హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించింది. హుద్‌హుద్ ధాటికి ఉత్తరాంధ్ర జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. తూర్పుగోదావరి జిల్లా పాక్షికంగా ధ్వంసమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఇంకా దారుణమైన పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే బాధితులకు సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి.
కాగా, హుద్‌హుద్ తుపాను దెబ్బకు ఉత్తరాంధ్రలో 21 మంది మరణించినట్లు అధికారికంగా వెల్లడయ్యింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఎక్కడ పరిస్థితులు ఎలా వున్నాయో అధికారులకే పూర్తిగా తెలియని పరిస్థితి. తుపాను తీవ్రత తగ్గినా, అక్కడక్కడా వర్షాలు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోపక్క భారీ వృక్షాలు నేలకొరిగిన దరిమిలా.. వాటిని పూర్తిగా తొలగిస్తే తప్ప, ఎంతమంది మృతి చెందారన్నదానిపై స్పష్టత వచ్చే పరిస్థితి లేదు.
విశాఖ జిల్లాలో 15 మంది మృత్యువాత పడగా, హుద్‌హుద్ తుపాను దెబ్బకి విజయనగరం జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు ఇప్పటిదాకా అందుతున్న వార్తల్ని బట్టి తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని ప్రభుత్వం చెబుతున్నా, అంచనాల్ని మించి తుపాను బీభత్సం సృష్టించిన దరిమిలా.. ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే సంభవించినట్లు సమాచారం.