ఎమ్బీయస్‌ : అంతా వాస్తు చాదస్తమేనా? – 3

వాస్తు ఎలా పుట్టిందో, అది ఎంతవరకు శాస్త్రీయమో విపులంగా రాయండి అని కొందరు అడుగుతున్నారు. సైన్సు రచయిత కవనశర్మగారు ఇంజనియర్‌, పరిశోధకులు, ప్రొఫెసరు, ఏం రాసినా క్షుణ్ణంగా తర్కించి పాతను, కొత్తను సమన్వయం చేసి…

వాస్తు ఎలా పుట్టిందో, అది ఎంతవరకు శాస్త్రీయమో విపులంగా రాయండి అని కొందరు అడుగుతున్నారు. సైన్సు రచయిత కవనశర్మగారు ఇంజనియర్‌, పరిశోధకులు, ప్రొఫెసరు, ఏం రాసినా క్షుణ్ణంగా తర్కించి పాతను, కొత్తను సమన్వయం చేసి తిరుగులేని విధంగా రాస్తారు. ''రచన'' పత్రికలో వాస్తుపై వరుసగా వ్యాసాలు రాశారు. పుస్తకంగా వచ్చిందేమో తెలియదు. అది చదివితే మంచిది. ఏది ఏమైనా 'మనం చేసినా తలరాత తప్పించుకోలేం, పూర్వజన్మ పాపపుణ్యాల కారణంగా అంతా ముందే నిర్ణయమై పోయి వుంటుంది' అనే మాట మనం విశ్వసిస్తే యివాళ గోడ కట్టో, కన్నం పెట్టో, కూలగొట్టో దాన్ని మార్చలేం. ఏ నమ్మకమైనా వ్యక్తిగతమే. ఇంట్లో అందరూ ఒకే దేవుణ్ని పూజిస్తారన్న గ్యారంటీ లేదు. ఎవరి యిష్టదైవం వారికే. అలాగే జ్యోతిష్కుడు కూడా! ఒకరు నమ్మినవారిని మరొకరు నమ్మరు. అలాటప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి వాస్తుపండితుడు ఒక్కడే ఎలా వుండగలడు? ఇవాళ ఆయన ప్రస్తుత సెక్రటేరియట్‌ పనికి రాదు అని చెప్తే మనమందరం నమ్మేయడమేనా? మరొకరు వచ్చి కొత్తది పనికి రాదని చెపితే? ఎర్రగడ్డ హాస్పటల్‌ స్థలానికి 15 రకాల వాస్తుదోషాలు వున్నాయని యివాళ్టి పేపర్లో వచ్చింది. అనేక వీధిశూలలు వున్నాయట. 

అసలు వీధిశూల వద్దని ఎందుకు అన్నారో ఒక వాస్తు పండితుడు చెప్పాడు. గతకాలంలో రథాలు మలుపు తిరిగేటప్పుడు ఏ చక్రమో వూడిపడిపోయి మన యింటి గోడమీద పడే ప్రమాదం వుంది కాబట్టి వద్దన్నారట. అప్పట్లో అయితే వాహనాలు తక్కువ. ఇప్పుడు యింట్లోనే రెండు, మూడు వాహనాలు వుంటున్నాయి. మన యింట్లో వాళ్లే అదుపు తప్పి కాంపౌండువాల్‌ గుద్దేసే ప్రమాదం లేకపోలేదు. వీధి శూల వుంటే పైకి రారని చెప్తారు. మద్రాసులో శివాజీ గణేశన్‌ యింటికి వీధి శూల వుంది. ఆయన పైకి రాలేదా? వీధిశూలకు పరిహారం అంటూ వీధి ఎదురుగా ప్రహారీగోడలో చిన్న వినాయకుడి బొమ్మ పెట్టారు. ఆ విగ్రహం సొంతంగా కొనకూడదని, ఎక్కణ్నుంచో ఎత్తుకురావాలని కూడా నమ్మకం. దానికి లాజిక్‌ ఏమిటో అర్థం కాదు. ఇప్పుడున్న సెక్రటేరియట్‌కు కూడా వాస్తుదోషం అంటే ఏ విగ్రహాన్నో దొంగిలించి పెడితే సరి! ఇవాళ్టి పేపర్లోనే మరో న్యూస్‌ కెసియార్‌ ఆఫీసుకి వెళ్లేదారిలో వాస్తు దోషం వుందట, అది వక్రమార్గంట. సరి చేయడానికి 10 లక్షల రూ.లు శాంక్షన్‌ చేశారట. ఆఫీసులోకి డైరక్టుగా వెళ్లాలట. పక్క గుమ్మం నుంచి వెళ్లకూడదట. మన యింటికి వీధివైపు గుమ్మం వుంటే అందరూ కనబడతారని, ఆ గుమ్మం మూసి వుంచి పక్కన గుమ్మం ద్వారా రాకపోకలు సాగిస్తాం. అదీ వక్రమార్గమేనా? ఇలాటి శంకలతోనే అనుకుంటా, పార్లమెంటు భవనానికే వాస్తు వంకలు పెట్టారట. అది ఏ ప్రాంతపు వాస్తు ప్రకారమో!?

