ప్రతిపక్షాల్లో ప్రముఖంగా చెప్పుకోవలసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ. దాని నాయకులందరూ కాంగ్రెసు నుండి వచ్చినవారే. కర్షక, కార్మిక సంఘాల్లో పని చేస్తూ పేదల మధ్య మసలుతూ, నిజాయితీకి, నిబద్ధతకు పేరు తెచ్చుకుని, కమ్యూనిస్టు అంటే ఒక ఆదర్శానికి, ఆడంబరరహిత జీవితానికి మారుపేరు అనిపించుకున్నారు. 1936 నుంచి ఒక గ్రూపుగా వ్యవహరిస్తూ వచ్చి 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటిషు తొత్తులుగా జాతీయవాదుల చేత ముద్ర వేయించుకున్నారు. 1945లో పార్టీగా ఏర్పడ్డారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి కమ్యూనిస్టు పార్టీలో హేమాహేమీలనదగ్గ నాయకులుండేవారు. కార్మిక, కర్షక సంఘాల ద్వారా వేలాది క్యాడర్ వుండేవారు. విద్యార్థులలో, మేధావులలో, పాత్రికేయులలో కమ్యూనిస్టు సానుభూతిపరు లుండేవారు. ఇన్ని వున్నా కమ్యూనిస్టు నాయకుల్లో సిద్ధాంత విభేదాల కారణంగా అనైక్యత కారణంగా 1964లో పార్టీ చీలిపోయింది. సోషలిస్టుల్లాగానే వీళ్లు కూడా కాంగ్రెసుతో ఎలా వ్యవహరించాలి, దేశంలోని రాజకీయ వ్యవస్థను ఎలా నిర్వచించాలి అనే విషయంపైనే కలహించుకున్నారు.
దీనికి తోడు వీరికి రష్యా నుంచి మార్గదర్శక సూచనలు వచ్చేవి. ప్రపంచంలోనే తొలి కమ్యూనిస్టు (సరిగ్గా చెప్పాలంటే సోషలిస్టు) రాజ్యం కాబట్టి రష్యా మాటకు వాళ్లు విలువ యిచ్చేవారు. భారతదేశ పరిస్థితుల అవగాహనలో రష్యా తడబాటుకు వీళ్లు మూల్యం చెల్లించారు. రష్యాలో పూర్తి నియంతృత్వంతో కూడుకున్న రాజరికాన్ని కూలదోసి, కమ్యూనిజం వచ్చింది. కానీ భారత్ పరిస్థితి అదికాదు. బ్రిటిషువారి పాలన సామ్రాజ్యవాద పాలన. స్థానికులకు ఎన్నికలలో పాల్గొనే అవకాశం యిస్తూ పదవులు, హోదాలు కట్టబెడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పరచి పై అంచులో మాత్రమే తమ మాట చెల్లేట్లు చూసుకునే పాలన. బ్రిటిషు పాలనలో దోపిడీ కనుక్కోవడం కష్టం. సామాన్యుడికి అర్థమయ్యేట్లా చెప్పడం మరీ కష్టం. రష్యాలో స్వాతంత్య్రం తెచ్చుకున్నది హింసాయుత మార్గాల ద్వారా, కానీ భారత్లో స్వాతంత్య్రం వచ్చినది నూతన మార్గం ద్వారా. ప్రజలు దేవుడిగా చూస్తున్న గాంధీని రష్యా ఆదేశాలపై కమ్యూనిస్టు పార్టీ విలన్గా చూపించడానికి ప్రయత్నించి ప్రజలకు దూరమైంది. అలాగే 1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు హర్షం వ్యక్తం చేసినా, రష్యా వారి అంచనాలు వేరే వుండడంతో వారి సూచనల సలహా మేరకు నాలుగు నెలలు పోయాక స్వాతంత్య్రాన్ని, స్వాతంత్య్ర వీరులను దుయ్యబట్టడం మొదలుపెట్టింది. 'ఇప్పుడు వచ్చిన స్వాతంత్య్రం బూటకం, మనం అర్ధబానిసలం, ఆగస్టు 15 దేశప్రజలు వంచనకు గురైన దినం, సామ్రాజ్యవాదానికి (ఇంపీయరియలిజం) కొనసాగింపుగా కాంగ్రెసు ఫ్యూడలిజం (భూస్వామ్యవాదం) వైపు మళ్లింది, ప్రధాని నెహ్రూ సామ్రాజ్యవాద శక్తుల తొత్తుగా మారి ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్నాడు, ఈ బానిసత్వం ఎల్లకాలం వుంచడానికై రాజ్యాంగం రాయిస్తున్నాడు' అని కమ్యూనిస్టు పార్టీ ప్రచారం చేయసాగింది.
