ఎమ్బీయస్‌ : సత్తా చాలని దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ గారికి కేంద్రమంత్రి పదవి దక్కకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారు కొందరు. దీని వెనక ఆంధ్రనాయకుల కుట్ర వుందంటున్నారు. అంతేనా, అగ్రవర్ణాలు ఆదరించే పార్టీ ఐన బిజెపి యావన్మంది బిసిలకు అన్యాయం చేసిందంటున్నారు…

బండారు దత్తాత్రేయ గారికి కేంద్రమంత్రి పదవి దక్కకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారు కొందరు. దీని వెనక ఆంధ్రనాయకుల కుట్ర వుందంటున్నారు. అంతేనా, అగ్రవర్ణాలు ఆదరించే పార్టీ ఐన బిజెపి యావన్మంది బిసిలకు అన్యాయం చేసిందంటున్నారు మరికొందరు. దత్తన్నకు మంత్రి పదవి యిస్తామని కబురు వచ్చిందట, కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లారట, చివరి నిమిషంలో జాబితాలో పేరు గాయబ్‌ట. గతంలో కూడా యిలాగే జరిగితే, వాజపేయిగారు పట్టుబట్టి కొన్నాళ్లకు రైల్వే సహాయమంత్రి గా చేశారట. దీనిలో వాస్తవమెంతో, కల్పన ఎంతో తెలియదు. దత్తాత్రేయగారు సౌమ్యుడు, ఉపకారి, అందరికీ అందుబాటులో వుండే వ్యక్తి. వివాదాల్లో యిరుక్కోరు. ఈ సారి కాకపోతే వచ్చేసారి విస్తరణలో యిచ్చినా యివ్వవచ్చు. ఇప్పుడు యివ్వలేదు కదాని ఆయన పార్టీ వీడి వెళ్లడు. ధర్నాలు చేయడు. అందువలన అర్జంటుగా కొంప మునిగిపోయినట్లు హంగామా చేయడం అనవసరం. ఆయన హయాంలో రైల్వే శాఖ ద్వారా రాష్ట్రానికి జరిగిన ప్రత్యేకమైన మేలు ఏదీ కనబడదు, అయినా ఆయనకు మంత్రిపదవి యిచ్చి వుంటే అందరం సంతోషించేవాళ్లం. కానీ బిజెపి అధిష్టానం ఆలోచనలు ఎలా వున్నాయో కూడా ఆలోచించి చూడాలి కదా.

బిసి వివక్షత కార్డు యీ కేసులో పని చేయదు. ఎందుకంటే మోదీయే బిసి. ఆయన తలచుకుంటే యివ్వలేడా? ఆయన మాటను కాదనగల దమ్ము ఎవరికి వుందక్కడ? ఇక తెలంగాణ ఫ్యాక్టర్‌. నిష్పక్షపాతంగా ఆలోచించి చూడండి – బిజెపి తెలంగాణకు ఎందుకు ప్రాధాన్యత యివ్వాలి? నిజానికి గత నాలుగైదేళ్లగా బిజెపి నిరంతరం తెలంగాణకోసం పోరాడుతూనే వచ్చింది. ఆంధ్ర బిజెపి దెబ్బ తింటున్నా జాక్‌లో వుండి తెరాసతో కలిసి పని చేసింది. తెరాస శాసనమండలి అభ్యర్థి ముస్లిము అయినా మద్దతు యిచ్చారు. కిషన్‌రెడ్డి తెలంగాణ అంతా తిరిగి పాదయాత్ర చేశారు. తెలంగాణ బిల్లు పాస్‌ కావడానికి కాంగ్రెసుకు సహకరించారు. బిల్లు అవకతవకలుగా వుందని చెప్తూనే దాన్ని సవరించే ప్రయత్నాన్ని కూడా తెలంగాణ ప్రజలు అపార్థం చేసుకుంటారన్న భయంతో ప్రతీదానికీ తలూపారు. దీనిపై నిలదీసిన ఆంధ్ర ప్రజలకు బిజెపి జాతీయ నాయకులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంత చేసిన వారికి తెలంగాణ ప్రజలు చేసిన ప్రత్యుపకారమేమిటి? మొన్న ఎన్నికలలో బిజెపికి వచ్చిన ఓట్ల శాతం 6.7%. ఉద్యమం తీవ్రంగా నడిచిన కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌లలో అయితే కేవలం 6%! ఉద్యమం బలహీనంగా వున్న హైదరాబాదు, రంగారెడ్డి, దక్షిణ తెలంగాణ జిల్లాలలో పర్శంటేజి బాగా వచ్చింది కాబట్టి మొత్తం మీద 6.7%కి డేకింది. అంటే తెలంగాణ ప్రజలు బిజెపికి కట్టబెట్టినది ఏమీ లేదు. మరి బిజెపి నాయకత్వం నుండి ఏదైనా ఎలా ఆశించగలరు?

