Hidimbha Review: మూవీ రివ్యూ: హిడింబా

టైటిల్: హిడింబా రేటింగ్: 2/5 తారాగణం: అశ్విన్ బాబు, నందిత శ్వేత, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రఘు కుంచె, శుభలేఖ సుధాకర్, మక్రంద్ దేశ్ పాండే తదితరులు కెమెరా: బి రాజశేఖర్ ఎడిటింగ్: ఎమ్మార్…

టైటిల్: హిడింబా
రేటింగ్: 2/5
తారాగణం:
అశ్విన్ బాబు, నందిత శ్వేత, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రఘు కుంచె, శుభలేఖ సుధాకర్, మక్రంద్ దేశ్ పాండే తదితరులు
కెమెరా: బి రాజశేఖర్
ఎడిటింగ్: ఎమ్మార్ వర్మ
సంగీతం: వికాస్
నిర్మాతలు: గంగాపట్నం శ్రీధర్
దర్శకత్వం: అనీల్ కన్నెగంటి
విడుదల తేదీ: జూలై 19, 2023

“రాజుగారి కథ” లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన అశ్విన్ బాబు ఈ సారి ఈ వినూత్నమైన కథాంశంతో ముందుకొచ్చాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇందులో ఏముందంటే…

అమ్మాయిల వరుస కిడ్నాపుల కేసులు హైదారాబాద్ పోలీసులకి ఛాలెంజ్ గా మారతాయి. ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) కూడా దీనిపై ప్రెస్ నుంచి ప్రశ్నలు ఎదుర్కోలేక చిరాకుపడుతుంటాడు. ఈ కేసుని ఛేదించడానికి కేరళ నుంచి ఆద్య (నందిత స్వేత) అనే ఐపీయస్ ఆఫీసర్ వస్తుంది. ఆమెతో పాటు ఇంకొక ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) ఈ కేస్ విషయంలో సహాయపడతాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రోసెస్ లో హిడింబా అనే ఆటవికజాతి గురించి తెలుసుకుంటారు అభయ్, ఆద్య. ఇంతకీ ఎవరీ ఆటవికులు? వారికి ఈ కేసులకి సంబంధమేంటి? కిడ్నాపులకి పాల్పడే అసలు క్రిమినల్ ఎవరు? ఇవన్నీ హుక్ పాయింట్స్. చివరికి అన్నింటికీ జవాబులు దొరుకుతాయి.

కథని కొత్తగా రాసుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో మరింత పెరిగింది. ప్రపంచంలోని సినిమాలన్నీ ఒక్క క్లిక్ దూరంలో అందుబాటులో ఉన్న ఈ డిజిటల్ యుగంలో మేథోమథనం చేసి కొత్త కథల్ని పుట్టించగలగాలి, కొత్త యాంబియన్స్ ని చూపించగలగాలి. అంతవరకూ ఈ సినిమా విషయంలో రచయితలు కృతకృత్యులయ్యారు.

అయితే కథ ఒక్కటే సరిపోదు. కథనంలో చాలా బిగువుండాలి. అందులో కూడా మునుపు సినిమాల్లో చూసినట్టుగా అనిపించని సన్నివేశాలుండాలి. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా అవి తెర మీద పాత్రలకి అనుకూలంగా ఉండడానికి రాసుకున్నట్టు ఉండకూడదు. కథనంలో ఛాలెంజులు చాలా బలంగా ఉండాలి. ఇవన్నీ కుదిరితే తప్ప స్క్రిప్ట్ పాకాన పడదు. ఇక్కడ అదే జరిగింది. కథనంలో బలహీనతల వల్ల మంచి ప్లాట్ కాస్తా ఏవరేజ్-బిలో ఏవరేజ్ రేంజుకి దిగిపోయింది.

