తాను మాట్లాడింది వినాలే తప్ప, ఎదుటి వాళ్ల అభిప్రాయాల్ని వినే అలవాటు చంద్రబాబుకు లేదు. అయితే తమ గోడు వినాల్సిందే అని టీడీపీ కేడర్ పట్టుపట్టారు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. టీడీపీ కేడర్ నిలదీతతో షాక్‌కు గురి కావడం చంద్రబాబు వంతైంది. బాబు, టీడీపీ కేడర్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్‌కు టీడీపీ కేంద్ర కార్యాలయం వేదిక కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి నూజివీడు కార్యకర్తలు వెళ్లారు. నూజివీడులో టీడీపీ ఇన్‌చార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు, కాపా శ్రీనివాసరావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ముద్రబోయినకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని కాపా వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ కాపా శ్రీనివాసరావు వర్గం చంద్రబాబును కోరింది. ఇందులో భాగంగా ఇటీవల తమ వర్గానికి చెందిన తెలుగు యువత మండల అధ్యక్షుడిని సస్పెండ్ చేయడాన్ని చంద్రబాబు దృష్టికి వారు తీసుకెళ్లారు. క్రియాశీలక నాయకుడిని ఎలా సస్పెండ్ చేస్తారని చంద్రబాబును కేడర్ నిలదీసినంత పని చేసింది.
తనను ప్రశ్నించడంపై చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహించారు. ముద్రబోయినకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఇష్టమొచ్చింది చేసుకోవాలని బాబు వారికి తేల్చి చెప్పారు. బాబు వైఖరిపై కాపా వర్గం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడం చర్చనీయాంశమైంది.