ఎమ్బీయస్‌: ఢిల్లీ ఎన్నికల సస్పెన్స్‌

ఢిల్లీలో బిజెపి గెలుపు ఖాయం అనే దశ నుంచి ఆప్‌కి ఎక్కువ సీట్లు వస్తాయి అనే పరిస్థితికి మారినట్లు సర్వేలు చెపుతున్నాయి. సర్వేలను బట్టి బిజెపి వెనకబడిపోయిందని తీర్మానించడం కష్టమే. బిజెపికి వున్న పార్టీ…

ఢిల్లీలో బిజెపి గెలుపు ఖాయం అనే దశ నుంచి ఆప్‌కి ఎక్కువ సీట్లు వస్తాయి అనే పరిస్థితికి మారినట్లు సర్వేలు చెపుతున్నాయి. సర్వేలను బట్టి బిజెపి వెనకబడిపోయిందని తీర్మానించడం కష్టమే. బిజెపికి వున్న పార్టీ నిర్మాణం ఆప్‌కు లేదు. ప్రభుత్వం బిజెపి చేతిలో వుంది, పోలీసు బలగం వుంది. అమిత్‌ షా వంటి కార్యదకక్షుడు వున్నాడు. స్థానికులను నమ్ముకోకుండా యితర ప్రాంతాల నుంచి ఆరెస్సెస్‌ కార్యకర్తలను రప్పించి బూత్‌ స్థాయిలో యింటింటికి తిప్పుతున్నారట. మోదీతో సహా కాబినెట్‌ మంత్రులందరూ ఢిల్లీ ఎన్నికలలో తలమునకలయ్యారు. వీటన్నిటి వలన బిజెపి తక్కువ మార్జిన్‌తోనైనా మెజారిటీ సీట్లు గెలిచినా గెలవవచ్చు. గత ఢిల్లీ ఎన్నికల సమయంలో బిజెపి, ఆప్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు గెలుస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్లినా కిరణ్‌ బేదీను సిఎం ప్రకటించిన తర్వాత యిక్కట్లు ఏర్పడి ఆప్‌ వైపు మొగ్గు కనబడుతోంది కాబట్టి దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. సీనియర్‌ బిజెపి నాయకులను బతిమాలో, బుజ్జగించో, బెదిరించో దారికి తెచ్చుకోవచ్చు. ఢిల్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి కాబట్టి సామదానభేద దండోపాయాల్లో దేన్నీ వదలకపోవచ్చు. ఇంత చేసినా ఆప్‌కే ఎక్కువ సీట్లు వచ్చినా అప్పుడూ ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే  బిజెపిని ఓడించి, మోదీ దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కాంగ్రెసు తన ఓటర్లను ఆప్‌వైపు మళ్లించిందని అందరూ అంటున్నారు. ఈ వాదన కూడా పొరపాటని, సర్వేలలో చూస్తే పార్లమెంటు ఎన్నికల సమయం నుండి కాంగ్రెసు ఓటింగ్‌ శాతం యథాతథంగా వుందని, బిజెపి నుంచే ఆప్‌ ఓట్లు గుంజుకుంటోందనీ పరిశీలకులు అంటున్నారు. అలా జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు మోదీని గెలిపించే లక్ష్యంతో సాగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో మోదీ అభ్యర్థి కాదు,  కిరణ్‌ బేదీ! 

