జులై 31 – రవి కన్నియూరు శిబిరం ఖాళీ చేసి దిండిగల్‌లోని యింకో యింటికి మార్చేసాడు. కాంతన్, రమణన్ తమ వైర్‌లెస్‌ను చెన్నయ్‌లోని వడపళనికి తరలించారు.
xxxxxxxxxxxxxxxxx
విక్కీ పట్టుబడడంతో తిరుచ్చి శంతన్‌కు భయం వేసింది. తిరుచ్చి జిల్లాలోని కరూరు వద్ద చిట్టిపాళయం శిబిరంలో తలదాచుకున్నాడు. ఎల్‌టిటిఇతో సంప్రదించి ఏమైనా చేద్దామంటే తన సొంత వైర్‌లెస్ సెట్టును, దానికి సంబంధించిన కోడ్ షీటును డిక్సన్ పోలీసుల దాడి సమయంలో జులై 28 నాడు కాల్చేశాడు. అయితే శివరాజన్ తన వద్దకు వచ్చి ఆశ్రయం కోరినప్పుడు తన వైర్‌లెస్ సెట్టును శంతన్‌కు యిచ్చాడు కాబట్టి అది అతని దగ్గర వుంది. అయితే దానికి ఆపరేటరూ లేడు, అవసరమైన కోడ్ షీటూ లేదు. అతని దగ్గర వున్నదల్లా ఎల్‌టిటిఇ తీవ్రవాది వరదన్ ఒక్కడే. అతనికి తనతో బాటు చిట్టిపాళయం శిబిరంలో ఆశ్రయం యిచ్చాడు. 'ఏమైనా అవసరమైతేనే దీన్ని వుపయోగించు. కానీ యిళ్ల మధ్యలో వుండగా చేస్తే చుట్టూ వున్న వాళ్ల టీవీ సిగ్నల్స్‌తో క్లాష్ వస్తుంది. ఊరి బయటకు తీసుకెళ్లి నిర్జనప్రదేశం నుంచి ఆపరేట్ చేయి' అన్నాడు. వరదన్ తలవూపాడు.
xxxxxxxxxxxxxxx
డిక్సన్ పోయిన మూడో రోజున ఏ అట్టహాసం లేకుండా బెంగుళూరులో సిట్ దళం దిగి ఇందిరా నగర్ వెళ్లి గమనించ సాగింది. అది చాలా విలాసవంతమైన ప్రాంతం. ఆ యింటి తలుపులు, కిటికీలతో సహా మూసేసి వున్నాయి. చుట్టుపక్కల లౌక్యంగా ఆరాలు తీస్తే తెలిసిందేమిటంటే – అప్పుడప్పుడు ఆకుపచ్చ మారుతి జిప్సీ, నీలిరంగు ప్రీమియర్ పద్మినీ కారు ఆ యింటి దగ్గర పార్క్ చేస్తూ వుంటారని తెలిసింది. కచ్చితంగా తిరుచ్చి శంతన్ శిబిరం యిదే. నిఘా పెంచారు.
ఆ రోజు రాత్రి అప్పుడప్పుడు ఆ యింట్లో లైట్లు వెలిగి ఆరుతున్నాయి. అంటే తలుపులన్నీ బిడాయించుకుని లోపల కొందరు మనుషులున్నా రన్నమాట. వెంటనే సిట్ చెన్నయ్ హెడ్‌క్వార్టర్సుకు అన్ని అంశాలూ వివరిస్తూ ఎన్‌ఎస్‌ఎఫ్ కమెండోలను పంపమని కోరింది.
ఆగస్టు 01 – రాత్రికి కమెండోలు బెంగుళూరు విమానాశ్రయంలో దిగారు. వాళ్లతో బాటు సైనైడ్ విరుగుడు మందులు, డాక్టరు కూడా వచ్చారు. ఎయిర్‌పోర్టులోనే వ్యూహరచన జరిగింది. శివరాజన్ ముఠా వద్ద అత్యాధునికమైన ఆయుధాలున్నాయనీ, దాడి చేయడానికి వెరవడనీ, పట్టుబడతామన్న శంక ఏ మాత్రం కలిగినా సైనైడ్‌తో ఆత్మహత్య చేసుకోవడం ఖాయమని, ఆ మేరకు అతను పొట్టుఅమ్మన్‌కు పంపిన సందేశంలో హామీ యిచ్చాడని కూడా సిట్‌కు కమెండోలకు విడమర్చి చెప్పారు. వాళ్లు సజీవంగా దొరక్కపోతే ఎల్‌టిటిఇ లింకు ఎస్టాబ్లిష్ చేయడం కష్టమవుతుందని కూడా చెప్పారు. ఇంటి ప్లాను వివరంగా యిచ్చారు. నేరస్థులు ఎటు పారిపోవడానికి అవకాశాలున్నాయో వివరించారు. శిబిరం ఆనుపానులు కరతలామలకం అయ్యేట్లు బోధపరచి మెరుపుదాడికి దిగమన్నారు. ఎయిర్‌పోర్టులో వ్యూహరచన పూర్తి కాగానే, కమాండోలు క్షణాల మీద హెల్మెట్లు, బుల్లెట్‌ప్రూఫ్ కవచాలు ధరించారు.