మీకు తెలుసా? జ్యోతిష్యం కూడా అబ్సల్యూట్‌ సైన్స్‌ కాదు. ఎవరి స్కూలు వారిదే. పరాశరుడు 9 గ్రహాలను మాత్రమే కన్సిడర్‌ చేశాడు. గౌతముడు మాంది, గుళికుడు, ధూమ్రకుడు అనే మరి మూడు గ్రహాలను కూడా లెక్కలోకి తీసుకోవాలన్నాడు. జైముని మహర్షి ధూమ్రకుని వదిలివేసి 11 మందితో చెప్తే చాలన్నాడు. శ్రీపతి, సత్యాచార్యుడు, వరాహమిహిరుడు 9టిలో ఛాయాగ్రహాలైన రాహు, కేతువులను వదిలి మిగిలన ఏడు గ్రహాలనే ఆధారంగా చేసుకుని ఫలితాలు రాశారు. గ్రహాల మిత్ర, శత్రుత్వాల పట్టికలో రాహు, కేతువులు కనబడరు. పైన చెప్పిన ఋషులే కాక, యింకా అనేకమంది ఋషులు జ్యోతిష్యశాస్త్రాలను రాశారు. గ్రహాల సంఖ్యలోనే భేదం వుందని చెప్పాను కదా, ఫలితాల విషయంలో యింకా ఎన్ని తేడాలున్నాయో చెప్పనలవి కాదు. సైన్సులో నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద ఆవిరవుతుంది అని చెప్పినంత రూఢిగా జాతకఫలితాలు చెప్పే స్థితి యిప్పటిదాకా రాలేదు. అంతా సబ్జక్టివ్‌గానే వుంది. ఫలితాలు హిట్‌ అండ్‌ మిస్‌గా వున్నాయి. ప్రయోగ దశ లోనే వున్న యీ విద్యను విస్మరించకుండా పరిశోధిస్తూ పోతే ఎప్పటికైనా పరిపూర్ణరూపం రావచ్చు. దానికి కొన్ని వందల, వేల సంవత్సరాలు పట్టవచ్చు – ఓపెన్‌ మైండ్‌తో డీల్‌ చేస్తే. ఈ దశలో దాన్ని నమ్ముకుని ప్రజల జీవితాలను ప్రభావితం చేసే భారీ నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. 

ప్రతీ సినిమా ముహూర్తం పెట్టి, పూజ చేసి ప్రారంభిస్తున్నారు. అయినా 80% సినిమాలకు డబ్బు వెనక్కి రావటం లేదు. అది నిర్మాత సొంత డబ్బు. లాభనష్టాలు ఆయనవే. రాష్ట్రం అంటే పౌరులందరిదీ. ఎవరి జాతకం ప్రకారం ముహూర్తం పెట్టాలి? బాబు మంచి ముహూర్తంలోప్రమాణస్వీకారం చేయడానికై ప్రమాణస్వీకారాన్ని  వారం రోజులకు వాయిదా వేసుకున్నారు. బాబు పాలనకోసం పదేళ్లగా ఎదురుచూసినవారు పాపం ఆగవలసి వచ్చింది. ఆ ముహూర్తం ఎలా పెట్టి వుంటారు? చంద్రబాబుగారి పుట్టిన తేదీ, సమయం ప్రకారం పెట్టి వుంటారు. అది ఆయన మేలును దృష్టిలో పెట్టుకుని నిర్ణయించిన ముహూర్తం, ఆయనకు మంచి జరిగితే రాష్ట్రానికి మంచి జరగాలన్న నియమమేమీ లేదు. అలాగే కెసియార్‌ ముహూర్తం చూసే ప్రమాణస్వీకారం చేశారు. ఆ ముహూర్తంలోనే  చేసిన ఉపముఖ్యమంత్రి ఆర్నెల్లు తిరక్కుండా పదవి నుండి బర్తరఫ్‌ అయ్యారు. ముహూర్తబలం చాలకో ఏమో నెలల్లోనే పదవి పోగొట్టుకున్న ముఖ్యమంత్రులూ వున్నారు.

నా బోటి వాడికే యివన్నీ తోచినపుడు, యీ విషయాలపై చక్కని పరిజ్ఞానం వున్న కెసియార్‌కు కొత్త సెక్రటేరియట్‌లో కూడా కుట్రలు, బర్తరఫ్‌లు జరగకమానవని తెలియదా? వాస్తు కోసమే సెక్రటేరియట్‌ మారుస్తున్నామని పైకి చెప్పినా ఆయన ఆంతర్యం వేరే వుండి వుంటుంది. కొత్త రాజధాని పేరుతో బాబుకి కాంట్రాక్టులు యిచ్చే ఛాన్సు దొరికింది. సింగపూరు, జపాన్‌ వాళ్లందరినీ ఆకర్షిస్తున్నారు. తెలంగాణకు ఆ ఛాన్సు లేదు. ఇప్పటికే వూరంత రాజధాని వుంది. వరంగల్‌ని సూపర్‌ సిటీ చేస్తామన్నా అంబ పలకదు. ఎందరు ఆసక్తి చూపుతారో తెలియదు. స్మార్ట్‌ సిటీల స్కీములో తెలంగాణకు యిప్పటిదాకా ఏదీ శాంక్షన్‌ కాలేదు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2