ఎమ్బీయస్‌ : ఫిరాయింపుల చేదుమాత్ర

ప్రమాణస్వీకారాలు జరగకుండానే ఫిరాయింపులు మొదలయ్యాయి. విభజన కారణంగా కాంగ్రెసు పార్టీ ఆంధ్రలో తుడిచిపెట్టుకుని పోయింది. అది మళ్లీ ఓ పాటిగానైనా కోలుకోవడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది – జాతీయనాయకత్వం బాగుంటే! అదే సోనియా, అదే…

ప్రమాణస్వీకారాలు జరగకుండానే ఫిరాయింపులు మొదలయ్యాయి. విభజన కారణంగా కాంగ్రెసు పార్టీ ఆంధ్రలో తుడిచిపెట్టుకుని పోయింది. అది మళ్లీ ఓ పాటిగానైనా కోలుకోవడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది – జాతీయనాయకత్వం బాగుంటే! అదే సోనియా, అదే రాహుల్‌ అయితే యిటువైపు తొంగి చూడడానికి కూడా భయపడి రారు. పార్టీని బలోపేతం చేయడానికంటూ జైరాం రమేశ్‌ను, కొప్పుల రాజును పంపుతారు. అంతే సంగతులు. అధికారంలోకి వస్తున్న టిడిపికి కాంగ్రెసు బెడద తప్పిపోయింది. ఇక మిగిలినది వైకాపా. 2% ఓట్ల తేడాతో పక్కలో బల్లెంలా వుంది. చేసిన హామీలు నెరవేరుస్తూ ప్రజలను, తద్వారా ప్రజాప్రతినిథులను తమవైపు తిప్పుకుంటూ వచ్చే ఎన్నికల నాటికి వైకాపాను నామమాత్రం చేయడమనే పద్ధతి పాఠ్యపుస్తకాల్లో, సంపాదకీయాల్లో నుడివే పద్ధతి. అంతకంటె అడ్డదారి – ఫిరాయింపులు ప్రోత్సహించి, అవతలి పార్టీని దివాళా తీయించడం. ఇప్పుడు టిడిపి అదే పనిలో పడింది. ఎన్టీయార్‌ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు కాంగ్రెసు వారిని తన పార్టీలోకి రమ్మనమని ప్రోత్సహించలేదు. ఎవరైనా ఫిరాయిద్దామనుకుంటే తమ పదవికి రాజీనామా చేసి రావాలని షరతు పెట్టారు. ఆ దెబ్బకు యిద్దరు ఎమ్మెల్యేలు వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. పోతే పోనీ అనుకున్నాడాయన. కానీ యిప్పుడున్న టిడిపి, ఎన్టీయార్‌ నాటి తెలుగుదేశం కాదు. అసలు చంద్రబాబే పెద్ద ఫిరాయింపుదారు. సొంత పార్టీ ఓడిపోగానే, దాన్ని ఎడంకాలితో తన్నేసి, గెలిచిన పార్టీలో చేరిపోయాడు. ఆ తర్వాత ఆ పార్టీ నాయకుణ్నే దించేసి, తరిమేశాడు. అందువలన ఆయనకు ఫిరాయింపుదారుల మనస్తత్వం బాగా తెలుసు. వారితో ఏ భాషలో మాట్లాడాలో ఆ భాషలో మాట్లాడగలరు.