'తెలంగాణకు నిధులు సమకూర్చడంకోసం జాతీయ నాయకత్వంతో ఎలా వ్యవహరిస్తారు?' అని కిషన్‌రెడ్డిని అడిగితే ఆయన 'ఓట్లు తెరాసకు వేసి, నిధులు తెచ్చే బాధ్యత మాపై పెడితే ఎలా?' అని అడిగారు. కెసియార్‌ యిలాటి వాదనే గతంలో వినిపించారు. 'ఓట్లు కాంగ్రెసుకు వేసి, తెలంగాణ రక్షణ బాధ్యత మాకు అప్పగిస్తే ఎలా? గాడిదలకు మేత వేసి, ఆవును పాలిమ్మంటే యిస్తదా?' అని. ఇప్పుడు ఆ వాదనే బిజెపికి వర్తిస్తుంది. తెలంగాణ బిజెపి, ఏ మొహం పెట్టుకుని జాతీయ బిజెపిని ఫేవర్స్‌ అడగగలదు? 'ఆంధ్రలో పార్టీని ముంచి, మీరడిగిన తెలంగాణ యిస్తే మీరు మాకేం యిచ్చారు?' అని వాళ్లడిగితే? సోనియా టి-కాంగ్రెసు నేతలను యిలాగే అడిగితే వాళ్లు వెక్కివెక్కి రాగాలు పెట్టారట. (అదంతా ఉత్తిదే అని పొన్నం చెప్పారు, సోనియా మెచ్చుకున్నారని చెప్పకుండా బతికించారు). బిజెపి నాయకులకు కూడా అలాటి సత్కారమే జరిగి వుంటుంది. 

ఓట్లన్నీ పెద్దమ్మకే వేసేస్తారేమో, యీ చిన్నమ్మ సంగతీ గుర్తు పెట్టుకోండి అని సుష్మా తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. ఇద్దర్నీ పక్కన పడేసింది తెలంగాణ ప్రజ. కాంగ్రెసుకు కాస్తయినా వడ్డించారేమో కానీ బిజెపికి అదీ లేదు. బిజెపి గెలిచిన సీట్లన్నీ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లవే. హైదరాబాదు, రంగారెడ్డిలో సమైక్యవాదం గట్టిగా వుందనేది లోకవిదితం. అందుకే కిషన్‌ రెడ్డి అంబర్‌పేట స్థానానికి రాజీనామా చేసి ఉపయెన్నికలకు ఎదుర్కోవడానికి దడిశారు. ఈ ఎన్నికలలో కూడా హైదరాబాదులో సమైక్యవాదులు, ఆంధ్రమూలాలున్నవారు విభజనకారకులైన కాంగ్రెసు, తెరాసలకు ఓట్లు వేయలేదు. ప్రత్యేకరాష్ట్రంలో తమను రక్షిస్తారనే ఆశతో టిడిపిని గెలిపిస్తూ పనిలో పనిగా దానితో జట్టుకట్టిన బిజెపిని ఐదు ఎసెంబ్లీ సీట్లతో, ఒక పార్లమెంటు సీటుతో గెలిపించారు. బయటి ప్రాంతాల్లో బిజెపి ఒక్క సీటైనా గెలవలేదు. గతంలో వున్నవి కూడా పోగొట్టుకున్నారు. అందువలన తెలంగాణ ఎసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కాని బిజెపి తెలంగాణ యూనిట్‌ అస్తిత్వానికి కారణం ఆంధ్రమూలాలున్నవారి ఓట్లు. మరి కేంద్రమంత్రి పదవి యివ్వకపోతే తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగినట్లు ఎలా అయింది? వాళ్లు ఓట్లు వేస్తే కదా!

