చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల మధ్య ఉన్న అభిప్రాయబేధాలు రాజకీయ కారణాలతో తారాస్థాయికి చేరుకునన్నాయనేది జగద్విదితం. ఒకరిపై ఒకరికి ద్వేషం లేదంటూ ఇద్దరూ పలుమార్లు నొక్కి వక్కాణించినప్పటికీ ఒకే చోట ఇద్దరూ కలిసి కనిపించింది లేదు. గోవిందుడు అందరివాడేలే ఆడియో వేడుకలో కూడా పవన్ జాడ లేదు.
అయితే మెగా హీరోలందరూ కలిసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఆడియో వేడుకకి వస్తారంటూ పత్రికా ప్రకటన విడుదల చేసారు. చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. సాయి మొదటి సినిమా రేయ్ విడుదల కాకుండా ఆగిపోవడంతో అతనికి ఈ చిత్రం చాలా కీలకమైంది. అందుకే హైప్ తేవడం కోసం ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
మరి మేనల్లుడిని ఆశీర్వదించడానికి పవన్‌కళ్యాణ్ వస్తాడా? రాజకీయంగా అన్నయ్యతో విబేధించిన తర్వాత అతనితో కలిసి ఒకే చోట కనిపించడానికి పవన్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ ఆడియో వేడుకలో అది జరగవచ్చునని ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి నిజంగా పవన్ వస్తాడో లేక అన్నదమ్ముల్లో ఎవరో ఒకరే ఈ వేడుకకి హాజరై షరా మామూలుగా గైర్హాజరు అయిన వారి గురించి కథలు చెప్తారో చూడాలి.