ఇప్పుడు ఎస్పీవై రెడ్డిగారు ఫిరాయించారు. అధికారపార్టీలో వుంటే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయవచ్చని సంజాయిషీ యిచ్చారు. ఈయన మొన్నటిదాకా అధికారపార్టీ ఎంపీగానే వెలగబెట్టారు. ఏం అభివృద్ధి చేశారు? తన ప్రాంత ప్రజల అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్రాన్ని చీలుస్తూంటే నోరెత్తారా?   బాబు పరిపాలన ప్రారంభమై అయిదారు నెలల తర్వాత, 'అబ్బో, యిదేదో బ్రహ్మాండంగా వుంది. దీనిలో నాకు భాగస్వామ్యం వుండితీరాలనుకున్నాను' అని చెప్పి మారి వుంటే అదో దారి. ఇంకా ప్రభుత్వం కుదురుకోలేదు, అప్పుడే డిఫెక్షన్లు. ఇక కర్నూలు ఎంపీ రేణుక, అటూ యిటూ వూగి, చివరకు 'వైకాపా ఎంపీనే కానీ టిడిపి అనుబంధ సభ్యురాలిని' అంది. అరకు ఎంపీ గీత కూడా యిప్పుడో, కాస్సేపటికో మారవచ్చట. సిఎం రమేష్‌, సుజనా చౌదరి యీ చేపలు పట్టే పనిలో వున్నారట. ఇంకా ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు గాలానికి చిక్కుతారో తెలియదు.  టిడిపి సిద్ధాంతాలు నచ్చాయి కాబట్టి చేరుతున్నాం అని మారేవారెవరూ అనలేరు. వీళ్లంతా ఎన్నికల్లో టిడిపిని తూర్పారబట్టి, వాళ్ల కాండిడేట్‌ని ఓడించి పదవి చేపట్టినవారే. గత 10 రోజుల్లో టిడిపి కొత్త సిద్ధాంతాలు ఏవీ రూపొందించలేదు. మరెందుకు మారుతున్నారు? అని ఆలోచిస్తే సులభంగా వచ్చే సమాధానం – సులభార్జన కోసం అని. మేసేందుకు వీలున్న పార్టీ కోసం అన్వేషించి దానిలో చేరుతున్నారనుకోవాలి. ఇలాటివారు బాబు ప్రామిస్‌ చేసిన అవినీతిరహిత పాలనను అందించడంలో సహకరిస్తారా అనేది మొదటగా వచ్చే ప్రశ్న. సహకరించకపోతే యీ ఫిరాయింపులు బాబుకి తలనొప్పి తెచ్చిపెట్టవా అనేది రెండో ప్రశ్న. వీళ్లంతా సచ్ఛీలురు అని టిడిపి యివాళ అనలేదు కదా. పక్షం రోజుల కిందట దాకా వీళ్లంత దుర్మార్గులు లేరు, ఓట్లు వేయకండని లక్షలాది మంది ప్రజలకు చెప్తూ వచ్చారు కదా. గడపలో అడుగుపెట్టిన నాడే తెలిసింది, కాపురం చేసే తీరు అని సామెత. ప్రభుత్వం ఏర్పాటు కాకుండానే యిటువంటి ఆశపోతుల డిఫెక్షన్లు ప్రోత్సహించడం ద్వారా టిడిపి ఏ సంకేతం యిద్దామనుకుంటోంది? 

ఈ ఫిరాయింపులను వైకాపా ఖండిస్తోంది. కానీ మొన్నటిదాకా వాళ్లు చేసినదీ యిలాటి పనులే కదా. కాంగ్రెసు నుండి బయటకు వచ్చాక జగన్‌, గతంలో ఎన్టీయార్‌లా యువతను ప్రోత్సహించి, సమాజంలో రాజకీయాల్లో నిర్లక్ష్యం చేయబడిన వర్గాలను చేరదీసి, నేతలను తయారుచేసుకుని వుంటే బాగుండేది. దానికి బదులు అడ్డదారి తొక్కారు. కాంగ్రెసు నుండి ఎమ్మెల్యేలను ఎగరేసుకుని పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్లు కొంతసేపు జగన్‌ వద్ద, మరికొంతసేపు కిరణ్‌ వద్ద దోబూచులాడారు. వీళ్ల అండ చూసుకుని కాంగ్రెసు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాను వేసేదాకా వెళ్లారు జగన్‌. చివరకు అది ఫలించలేదు. కానీ డిఫెక్టర్లనే నమ్ముకునే కదా రాజకీయాలు చేసినది! రోశయ్య సిఎం అయినపుడు, కిరణ్‌ సిఎం అయినపుడు యీ డిఫెక్టర్లనే కదా ఉసి కొల్పి – 'మేం రోశయ్యను గుర్తించం, సెక్రటేరియట్‌కు రాం, పనులు చేయం, యింటి దగ్గరే కూర్చుని జీతభత్యాలు మాత్రం పుచ్చుకుంటాం…' అంటూ వేషాలు వేయించారు కదా. (ఇప్పుడు జనమే వాళ్లను యింట్లో కూర్చోబెట్టేశారు). 'నీవు నేర్పిన పాఠమే నీరజాక్ష' అన్నట్టు, యిప్పుడు ఎదుటివాళ్లు ఆ డిఫెక్షన్‌ పాఠమే జగన్‌కు అప్పచెపుతున్నారు. అతని చేదుమాత్ర అతనిచేతే మింగిస్తున్నారు. రేణుక అనుబంధ సభ్యత్వం గురించి కళ్లెగరేసేవారు మొన్నటిదాకా సబ్బం హరి చేసినదేమిటో గమనించాలి. ఆయన కాంగ్రెసులోనే వున్నాడు, కానీ జగన్‌ పలుకు పలికాడు. మేకపాటి నిజాయితీగా రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. కానీ హరి!? ఈ ఫిరాయింపులు తనకు అనుకూలంగా వున్నంతకాలం వైకాపా వాటిని మెచ్చుకుంది. ఇప్పుడు అవే తనకు దెబ్బ కొడుతున్నాయి. 'కత్తితో వ్యవహరించువాడు కత్తితోనే మరణించును' అనే అర్థంలో బైబిల్‌ వాక్యం వుంది. డేంజరస్‌ గేమ్‌ అంటూ మొదలుపెట్టాక అది ఎటు తిరుగుతుందో ఎవరికీ తెలియదు.