ఆగస్టు 02 – తెల్లవారు ఝామున మెరుపుదాడి జరిగింది. ఇద్దరు అధికారులు సాధారణ పల్లెటూరి మనుషుల్లా పంచె కట్టుకుని వెళ్లి తలుపు కొట్టి 'అడ్రసు చెపుతారా?' అని అడగాలి. లోపలివాళ్లు జవాబిస్తూండగానే యింట్లోకి చొరబడ్డాలి, వారి వెంటనే తక్కిన కమెండోలు.. యిదీ ప్లాను. తలుపు కొట్టినా లోపలకి ఎవరూ పలకలేదు. బెల్లు కొట్టారు. మెయిన్‌డోర్ పక్కనున్న కిటికీ కొద్దిగా తెరుచుకుని వీళ్లను ఒక మొహం చూసింది. తలుపు ఠపీమని వేసేసింది. లోపల పరిగెడుతున్న అడుగుల చప్పుడు వినబడింది. కనురెప్పపాటు సమయంలో కమెండోలు ధన్‌ధన్ మని రైఫిళ్లు పేలుస్తూ యింటి ముందూవెనకా తలుపుల్ని పేల్చేసి లోపలకి చొరబడ్డారు. లోపల కనబడిన యిద్దరు యువకుల్నీ వెంటాడారు. ఒకడు సైనైడ్ గొట్టం నోట్లో వేసుకుని నములుతున్నాడు. మరొకడు బాత్‌రూమ్‌లో దాక్కోవాలని పరిగెడుతున్నాడు. బాత్‌రూమ్ డోరు పేల్చేసి వాణ్ని పట్టుకున్నారు. వాడప్పుడే సైనైడ్ గొట్టం మింగాడు. కమెండోల వెనక్కాల వున్న డాక్టరు యిద్దరికీ సైనైడ్ విరుగుడు యింజక్షన్‌లు బలవంతంగా యిచ్చాడు. అయినా అరసన్ అనేవాడు ఆసుపత్రి చేరేసరికే చచ్చిపోయాడు. కులతన్ అనేవాడు మూడు రోజుల పాటు కోమాలో వుండి చచ్చిపోయాడు.
'ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్' అన్నారందరూ. ఒకటి మాత్రం నిశ్చయం. శివరాజన్ ముఠా యిక్కడే బెంగుళూరులోనే వుంది. 'నిజమా? ఎల్‌టిటిఇ బెంగుళూరులో శిబిరాలు నడుపుతోందా?' అని బెంగుళూరు సిటీ పోలీసు కమీషనర్ నోరెళ్లబెట్టాడు. సిట్ వాళ్లు యింటి ఓనరును ప్రశ్నించారు – ఎల్‌టిటిఇకి అద్దెకెలా యిచ్చావ్? అని. 'బాబోయ్, స్టూడెంటు కుర్రాళ్లంటూ జగన్నాథన్ అనేవాడు పరిచయం చేస్తే యిచ్చాను' అన్నాడతను. జగన్నాథన్ కోసం వెతకండి అన్నారు సిట్‌వారు.
xxxxxxxxxxxxxxxxxx
ఇందిరా నగర్‌లో సిట్ దాడితో శివరాజన్ ఎలర్టయ్యాడు. దానికి రెండు కి.మీ.ల దూరంలో వున్న తమ దోమలూరు శిబిరం పై కూడా త్వరలో దాడి జరుగుతుందని వూహించి వేరే చోటకి మార్చమని సురేష్ మాస్టర్‌కు చెప్పాడు. పోలీసులు వూహించలేని కొత్త చోటికి వెళ్లాలని, దానికోసం కొత్త సోర్స్‌ను పట్టాలని అతను అనుకున్నాడు. ఒక తమిళ కార్యకర్తను అడిగితే అతను తనకు లేత్ మిషన్ అమ్మే రంగనాథ్ అనే తమిళ వ్యాపారి వద్దకు తీసుకెళ్లాడు. అతను బెంగుళూరులో లేత్ మిషన్ తయారుచేసి అమ్మేవాడు. వ్యాపారం దెబ్బ తిని ఆర్థికంగా యిబ్బందుల్లో వున్నాడు. అప్పుల్లో మునిగిపోయాడు. అతనికి రాజకీయ భావాలేవీ లేవు. కావలసింది డబ్బు, అంతే. సాయంత్రం రంగనాథ్ వద్దకు యిద్దరూ వెళ్లారు. 'నాకూ, నాతో పాటు గాయపడిన మరో నలుగురు స్నేహితులకు పుట్టనహళ్లిలో మీరు అద్దెకుంటున్న చిన్న యింట్లో తాత్కాలికంగా ఆశ్రయం యివ్వండి చాలు. కావలసినంత డబ్బిస్తాం' అని సురేష్ మాస్టర్ రంగనాథ్‌ను ప్రాధేయపడ్డాడు. డబ్బుకు ఆశపడి అతను సరేనన్నాడు. అంతే అదే రోజు రాత్రి 11 గం||కు అందరూ ఆకుపచ్చ మారుతీ జిప్సీలో చేరారు. రంగనాథన్‌కు వున్నవే రెండు గదులు. అందులో ఒక గదిలో శివరాజన్, శుభ, నెహ్రూ మకాం పెట్టారు. ఈ మకాం సంగతి ఎల్‌టిటిఇలో వేరెవ్వరికీ తెలియకపోవడం వలన, రంగనాథ్‌కు ఎల్‌టిటిఇతో ఏ విధమైన కనక్షన్ లేకపోవడం చేత, రంగనాథ్‌ను సురేష్ మాస్టరుకు పరిచయం చేసిన తమిళుడికి కూడా తను సాయపడుతున్నది శివరాజన్ ముఠాకు అని తెలియకపోవడం వలన యీ శిబిరం వునికి సిట్‌కు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ( సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)
(ఫోటోలు – రంగనాథ్ ఫోటో సౌజన్యం – ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్)