనూనెలు వంటి ఉత్పాదనలు చేసి, వాటిని వూరూరా బ్రాంచ్‌ల ద్వారా భక్తులకు విక్రయించేవారు. భక్తులంతా అవే వాడేవారు. ఆగ్రాలో దయాల్ బాగ్ పేరుతో పెద్ద పాలరాతి మందిరం వుంది.
ఇప్పుడు వీళ్ల్లూ అదే పని భారీ ఎత్తున చేస్తున్నారు. అలోవెరా ప్లాంటేషన్లు, ఆర్గానిక్ ఫామ్స్, బళ్లు (వాటిలో రెండు యింటర్నేషనల్ స్కూళ్లు), రెండు కాలేజీలు, ఫ్యాక్టరీలు, రిటైల్ స్టోర్సు, పెట్రోలు పంపు, ఆసుపత్రి, రిసార్టు (దానిలో ఐఫిల్ టవర్ నమూనా వుంది), హోటల్, న్యూస్ పేపర్, టీవీ ఛానెల్, కళ్యాణమండపం, క్రికెట్ స్టేడియం, కారు డిజైనింగ్ యూనిట్… యిలా అనేక వ్యాపారాలు నడుపుతున్నారు. గురువుగారు రంగురంగుల ఆధునికమైన దుస్తులు వేసుకుని, డిజైన్ కార్లలో షికార్లు కొడుతూ వుంటారు. ఏమిటిదంతా అంటే యువకులను ఆధ్యాత్మికతవైపు మళ్లించాలంటే యిలాగే చేయాలి అంటాడు. దేశవిదేశాల్లో దానికి శాఖలున్నాయట. ప్రపంచం మొత్తం మీద 5 కోట్ల మంది అనుయాయులున్నారనీ, వారిని శాకాహారులుగా మారుస్తున్నాననీ అంటాడాయన. మీడియాలో తన బొమ్మతో ఖరీదైన యాడ్స్ యిస్తూ వుంటాడు – తాము చాలా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని. వాటిలో రక్తదాన శిబిరాల దగ్గర్నుంచి, ఉచిత మందుల పంపిణీ, వేశ్యలను వుద్ధరించడం దాకా అన్నీ వున్నాయి. ఇన్ని చేసే మనిషికి అతీంద్రియ శక్తులుంటాయని నమ్మించడంలో లోటు చేయరు కదా. బాబా తలచుకుంటే ఎయిడ్స్, కాన్సర్ వంటి రోగాలను మాయం చేయగలరని డాక్టర్లే ప్రచారం చేస్తారు. వాళ్లు ఆయన ఆసుపత్రిలో పనిచేసే వాళ్లే అనుకోండి! ''మేం ఆపరేషన్ చేస్తాం, కానీ రోగి గురుజీయే వచ్చి స్వయంగా ఆపరేషన్ చేసినట్లు ఫీలయినట్లు మాకు చెప్పాడంటే అది సక్సెసయినట్లే'' అంటారు వాళ్లు.
డేరా ప్రభావం ఉత్తరభారతంలోని 60 లక్షల మందిపై వుందంటారు. వాళ్లే ఓటర్లు కూడా కాబట్టి పంజాబ్, హరియాణా రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో డేరా వుంది. పంజాబ్‌లో 2007లో జరిగిన ఎసెంబ్లీ ఎన్నికలలో రామరహీమ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు మద్దతు యిచ్చాడు. మొత్తం మీద కాంగ్రెసు ఓడిపోయినా డేరా ప్రభావం వున్న చోట్ల మాత్రం సీట్లు బాగానే గెలిచింది. ఇప్పుడు జింద్, ఫతేబాద్, కైతాల్, హిస్సార్, సిర్సా, తోహణా జిల్లాలలో డేరా అనుయాయులు వున్న విషయం గ్రహించిన మోదీ-అమిత్ షా రామ్‌రహీమ్‌ను మచ్చిక చేసుకున్నారు. అతనిపై హత్య, బలాత్కారం వంటి కేసులున్నా 'పరిశుభ్రతకై డేరా చేస్తున్న కృషి ప్రశంసనీయం' అంటూ మోదీ సిర్సా బహిరంగసభలో మెచ్చుకున్నాడు. డేరావారు తమ వెబ్సైట్లో తాము లండన్‌లో, శాన్ ఫ్రాన్సిస్కోలో క్లీన్-అప్ కార్యక్రమాలు చేపట్టామని రాసుకున్నారు మరి! రాష్ట్రంలో బిజెపి ఎన్నికల ప్రచారానికి యిన్‌చార్జిగా వున్న కైలాష్ విజయవర్గీయ 40 మంది బిజెపి అభ్యర్థులను రామ్‌రహీమ్ వద్దకు తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. దానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బాబా తనను రేప్ చేశాడని గతంలో ఆరోపించిన మహిళ భర్త, మావ గారు యిప్పుడు ప్రజల ముందుకు వచ్చి అప్పట్లో తాము బనాయించినది తప్పుడు కేసని, కొందరు తమను అలా చెప్పమని ప్రేరేపించారని ప్రకటించారు. ఇప్పుడిలా చెప్పమని ఎవరు ప్రేరేపించారో భవిష్యత్తులో చెప్తారేమో! ఏమైతేనేం, డేరా అనుయాయులు ఎన్నికలలో బిజెపికి ఓట్లేయడమే కాక, పోలింగ్ ఏజంట్లుగా పనిచేశారు. దాంతో ఆ జిల్లాలలో బిజెపి గెలుపు తథ్యమైంది. ఇప్పుడు రామ్‌రహీమ్ కార్యకలాపాలు మరింతగా విస్తరించడమే కాక, డేరాపై నిఘా తగ్గిపోవచ్చు. ఇంతటి భారీ సామ్రాజ్యంలో అవకతవకలు వుండక మానవు. ఇప్పటివరకు రామ్‌రహీమ్ అనుయాయులుగా వున్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు (నవీన్ జిందాల్, హూడా, ప్రకాశ్ సింగ్ బాదల్, ప్రకాశ్ జావడేకర్, అరుణ్ జైట్లీ, వసుంధరా రాజే వారిలో కొందరు) కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు సాక్షాత్తూ ప్రధానితో నేరుగా సంబంధం పెట్టుకుంటే చిక్కుల్లో పడకుండా వుండవచ్చని బాబా ఆలోచన. అతని అనుయాయులు వున్న తక్కిన రాష్ట్రాలలో కూడా బిజెపికి అతని సాయం అవసరపడుతుంది కదాని మోదీ-అమిత్ షా ఆలోచన!
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)