యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సాగుతున్న యుద్ధంపై ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో విజేత ఎవరూ ఉండరని మోడీ వ్యాఖ్యానించారు. మనం శాంతి కోసం ఇక్కడ ఉన్నామని, యుద్ధాన్ని ఆపడం ఉత్తమమని మోడీ సూచించారు.
జర్మనీ, డెన్మార్క్ తదితర యూరోపియన్ దేశాల్లో మోడీ పర్యటన సాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధం గురించి భారత్ అధికారికంగా స్పందించినట్టుగా అయ్యింది. ఆ ఇరు దేశాల్లో దేని వైపూ భారత్ అధికారికంగా మొగ్గలేదు.
అయితే యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల అమలు విషయంలో మాత్రం భారత్ పై ఒత్తిడి ఉంది. అయితే అమెరికా ఆంక్షలకు ఇప్పటి వరకూ ఇండియా తలొగ్గిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఇండియానే కాదు.. రష్యా పై అమెరికా విధించిన ఆంక్షలను దాని సన్నిహిత యూరోపియన్ దేశాలు కానీ, నాటో దేశాలు కానీ పాటించే అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో మోడీ యూరప్ పర్యటన ఆసక్తిని రేపుతోంది. జర్మనీలో పర్యటనలో భాగంగా ఇరు దేశాలూ పలు ఒప్పందాలు చేసుకున్నాయి. యూరప్ లోని ప్రవాస భారతీయులతో కూడా మోడీ సమావేశాలు జరగనున్నాయి ఈ పర్యటనలో.
మరి యుద్ధంతో నష్టమే తప్ప.. రెండు దేశాల్లో దేనికీ లాభం లేదని, శాంతి మంత్రం పఠించాలని అంటున్న మోడీ మాటల పట్ల యుద్ధంలో మునిగిన దేశాల స్పందన ఎలా ఉంటుందో!