సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుల పాత్ర ఎంతో కీలకం. సన్నివేశాన్ని బట్టి, ఒకరిద్దరు జూనియర్ ఆర్టిస్టుల నుంచి వందలాదిమంది వరకు అవసరం పడతారు. సమావేశాలు, జేజేలు కొట్టడాలు, ఊరేగింపులు వుంటే వందలాది జూనియర్ ఆర్టిస్టులు అవసరం అవుతారు. బజారు సీన్, బస్ట్ స్టాండ్ ఇలాంటి వాటికి కూడా జూనియర్ ఆర్టిస్టులు తగుమోతాదులో వుంటారు. వీరికి భోజనం లేదా టిఫిన్ పెట్టి, వంద, రెండు వందల నుంచి అయిదు వందల వరకు చెల్లిస్తారు.
ఇప్పుడు టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టులను కొత్త అవసరాలకు వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పదుల సంఖ్యలో టీవీ షోలు జరుగుతున్నాయి. అన్నింటికీ ఆడియన్స్ వుండరు. మీలో ఎవరు కోటీశ్వరుడు, పాడుతా తీయగా వంటి నిజంగా ప్రేక్షకులు పాల్గొనే వాటకి సమస్య లేదు. పాల్గొనే వారి కిత్ అండ్ కిన్ వచ్చి గ్యాలరీ నిండిపోతుంది. కానీ సినిమా ప్రమోషన్లు, తమ కార్యక్రమానికి గ్లామర్ ఇచ్చే ఉభయతారక కార్యక్రమాలకు ఇప్పుడు ఆడియన్స్ గా జూనియర్ ఆర్టిస్టులను వాడుతున్నారని వినికిడి. వీరి పని అంతా కూర్చోవడం, తప్పట్లు కొట్టడం.
ఇక ఇంకో విధంగా జూనియర్ ఆర్టిస్టులను వాడుతున్నారట. చిన్న తరహా అడియో ఫంక్షన్లు, సినిమా ఫంక్షన్లు నిండుగా వుండాలంటే జూనియర్ ఆర్టిస్టులను ముందుగానే బెత్తాయించి కూర్చోబెడుతున్నారట. వీరికి ముందుగానే చెబుతారు ఎక్కడ ఈలలు వేయాలో, ఎక్కడ గోల చేయాలో. పెద్ద హీరోలు, పెద్ద ఫంక్షన్లు అంటే అభిమానులు వద్దన్నా వస్తారు. సమస్య లేదు. చిన్న సినిమాలు, చిన్న హీరోలకే. ఫంక్షన్ ఎలాగూ లైవ్ చేస్తారు కాబట్టి, ఆ మాత్రం జనం లేకుంటే హైప్ రాదు. అందుకోసమే జూనియర్ ఆర్టిస్టులను హైర్ చేస్తున్నారట.
పోనీ లెండి. ఇదో ఉపాధి. కొంతమందికయనా కాస్త కడుపునిండాతిండి. కాస్త జీతం.