దీంతో బాటు 'కాంగ్రెసును కూలదోసి సామ్రాజ్యవాదానికి, భూస్వామ్యవాదానికి మంగళం పాడి, స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి సాయుధపోరాటం ఒక్కటే మార్గం' అని కమ్యూనిస్టు పార్టీ ప్రకటించడంతో అది ఆరాచకవాదుల పార్టీ అని ప్రజలు అనుకోసాగారు. 1948 ఫిబ్రవరిలో అప్పటిదాకా 13 ఏళ్లగా జనరల్ సెక్రటరీగా వున్న పిసి జోషి స్థానంలో బిటె రణదివే అనే దుందుడుకువాదిని ఎన్నుకుంది పార్టీ. అతను నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో సాగిన సాయుధపోరాటం ప్రభుత్వ సైన్యాలు వచ్చాక కొనసాగాలని నిర్ణయించాడు. అలా పోరాటం చేసుకుంటూ పోతే నైజాం స్టేటు ప్రాంతం వేరే స్వతంత్ర కమ్యూనిస్టు దేశంగా ఏర్పడుతుందని లెక్క వేశాడు. ఆ నిర్ణయం వలన వేలాది కమ్యూనిస్టు నాయకులు నేలకొరిగారు. అదే కాకుండా 1949 మార్చి 9 న దేశం మొత్తంలో రైల్వే సమ్మె నిర్వహించి, దేశంలో అల్లకల్లోలం, తద్వారా తిరుగుబాటు తీసుకువద్దామని రణదివే నిర్దేశించాడు. సమ్మె ఫ్లాపయింది. కమ్యూనిస్టు పార్టీ దేశంలో అనేక చోట్ల విద్రోహచర్యలకు పాల్పడింది. అందువలన అనేక రాష్ట్రాలలో పార్టీని నిషేధించారు. ఇవన్నీ పార్టీని ప్రజలకు దూరం చేశాయి. రాజకీయ లక్ష్యాలతో ఆగకుండా, కమ్యూనిస్టు పార్టీ నాస్తికవాదాన్ని కూడా తలకెత్తుకుంది. సామాజిక చైతన్యం, వర్గవిభేదాల స్పృహ, శ్రమ దోపిడీ అవగాహనలకు మతవిశ్వాసాలు అడ్డు వస్తాయని, మతం మత్తుమందు వంటిదని, తాడిత, పీడిత వర్గాలు కలవనీయకుండా, వారిలో చైతన్యం కలగకుండా, పాలకులు దేవుడి పేరు వుపయోగిస్తారు కాబట్టి, ప్రజలకు మతంపై విశ్వాసం లేకుండా చేయాలని కమ్యూనిస్టు సిద్ధాంతం.
దేవుడిపై నమ్మకాన్ని ప్రగాఢంగా మనసులో నిలుపుకున్న సగటు భారతీయుడు వీళ్లని వింత జీవుల్లా, గ్రహాంతరవాసుల్లా, వ్యవస్థవిధ్వంసకుల్లా, అరాచకవాదుల్లా చూశాడు. దానికి తోడు రష్యా చెప్పినట్లల్లా ఆడుతూండడం వలన వారిపై అపనమ్మకం కలిగింది. వీరిలో భారతీయత లేదనుకున్నారు. రణదివే విధానాలను వ్యతిరేకించాలని కొందరు కమ్యూనిస్టు నాయకులు అనుకున్నా అతడు సమావేశాలే నిర్వహించకుండా కొద్దిమంది అనుచరుల సహాయంతో చిత్తానుసారం పార్టీని నడిపాడు. తన మాట కాదన్నవారిని పార్టీలోంచి బహిష్కరించసాగాడు. ఆ విధంగా ఒకప్పుడు 90 వేలున్న సభ్యత్వం 1951 నాటికి 18 వేలకు పడిపోయింది. ఈ విధంగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ బలహీనపడడం స్టాలిన్ దృష్టికి వచ్చింది. భారతదేశపు పరిస్థితులు సరిగ్గా అధ్యయనం చేయకుండా తన అనుచరులు తప్పుడు సలహాలిచ్చారని గ్రహించి, తనే శ్రద్ధ పెట్టి వ్యవహారాలు చక్కదిద్దడానికి చూశాడు. భారత కమ్యూనిస్టు నాయకుల్ని రష్యా పిలిపించి 'పోలీసు చర్య తర్వాత తెలంగాణ సాయుధపోరాటం కొనసాగించడం తప్పు, చుట్టూ శత్రుసైన్యాలు చుట్టుముట్టినపుడు పారిపోయేందుకు సముద్రమార్గమైనా లేదు, స్వతంత్రదేశంగా ఎలా వుండగలరు?' అని మందలించాడు. నాయకుల మధ్య సయోధ్య కుదిర్చాడు. దాని కారణంగా 1951 చివర్లో రణదివే స్థానంలో అజయ్ ఘోష్ జనరల్ సెక్రటరీ అయ్యాడు. (సశేషం) (ఫోటో – బిటి రణదివే)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)