రాజకీయ నాయకులంటే అసహ్యం అంటూ అన్నా హజారే సమావేశాలకు వచ్చిన నాయకులను వేదిక నుంచి దింపేసిన వ్యక్తి కిరణ్‌ బేదీ. ఈ రోజు ఆమె రాజకీయాల్లోకి వచ్చి సాధారణ రాజకీయజీవిలా వాగ్దానాలు కురిపిస్తూ వుంటే, కంటతడి పెడుతూ వుంటే చాలా విడ్డూరంగా వుంది. కిరణ్‌ తన అధికారాన్ని పూర్తిగా వినియోగించి అందర్నీ అడలెత్తించిన మనిషి. ఆమె కంటె ఎక్కువ ప్రతిభావంతులున్నా, ఆమెకు రావలసినంత దాని కంటె ఎక్కువ పేరు వచ్చిందని ఐపియస్‌ అధికారులు అంటారు. ఇక రాజకీయాలన్నాక ఛోటా నాయకులు, కార్యకర్తలు దగ్గరకు వస్తారు, ఉపకారాలు చేయమని కోరతారు. కిరణ్‌ను చూస్తే వాళ్లకు గొంతు తడారిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యాక యీమె మనకు అందుబాటులో వుండదు అనే భావన బిజెపి కార్యకర్తల్లో బాగా నాటుకు పోయింది. అందుకే వారందరూ ఉత్సాహరహితంగా వున్నారు. అరవింద్‌ అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి రాటు తేలాడు. మామూలు కార్యకర్తలతో కలిసిపోతున్నాడు. అతనితో పోలిస్తే కిరణ్‌ ఉపన్యాసాలు జనాలను ఆకట్టుకోవడం లేదు. కిరణ్‌ను సిఎం అభ్యర్థిగా తేవడం గొప్ప వ్యూహం అని అమిత్‌, మోదీ అనుకుని వుండవచ్చు కానీ అది పొరపాటని యిప్పుడు అనిపిస్తోంది. తమను సంప్రదించకుండా, ఒప్పించికుండా ఎక్కణ్నుంచో సిఎం అభ్యర్థిని దింపడం నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఆమెను తేవడంలోనే మోదీ నెర్వస్‌నెస్‌ బయటపడిందని, అది ఓటర్లలో తప్పుడు సంకేతం పంపిందని బిజెపి వారి అభిప్రాయం. ఢిల్లీ రామలీలా మైదాన్‌లో జనవరి 10 న తన సభకి జనం రాకపోవడం మోదీలో కంగారు పుట్టించిందని అందరికీ తెలుసు. అంతమాత్రాన బయటివ్యక్తిని తేవాలా అనేదే వారి ప్రశ్న.

ఆప్‌కు ఆదరణ పెరుగుతున్న కొద్దీ బిజెపిలో నెర్వస్‌నెస్‌ మరింత పెరుగుతోంది. ఆప్‌ నుంచి చీలివచ్చిన సంస్థను చేరదీయడం, ఎప్పుడో వారికి వచ్చిన విరాళాలపై ఆరోపణ చేయడం హాస్యాస్పదంగా వుంది. మోదీ కూడా తన స్థాయి మరచి వీటిని ప్రస్తావించారు. ఇతరుల స్విస్‌ బ్యాంకు ఖాతాల వివరాలు జేబులో పెట్టుకుని తిరిగే ఆప్‌ నాయకులకు తమ పార్టీ ఖాతాలో డబ్బు ఎలా వచ్చిందో తెలియదా అంటూ ఎద్దేవా చేశాడు. విరాళాల వివరాలు తవ్వితే బిజెపి కవచంలో చాలా తూట్లు కనబడతాయి. ఈ విషయం తెలిసే అరవింద్‌ యీ విరాళాలే కాదు, బిజెపి కాంగ్రెసు విరాళాల విషయంలో కూడా విచారణ డిమాండ్‌ చేస్తూ సుప్రీం కోర్టుకి రాశాడు. ఇవాళే విరాళాల విషయంలో రాజకీయపార్టీలు చేసే తమాషాల గురించి ఒక రిపోర్టు పేపర్లో వచ్చింది. ఫైనాన్సు మంత్రిత్వశాఖ ఆమోదించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ నివేదిక ప్రకారం 2009-10, 2010-11 సంవత్సరాలలో రాజకీయపార్టీలు సేకరించిన విరాళాలలో 75% మొత్తం ఎవరు యిచ్చారో రికార్డులు లేవు. రూ.20 వేల రూపాయల కంటె తక్కువ విరాళం యిచ్చిన దాతల పేర్లు నమోదు చేసుకోనక్కరలేదు అనే వెసులుబాటు వుపయోగించుకుని  బిజెపి పార్టీ తమకు వచ్చిన 426 కోట్ల రూ.ల విరాళాలలో 77% 20 వేల కంటె తక్కువే అంది. తమకు వచ్చిన 775 కోట్ల రూ.లలో 88% డిటోడిటో అంది కాంగ్రెసు. బహుజన సమాజ్‌ పార్టీ అయితే తమకు వచ్చిన 172 కోట్లూ 100% అలాటి విరాళాలే అంది. 150 కోట్ల విరాళాలు చూపిన సిపిఎం 99% ఆ బాపతే అంది. అన్ని పార్టీలదీ యించుమించు యిదే చరిత్ర. ఇలాటి పరిస్థితుల్లో ఆప్‌కు వచ్చిన విరాళాల గురించి యింత యాగీ చేస్తే నవ్వరా?

