తెలంగాణ జానపద కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దివంగత చైర్మన్ సాయిచంద్ భార్య రజనీకి కేసీఆర్ సర్కార్ సత్వర న్యాయం చేసింది. ఇటీవల సాయిచంద్ గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ జానపద కళాకారుడిగా క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలంగాణ కోసం అసువులుబాసిన శ్రీకాంతాచారి కోసం సాయిచంద్ పాడిన రాతిబొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట కేసీఆర్‌ను సైతం ఏడ్పించింది.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సాయిచంద్…బీఆర్ఎస్ విధానాలు, సంక్షేమ పథకాలపై పాటల రూపంలో ఆలపిస్తూ జనాన్ని చైతన్యపరిచారు. బీఆర్ఎస్తో పాటు తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా కేసీఆర్ సర్కార్ నియమించింది. ఆ పదవిలో ఉన్న సాయిచంద్ చిన్న వయసులోనే గుండెపోటుతో లోకాన్ని శాశ్వతంగా వీడారు.
ఈ నేపథ్యంలో సాయిచంద్ భార్య రజనీకి భర్త పదవినే ఇవ్వడం గమనార్హం. ఇవాళ ఉదయం నాంపల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో రజనీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. దీన్ని బట్టి సాయిచంద్ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకాలం తమతో పాటు నడిచి, ఆట, పాటగా మెలిగా అకస్మాత్తుగా వీడిన సాయిచంద్ కుటుంబానికి న్యాయం చేస్తామన్న కేసీఆర్ తన హామీని వెంటనే నెరవేర్చడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.