నరమాంసభక్షకుల నేపథ్యంలో తెలుగుసినిమాలు లేవు. ఎప్పుడో 1980ల నాటి చిరంజీవి “వేట”లో వీళ్ల ప్రస్తావన, హీరోతో ఫైట్ ఉన్నాయంతే. అయితే పూర్తిగా ఒక అరుదైన కాల్పనిక ఆటవిక జాతిని ప్రవేశపెట్టి కథ నడపడం మంచి ఆలోచనే. కానీ పైన చెప్పుకున్నట్టు కథనంలో ఇంటిలిజెన్స్ లోపించింది.

కథని మిస్లీడ్ చేయడానికి ఫస్టాఫ్ లో అవయవాల అమ్మకం ట్రాక్ పెట్టినా క్రమంగా అది సైడ్ ట్రాకులో పడిపోయింది. దానికంటూ ఒక ముగింపు లేదు. అసలు కథంతా సెకండాఫులోనే నడిచింది. అయితే క్లైమాక్సులో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చినా అప్పటివరకూ ఎమోషనల్ గా కథనం నడపకపోవడం వల్ల అది కాస్తా పెదవి విరిచేలా ఉంది. సెంటిమెంట్, ఎమోషన్ అంతర్లీనంగా ఉండుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళుండేది.

కథ బాగుందని కంగారు కంగారుగా సీనార్డర్ వేసేసుకుని, గబగబా స్క్రిప్ట్ రాసేసుకుని సెట్స్ మీదకి వెళ్లిపోయినట్టుంది తప్ప సరైన కసరత్తు చేసినట్టు అనిపించదు. సాంకేతికంగా బాగా తీస్తున్నామన్న యావలో పడి అసలు ప్రేక్షకుడికి ఎమోషన్ అందుతోందా లేదా అన్న విషయాన్ని విస్మరించాడు దర్శకుడు.

కెమెరా వర్క్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్స్. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీగానే తీసారు. అయితే ఎర్ర రంగు డ్రెస్ వేసుకున్న అమ్మాయిల కిడ్నాప్ అనే కాన్సెప్ట్ ఎప్పుడో రవిబాబు తీసిన “అనసూయ”లో ఉంది. కనీసం రంగైనా మార్చకుండా మళ్లీ అదే కాన్సెప్ట్ పెట్టుకోవడం భావదారిద్ర్యమే.

అశ్విన్ బాబు తన పాత్రకి తగ్గ ఫిజిక్ లో ఉన్నాడు. ఆద్యంతం రఫ్ఫుగా ఉండి ఫైట్స్ చేయడం తప్ప వేరే హావభావాలు పలికించాల్సిన అవసరం లేని పాత్ర కనుక పెద్దగా జడ్జ్ చేయడానికేం లేదు.

నందిత తన పాత్రతో ఆకట్టుకుని న్యాయం చేసింది.

మక్రంద్ దేశ్ పాండేది చాలా ప్రత్యేకమైన పాత్ర. ఇంతవరకు తాను ఎక్కడా ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేసి ఉండడు. మిగిలిన నటీనటులు ఓకే.

లాజిక్, టెన్షన్ పెట్టే స్క్రీన్ ప్లే లేకపోవడం, ఇంటిలిజెంట్ అంశాలు వెతికినా కనపడకపోవడం…ఎంత “ఎ” సర్టిఫికేట్ అయినా అడల్ట్స్ కూడా జుగుప్సగా ఫీలయ్యే వయలెన్స్ ఉండడం ఈ సినిమాలో ప్రధానమైన మైనస్సులు. మంచి ప్లాట్ పాయింట్ ఉన్నా కొన్ని సినిమాలు ఎందుకు వర్కౌట్ కావో చెప్పడానికి ఉదాహరణగా ఈ హిడింబాని కూడా చెప్పుకోవచ్చు. ఖరీదైన సీసాలో పోసిన చవకరకం గుడుంబా లా ఉంది ఈ హిడింబా!

బాటం లైన్: కష్టం