ఏపీ, తెలంగాణ బీజేపీ నేతల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనే కసి, పట్టుదల బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఏపీ విషయానికి వస్తే… బీజేపీలో టీడీపీ అనుకూల నేతలు ఎక్కువగా ఉన్నారు. తాము అధికారంలోకి రావడం కంటే, చంద్రబాబును ఏ విధంగా సీఎం సీట్లో కూచోపెట్టాలని వ్యూహాలు రచించే వాళ్లు ఎక్కువ. దీంతో ఏపీలో బీజేపీ ఉనికి లేకుండా పోయింది.
ఏపీ, తెలంగాణ బీజేపీలకు ఒకేసారి కొత్త రథసారథులను జాతీయ నాయకత్వం నియమించింది. ఏపీకి పురందేశ్వరి, తెలంగాణకు కిషన్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఏపీ సారథి పురందేశ్వరి బాధ్యతలు కూడా తీసుకున్నారు. తెలంగాణలో ఇంకా చేపట్టలేదు. అయితే తెలంగాణలో కిషన్‌రెడ్డి అప్పుడే కదన రంగంలో దూకారు. ఒకవైపు జోరుమని భారీ వర్షం కురుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు బయల్దేరారు. మార్గమధ్యంలో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసుల తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. వర్షంలో తడుస్తూనే బీఆర్ఎస్ సర్కార్ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా కిషన్‌రెడ్డి పోరాటం చేయడాన్ని చూడొచ్చు. ఏపీ విషయానికి వస్తే… బాధ్యతలు తీసుకున్న రోజే వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి విరుచుకుపడ్డారు. ఆ తర్వాత విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశంలో మరోసారి జగన్ సర్కార్ తీరును తప్పు పట్టారు.
ఇక మిగిలిన నేతలు మీడియాతో మాట్లాడుతూ విమర్శలకు పరిమితం అయ్యారు. ఎంతసేపూ మీడియా ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవాలనే తాపత్రయాన్ని ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలితో పాటు నాయకుల్లో చూడొచ్చు.
ఇదే తెలంగాణలో మాత్రం పోరాటాల ద్వారా బీజేపీని బలోపేతం చేసుకోవాలనే పట్టుదల కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో బీజేపీ అంతోఇంతో బలపడుతోంది. ఏపీలో పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. సొంతంగా పోరాటాల ద్వారా బలపడాలనే ధ్యాసే ఏపీ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.
ఏపీ బీజేపీ నేతల్లో లాబీయిస్టులే తప్ప, రాజకీయ స్వభావం కలిగిన నేతలు లేరనే అభిప్రాయం వుంది. ఇలాగైతే ఏపీలో బీజేపీ బతికి బట్ట కట్టేది ఎట్లా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.