క‌మ‌లానికి ప‌ట్టు చిక్క‌ని క‌ర్ణాట‌క ఆట‌!

క‌ర్ణాట‌క‌లో కమ‌లం పార్టీ అడుగులు త‌డ‌బ‌డుతున్న‌ట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల్చి త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న క‌మ‌ల‌నాథులు ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల మెప్పును పొంద‌డం ఎలా ఉన్నా, పాల‌న తీరే…

క‌ర్ణాట‌క‌లో కమ‌లం పార్టీ అడుగులు త‌డ‌బ‌డుతున్న‌ట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల్చి త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న క‌మ‌ల‌నాథులు ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల మెప్పును పొంద‌డం ఎలా ఉన్నా, పాల‌న తీరే విమ‌ర్శ‌ల‌కు తావిచ్చేలా సాగుతూ ఉంది.

సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల్చిన అనంత‌రం య‌డియూర‌ప్ప‌ను త‌ప్ప‌క సీఎం పీఠంలో కూర్చోబెట్టారు. అయితే య‌డియూర‌ప్ప ప‌ద‌వీ కాల‌మంతా దిన‌దిన‌గండం అన్న‌ట్టుగానే సాగింది. చివ‌ర‌కు ఆయ‌న‌ను దించేశారు. సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల మేరకు య‌డియూర‌ప్ప అనుచ‌రుడినే సీఎం సీట్లో కూర్చోబెట్టారు.

ఆయ‌నేమో మ‌త సంబంధ వ్య‌వ‌హారాల్లో విధానాలు చేస్తూ దుమారం రేపుతూ ఉన్నారు. మ‌త మార్పిడినిరోధ‌క బిల్లు, విద్యాల‌యాల్లో హిజాబ్ ల నిషేధం వంటి అంశాలను ఆయ‌న అస్త్రాలుగా మ‌లుచుకోవ‌డం ఏమిటో కానీ, బొమ్మై కు బీజేపీ హై క‌మాండ్ ఫ్రీహ్యాండ్ ఇవ్వ‌డం మాట అటుంచి, ఆయ‌న‌ను ప‌దే ప‌దే ఢిల్లీ చుట్టూ తిప్పుకోవ‌డం కూడా వార్త‌ల్లో నిలుస్తూ ఉంది.

నెల‌కు రెండు సార్లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేప‌ట్టే స్థితిలో క‌నిపిస్తూ ఉన్నారు బొమ్మై. అంతే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌రోసారి ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌నున్నార‌నే ఊహాగానాలూ వ‌స్తూనే ఉన్నాయి క‌న్న‌డ మీడియాలో! ఇలాంటి నేప‌థ్యంలో అమిత్ షా క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బొమ్మై విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని, ఆయ‌న‌ను తొల‌గించ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తూ ఉంది.

మ‌రీ ఇంత‌లోనే బొమ్మైను దించేస్తే పోయేది బీజేపీ హై క‌మాండ్ ప‌రువే. ఒక‌వేళ ఆయ‌న ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూ పాల‌న సాగించినా, అది బీజేపీ చెప్పే విధానాలకు విరుద్ధంగా ఉంటుంది! వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. 

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో బీజేపీ బాగా దెబ్బ‌తిన్న దాఖ‌లాలూ క‌నిపిస్తూ ఉన్నాయి. ద‌క్షిణాదిన త‌మ‌కు అప్పుడ‌ప్పుడైనా అధికారాన్ని ఇచ్చే రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి ఆట‌లో ప‌ట్టు చిక్కుతున్న‌ట్టుగా లేదు!