అబ్బే కాదు, అన్యాయం జరిగిందని వాదిస్తే, మరి యిదే ధోరణిలో ఆంధ్ర బిజెపికి కూడా అన్యాయం జరిగిందనాలి. అక్కడ మాత్రం ఎవరికి యిచ్చారు కనుక? మోదీ కాబినెట్‌లో ముగ్గురు తెలుగువారికి స్థానం అని పేపర్లు రాశాయి. ముగ్గురు ఎలా అయ్యారు? వెంకయ్యనాయుణ్ని కర్ణాటక కోటాలో వేయాలి.  కాదు తెలుగు మూలాలు వున్నాయి కాబట్టి నిర్మలా సీతారామన్‌ను లెక్కలోంచి తీసేయాలి. ఆవిడ తమిళావిడ. ఏ రాష్ట్రం కోటాలో రాజ్యసభ ఎంపీ చేస్తారో యింకా తెలియదు. ఒకవేళ ఆంధ్ర కోటాలో చేసినా – వెంకయ్యలో ఎంత కన్నడత్వం వుందో, జైరాం రమేశ్‌లో ఎంత తెలుగత్వం వుందో, మన్‌మోహన్‌లో ఎంత అసామీత్వం వుందో, ఆవిడలో అంత తెలుగత్వం వుంది. తెలుగువారి కోడలు కాబట్టి.. అంటే శశి థరూర్‌ మూడు ప్రాంతాల వారికి అల్లుడు. ఆ రాష్ట్రాలూ, దేశాలూ సంతోషించేయాలి. నిర్మలా సీతారామన్‌ కార్యక్షేత్రం ఆంధ్ర కాదు. జాతీయస్థాయిలోనే ఆపరేట్‌ చేశారు. 

ఆంధ్ర బిజెపి నుండి యిద్దరు ఎంపీలున్నా (తెలంగాణకు రెట్టింపు) వారికీ యివ్వలేదు. ఎన్‌డిఏ భాగస్వాములందరికీ తలా ఒకటీ యిచ్చారు. టిడిపి వంతుకి అశోకగజపతిరాజు గారికి యిచ్చారు. ఆయన సమర్థుడు, అనుభవజ్ఞుడు. అన్ని విధాలా అర్హుడు. టిడిపికి దన్నుగా నిలబడిన ఉత్తరాంధ్రకు చెందినవాడు. ప్రాంతంతో బాటు కులం ఫ్యాక్టర్‌ కూడా పరిగణనలోకి తీసుకుని వుంటారు. ఈ సారి పశ్చిమగోదావరి జిల్లాలోని క్షత్రియులు సాలిడ్‌గా టిడిపి వెంట నిలబడి దాని విజయానికి దోహదపడ్డారు. క్షత్రియుడైన అశోక్‌గారిని కేంద్రమంత్రిని చేసి వాళ్లను తృప్తి పరిచారు. దక్షిణాదిన యితర రాష్ట్రాలలో ఏ పార్టీ క్షత్రియులకు ఎంపీ టిక్కెట్లు యిస్తున్నట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే వాళ్లను పట్టించుకుని, ఒకప్పుడు కల్నల్‌ డియస్‌ రాజు, తర్వాత కృష్ణంరాజు, ఇప్పుడు అశోకగజపతి రాజు వంటి వారిని మంత్రులుగా పంపుతోంది. 

