తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఒక వైపు తెలంగాణలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా, రాజకీయ కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. తెలంగాణలో ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అధికారాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, ఎలాగైనా దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నూతన సారథి , కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీపై తనదైన ముద్ర వేసేందుకు అప్పుడే మొదలు పెట్టారు. తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించే నిమిత్తం కిషన్‌రెడ్డి చలో బాట సింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘునందన్ తదితర నాయకులతో కలిసి కిషన్‌రెడ్డి వెళ్తుండగా ఓఆర్ఆర్ పై పోలీసులు అడ్డుకున్నారు.
“అనుమతి లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లనివ్వమని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నేనేమైనా టెర్రరిస్టునా? నా వాహనాన్ని ఆపుతారా? కేంద్ర మంత్రి అయిన నాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించే హక్కు లేదా? వాటిని పరిశీలిస్తే మీకేంటి బాధ? నన్ను చంపుతారా చంపుకోండి” అని పోలీస్ అధికారులపై కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
ఒకవైపు వర్షం కురుస్తున్నా, తడుస్తూనే నడిరోడ్డుపై కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. చాలాసేపు కిషన్‌రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తాను ఇంటికెళ్లనని, బాట సింగారం వెళ్లి తీరుతానని ఆయన భీష్మించారు. చివరికి కిషన్‌రెడ్డి, రఘునందన్ తదితర నేతలను అరెస్ట్ చేసి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంత వరకూ కేంద్ర మంత్రిని ఇలా అరెస్ట్ చేసి, ఇళ్ల పరిశీలనను అడ్డుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.