అరవింద్‌ 'ఉపద్రవీ గోత్రీకుడు' అనే యాడ్‌ ఎవరు డిజైన్‌ చేశారో కానీ చాలా పూర్‌ టేస్టు కనబరచారు. ఇందిర హత్య తర్వాత జరిగిన ఎన్నికలలో రాజీవ్‌ ఎలక్షన్‌ మేనేజర్లు హిందూ ఓట్లు గంపగుత్తగా పొందడానికి శిఖ్కులను దుర్మార్గులుగా చూపించబోయారు. 'మీ టాక్సీ డ్రైవర్‌ని చూసి మీరెందుకు భయపడాలి?' అంటూ శిఖ్కు టాక్సీ డ్రైవర్‌ ఫోటో వేశారు. శిఖ్కులందరూ టాక్సీ డ్రైవర్లా అంటూ వాళ్లు విరుచుకుపడ్డారు. నిజానికి అవేమీ అవసరం లేకుండానే సింపతీ ఓటుతో రాజీవ్‌ భారీగా గెలిచారు. కానీ కాంగ్రెసు పార్టీ అప్పుడు మతాన్ని వాడుకుంది. ఇప్పుడు బిజెపి తన కులస్తులను, గోత్రీకులను అవమానపరిచింది అంటూ అరవింద్‌ రచ్చ చేస్తున్నారు. బిజెపికి యిది అవసరమా? అరాచకవాది, ఉపద్రవవాది అంటే పోలేదా? గోత్రీ అనడం దేనికి? పైగా గత రిపబ్లిక్‌ డే పెరేడ్‌ను భగ్నపరచబోయాడు కాబట్టి యీసారి పిలవలేదు అని యాడ్‌ యివ్వడం ఏమిటి? ఆయన అడగలేదు కాబట్టి ఆహ్వానం పంపలేదు అని మొన్ననే కదా చెప్పారు!? అరవింద్‌ తన ప్రభుత్వాన్ని తానే కూలదోసుకున్న అవివేకి అని అంటున్నారు. అది పొరపాటు, మళ్లీ చేయను అని అరవింద్‌ స్వయంగా చెప్పుకున్నపుడు ఓటర్లు యింకేమనగలరు? ఉద్యమకారుడిగా అరవింద్‌ ఢిల్లీవాసులకు యిష్టుడు. అధికారంలో వున్న నెలన్నరలో కూడా డబ్బు తీసుకున్నట్లు ఎవరూ నిరూపించలేకపోయారు. అతనితో చర్చకు దిగడానికి భయపడిన కిరణ్‌ వేళాకోళానికి గురయ్యింది. రాజకీయాల్లో దిగడం అవకాశవాదం అంటూ అరవింద్‌ను అప్పట్లో విమర్శించిన మీరు యిప్పుడు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అని టీవీ యాంకరు అడిగితే కిరణ్‌ యింటర్వ్యూ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఇవన్నీ చాలనట్లు ఆప్‌ నాయకులు తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించింది. అవేమిటో చెప్పండి, విచారణకు ఆదేశించండి అని వాళ్లు అడిగితే జవాబు లేదు. ఒక సీనియర్‌ పోలీసు ఆఫీసరుగా పని చేసి అందర్నీ ఠారెత్తించిన ఆమె నిస్సహాయురాలంటే, మాటలు పడి వూరుకుందంటే ఎవరు నమ్ముతారు? ఇవన్నీ చీప్‌ టాక్టిక్స్‌గా మిగిలిపోతాయి.

రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం వుంటే మంచిదని బిజెపి నాయకులు నూరిపోస్తున్నారు. ఆ లెక్కన కేంద్రంలో యుపిఏ వున్నపుడు ఎంపీ, రాజస్తాన్‌, గుజరాత్‌లలో కూడా కాంగ్రెసునే గెలిపించాల్సింది. ఇప్పుడు తాము కేంద్రంలో వున్నారు కాబట్టి యిలా మాట్లాడతారు. ఇవన్నీ ఢిల్లీ ఓటర్లకు తెలియని విషయాలు కావు. వారిలో విద్యావంతులు, రాజకీయ అవగాహన వున్నవారు చాలామంది వున్నారు. అరవింద్‌ దిగిపోయిన చాలాకాలమైనా, బిజెపి ఢిల్లీ ఎన్నికలు నిర్వహించలేదు. ఫిరాయింపుదార్లతో ప్రభుత్వం ఏర్పరచాలని, విఫలమయ్యాకనే అసెంబ్లీ రద్దు చేసింది. ఈ లోగా మహారాష్ట్ర ఎన్నికలలో శివసేన కొమ్ములు విరిచింది. కశ్మీర్‌లో మెజారిటీ సీట్లు తెచ్చుకోలేకపోయినా పిడిపితో బేరాలాడుతూ వాళ్లు కిందికి దిగివచ్చేట్లా చేస్తోంది. మోదీ-అమిత్‌ యిద్దరూ గడుసువాళ్లే కాబట్టి యివన్నీ చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఏదో మ్యాజిక్‌ చేసి బిజెపిని గెలిపిస్తారు అని ఢిల్లీ ఓటర్లు కూడా అనుకుంటున్నారు కానీ యీ గడుసు యిమేజి కూడా ఒక్కోప్పుడు కౌంటర్‌ ప్రోడక్టివ్‌. గడుసువాడితో మాట్లాడేటప్పుడు ముందే ఎలర్టయి, మనసులో కౌంటర్లు రెడీ చేసుకుంటాం. అదే అవతలివాడు వెర్రిబాగులోడు అనుకుంటే మన రక్షణ వ్యవస్థ నిద్రిస్తుంది. అతను చెప్పేవి మనసులో నాటుకుంటాయి. అరవింద్‌పై జాలి కురిసి, పోనీ ఓ ఛాన్సిద్దాం అనుకున్నా అనుకోవచ్చు. కాంగ్రెసు 15 ఏళ్లపాటు పాలించి ఢిల్లీని నాశనం చేస్తే, ఆప్‌ ఏడాదిపాటు ఢిల్లీని నాశనం చేసిందని మోదీ సెటైర్లు వేశారు. ఓ పక్క అరవింద్‌ 49 రోజుల పాలన గుర్తు చేస్తూ ఎకె-49 అని పేరు పెడుతూనే అతను 365 రోజులు పాలించాడని ఎలా అంటారు? ఏడాదిలో ఏడు నెలలుగా పాలిస్తున్నది బిజెపి సర్కారు హోం శాఖే! ఇక షీలా దీక్షిత్‌ మొదటి రెండు టెర్మ్‌లు సరిగ్గా పాలించి వుండకపోతే మూడో టెర్మ్‌లో ఎన్నికయ్యేది కాదు కదా!

ఢిల్లీ ఎన్నికల ఫలితం 10 న తెలుస్తుంది. బిజెపి వాళ్లు – గెలిస్తే మోదీ మ్యాజిక్‌ అంటారు, ఓడితే బేదీ కారణంగా అంటారు. మోదీ వేవ్‌ చల్లారలేదని చూపించడమే వారి లక్ష్యం. అల అలాగే వుండిపోవడం ప్రకృతివిరుద్ధం. ఏదీ ఎల్లకాలం సాగదు. ఎక్కడో అక్కడ బ్రేకులు పడుతూంటాయి. మొన్నటివరకు సోనియా, రాహుల్‌ తమకు ఎదురు లేదని విర్రవీగారు. ఈ రోజు తరతరాల విశ్వాసపాత్రురాలు జయంతి నటరాజన్‌ నుంచి అందరూ ఎదురు తిరుగుతున్నారు.  అలాగే మోదీ-అమిత్‌ ద్వయానికి కూడా అతివిశ్వాసం పనికి రాదంటూ ఢిల్లీ ఎన్నికలు యిప్పటికే గుణపాఠం నేర్పాయి. కష్టపడి నెగ్గినా పిచికపై బ్రహ్మాస్త్రం వుపయోగించవలసి వచ్చిందన్న యీ పాఠం వారు మర్చిపోకూడదు. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]