ఆంధ్రనుండి టిడిపికి ముగ్గురు కాబినెట్‌, నలుగురు సహాయమంత్రులు యిస్తారని మీడియా హోరెత్తించింది. అదేం జరగలేదు. అయినా ఎంతమందికని యిస్తారు? ఎందుకిస్తారు? బిజెకి రాజకీయ అవసరాలుండవా? వాళ్లు కావలసినది యుపి, బిహార్‌లలో పాగా వేయడం. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ పాగా వేయడం. అందుకే ఆ రాష్ట్రాలకు పదవులు బాగా వడ్డించారు. సొంతంగా బలం వుంది కాబట్టి తన పార్టీ సభ్యులను బాగా తృప్తి పరచగలిగారు. భాగస్వాములపై ఆధారపడేటట్టయితే వాళ్లకు యింకా ఎక్కువ పదవులు యివ్వాల్సి వచ్చేది. ఇప్పుడు తలా ఒకటి యివ్వడం శివసేనకు నచ్చలేదు. రుసరుసలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్లకు ఒకటి, రెండు పదవులు యింకా యివ్వవచ్చు. ఏమిచ్చినా, ఏమివ్వకపోయినా యిప్పుడు మోదీని నిలదీయ గలిగేవారెవరూ లేరు. నిధుల విషయంలో ఆంధ్ర, తెలంగాణ రెండూ మోదీపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. నిధులు కురిపించేస్తాడనుకుంటున్నారు. ఇక్కడెందుకు యిస్తాడు? యుపి, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి అక్కడ యిచ్చి అక్కడ తమ ప్రభుత్వాలు వచ్చేట్లు చూసుకుంటారు. అయిదేళ్లదాకా మన దగ్గర ఎన్నికలు లేవు. నిధులిచ్చినా దాన్ని రాజకీయంగా వాడుకోగల సత్తా స్థానిక బిజెపి యూనిట్లకు లేదని తేలిపోయింది. మహా అయితే 2019 ఎన్నికలకు కాస్త ముందు కాసిన్ని నిధులు యివ్వవచ్చు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలు పోటీపడి కేంద్రంలో బలం పెంచుకుంటాయని కొందరు మేధావులు తెగ వాదించారు. విభజనకు ముందు మనకు ఎన్ని పదవులు వున్నాయో తెలుసు. విభజన తర్వాత యిప్పుడు చూడండి- ఆంధ్ర, తెలంగాణ రెండింటికి కలిపికి ఒకే కేంద్రమంత్రి పదవి దక్కింది. అదీ అధికారపార్టీకి చెందిన వ్యక్తి కాదు. రేపు టిడిపి-బిజెపిలకు చెడితే ఆయనా తప్పుకోవలసి వస్తుంది. కలసివుంటే కలదు సుఖం, విడిపోతే తీరని నష్టం అని పెద్దలు వూరికే అనలేదు. 

దత్తన్నకు మంత్రిపదవి యివ్వకపోవడానికి పోలవరం ఆర్డినెన్సుకు లింకు పెట్టి కొందరు మాట్లాడుతున్నారు. ఆయన కాబినెట్‌లో వుండగా కాబినెట్‌ సమావేశం ఆర్డినెన్సుపై సంతకం పెట్టమని రాష్ట్రపతిని కోరడం ఆయనకు, పార్టీకి యిబ్బందికరమని, అందుకే పదవి యివ్వలేదనీ ఒక వాదన. ఈ విషయంలో ఆంధ్రకు మేలు జరిగింది కాబట్టి యిలా అంటున్నారు. రేపు నిధుల విషయంలోనో, విధివిధానాల విషయంలోనో తెలంగాణకు మేలు కలిగే నిర్ణయం కేంద్రం తీసుకోవాలంటే అప్పుడు అశోకగజపతిరాజును తీసేస్తారా? మన రెండు తెలుగు రాష్ట్రాలూ అడుగడుగునా కేంద్రం గడప తొక్కుతూనే వుండాలి. నెలనెలా  జీతాలకో, కరంటుకో, శాంక్షన్‌లకో ముష్టి ఎత్తుతూనే వుండాలి. విభజనకోసం అన్ని అధికారాలూ వాళ్లకు అప్పగించి కూర్చున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా యింకో రాష్ట్రం అభ్యంతరపెడుతూనే వుండవచ్చు. అందుకని ఆ ప్రాంతం నుండి ప్రాతినిథ్యం లేకుండా చేస్తారా? ఇది అసమంజసం. ఆయనకు పదవి యివ్వకపోవడానికి కారణం – ఆయనకు సత్తా చాలకపోవడం! తెలంగాణ ప్రజలు ఆ సత్తా ఆయనకు యివ్వలేదు. తెరాసకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి, తమ ఉనికిని చాటుకుని ఉపయెన్నికలలో నైనా (మెదక్‌ ఉపయెన్నిక రాబోతోంది) గెలిస్తేనే తెలంగాణ బిజెపిని అధిష్టానం గుర్తించి మన్నిస్తుంది. లేకపోతే ధూంధాం అంటూ పూసుకుని తిరిగి, అలాయ్‌-బలాయ్‌లో కలిసి విందులు కుడిచి, ఎన్నికల సమయంలో ఓట్లు వాళ్లకు ధారపోస్తే..యింతే సంగతులు…! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)

[email protected]