నాపై దుష్ప్ర‌చారం చేసినా…ఏమీ కాదు!

సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌న‌సేన దుష్ప్ర‌చారం చేయ‌డాన్ని సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ త‌ప్పు ప‌ట్టారు. దాని వ‌ల్ల త‌న‌కొచ్చిన ఇబ్బందేమీ లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎన్డీఏ మిత్ర‌ప‌క్షాల స‌మావేశానికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ హాజ‌రు…

సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌న‌సేన దుష్ప్ర‌చారం చేయ‌డాన్ని సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ త‌ప్పు ప‌ట్టారు. దాని వ‌ల్ల త‌న‌కొచ్చిన ఇబ్బందేమీ లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎన్డీఏ మిత్ర‌ప‌క్షాల స‌మావేశానికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ హాజ‌రు కావ‌డంపై నారాయ‌ణ త‌ప్పు ప‌ట్టారు. ప‌వ‌న్‌ను పొలిటిక‌ల్ బ్రోక‌ర్‌గా నారాయ‌ణ అభివ‌ర్ణించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిల‌క‌డ‌లేని రాజ‌కీయాలు చేస్తార‌ని విమ‌ర్శించారు.

దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసే బీజేపీతో క‌లిసి ప్ర‌యాణించాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్ణ‌యించుకోవ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ నేప‌థ్యంలో నారాయ‌ణ కామెంట్స్ జ‌నసేన‌ను ఇరిటేట్ చేశాయి. ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన మార్క్ విమ‌ర్శ‌ల‌తో పోస్టులు పెట్ట‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఇవాళ ఢిల్లీలో నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ చేగువేరా డ్రెస్ వేసుకునేవార‌ని గుర్తు చేశారు.

గ‌తంలో ప‌వ‌న్ వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న పుస్త‌కాలు చ‌దివే వాడ‌న్నారు. అందుకే తాము ద‌గ్గ‌ర‌య్యామ‌ని అన్నారు. వైసీపీని ఓడించాల‌ని ప‌వ‌న్ తిరుగుతున్నార‌న్నారు. టీడీపీ, బీజేపీతో క‌లిసి వైసీపీని గ‌ద్దె దించేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని నారాయ‌ణ చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ, బీజేపీ క‌లుస్తాయో, లేదో తెలియ‌ద‌న్నారు. బీజేపీతో క‌లుస్తామ‌ని చంద్ర‌బాబు ఎక్క‌డా చెప్ప‌లేద‌న్నారు. త‌న‌ను న‌మ్ముతున్న యువ‌త‌ను ప‌వ‌న్ అన్యాయం చేయ‌వ‌ద్ద‌ని నారాయ‌ణ హిత‌వు చెప్పారు.

టీడీపీ, బీజేపీ మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించొద్ద‌ని మ‌రోసారి ఆయ‌న సూచించారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన దుష్ప్ర‌చారం చేసినంత మాత్రాన త‌న‌కేమీ కాద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. మ‌ణిపూర్ మండిపోతుంటే బీజేపీ కుట్ర‌లు చేస్తోంద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. బీజేపీ నంబ‌ర్ వ‌న్ బ్లాక్ మెయిలింగ్ పార్టీలా మారింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. 

మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై పార్ల‌మెంట్ లోప‌ల మాట్లాడాల్సిన ప్ర‌ధాని మోదీ, ఆ సంగ‌తుల గురించి మీడియాతో మాట్లాడ్డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్రం విభజన చట్టాలను అమలు చేయడం లేద‌ని విమ‌ర్శించారు.