ఇదే నీతి టిడిపికి కూడా వర్తిస్తుంది. కాంగ్రెసు నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి యీ ఎన్నికలలో ఆయన మిశ్రమ ఫలితాలు పొందారు. అది విజయవంతమైన స్ట్రాటజీ అనడానికి లేదు. ఎన్నికల తర్వాత ఆ స్ట్రాటజీని యింకా విగరస్‌గా అమలు చేయడం దేనికి? వీళ్లు రావడం వలన సంఖ్యాబలం పెరగవచ్చు, కానీ వీళ్ల చేతిలో ఎన్నికలలో చావుదెబ్బ తిన్న స్థానిక టిడిపి నాయకుడు ఎలా ఫీలవుతాడు? గెలిచి, తన పార్టీకి వచ్చి తనపై పెత్తనం చెలాయిస్తే, పార్టీ హై కమాండ్‌లో అతని మాటే చెల్లుబాటయితే బాధపడడా? టిడిపిలో కార్పోరేట్‌ కల్చర్‌ వచ్చేసింది. సిఎం రమేష్‌, సుజనా చౌదరి వంటివారు గ్రాస్‌ రూట్స్‌నుండి వచ్చినవారు కారు. డబ్బుతో ఎవరినైనా, ఏదైనా సాధించవచ్చనే నమ్మకంతో వ్యవహరిస్తూ క్యాడర్‌ స్థయిర్యాన్ని దెబ్బ తీయగలరు, మనోభావాలను గాయపరచగలరు. జగన్‌ను దెబ్బ తీయాలనే ఆతృతతో, వీళ్లు తమ పార్టీనే బలహీనపరుచుకుంటున్నారని తోస్తోంది. 1978 ఎసెంబ్లీ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెసు 175 సీట్లు గెలుచుకుని చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జనతా పార్టీకి 60 సీట్లు వచ్చాయి, వెంగళరావు నాయకుడిగా వున్న రెడ్డి కాంగ్రెసుకు 30 సీట్లు వచ్చాయి. అయితే ఇందిరా కాంగ్రెసు ఆశకు పోయింది. రెడ్డి కాంగ్రెసును, జనతా పార్టీని తమలో కలిపేసుకోసాగింది. చివరకు రెడ్డి కాంగ్రెసు కనుమరుగైంది. జనతా పార్టీలో ఒకరో యిద్దరో మిగిలినట్లున్నారు. ఈ డిఫెక్షన్ల వలన ఇందిరా కాంగ్రెసు బలపడిందా? లేదు, అంతకలహాలతో బలహీనపడింది. 1978-83 మధ్య నలుగురు ముఖ్యమంత్రులు మారారు. చివరకు 1983లో తెలుగుదేశానికి అధికారం అప్పగించారు. చరిత్ర చెప్పే పాఠాలు యివి. విని నేర్చుకునేవారే కనబడటం లేదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)

[email protected]