నటి, ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాల బెయిల్ పిటిషన్ పై బాంబే కోర్టు తన తీర్పును వెలువరించలేదు. ముందుగా జరిగిన వాదోపవాదాల అనంతరం వారి బెయిల్ పిటిషన్ పై సోమవారం కోర్టును తీర్పును వెలువరించాల్సింది. అయితే సోమవారం లేట్ కావడం, మంగళవారం రంజాన్ సందర్భంగా కోర్టుకు సెలవు ఉండటంతో.. వీరి బెయిల్ పిటిషన్ పై తీర్పు బుధవారం వెలువడనుంది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామంటూ ఈ దంపతులు చేసిన బహిరంగ హెచ్చరిక వీరి అరెస్టుకు కారణం అయ్యింది. ఇలా మత రాజకీయం చేయబోయి వీరు ఇరకాటంలో పడ్డారు.
వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా.. వారి ఇంటి ముందు కావాలని మత సంబంధ కార్యక్రమాలను నిర్వహించడమే నేరం. ఆ పై మతఘర్షణలు రేకెత్తించేలా ముఖ్యమంత్రి ఇంటి ముందు ఇలాంటి రాజకీయం చేస్తామని వీరు బహిరంగంగా హెచ్చరించడం శాంతిభద్రతల అంశంగా కూడా మారింది.
దీంతో లేట్ చేయకుండా వీరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు కూడా వీరి అరెస్టును ఇప్పటి వరకూ తప్పు పట్టలేదు. బెయిల్ పిటిషన్ దాఖలైనప్పటికీ.. తీర్పు వాయిదా పడింది. ఈ దంపతులను వేర్వేరు జైళ్లకు తరలించాలని ఇది వరకే బాంబే కోర్టు తీర్పును ఇచ్చింది.
ఉద్రిక్తతలను రేకెత్తించేలా ప్రకటనలు చేసి వీరు ఇరకాటంలో పడ్డారు. తాము కావాలని మైకులు పెట్టి హనుమాన్ చాలీసాను పఠిస్తామంటూ వీరు .. తమ మత రాజకీయ వాంఛను చాటుకుని ఊచలు లెక్కబెడుతున్నట్టున్నారు.