డ‌బ్బులిస్తే…ఆమెపై కేసు వెన‌క్కి తీసుకుంటా

తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ప్ర‌త్య‌ర్థులు క‌ళ్ల‌న్నీ ఆమెపై ఉన్నాయి. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా ఆమెపై ట్రోలింగ్ చేయ‌డానికి ప్ర‌త్య‌ర్థులు కాచుక్కూచున్నారు.…

తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ప్ర‌త్య‌ర్థులు క‌ళ్ల‌న్నీ ఆమెపై ఉన్నాయి. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా ఆమెపై ట్రోలింగ్ చేయ‌డానికి ప్ర‌త్య‌ర్థులు కాచుక్కూచున్నారు. ఈ నేప‌థ్యంలో చెక్‌బౌన్స్ కేసులో అనిత విశాఖ‌ప‌ట్నం జిల్లా కోర్టుకు హాజ‌రు కావ‌డంపై వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు పెద్ద ఎత్తున సెటైర్స్ విసురుతున్నారు.

కోర్టు ద‌గ్గ‌ర ఆమె న్యాయ‌మూర్తి పిలుపుకోసం ఎదురు చూడ‌డానికి సంబంధించిన వీడియోల‌తో పాటు ఆమె నిరాశ‌తో ఉన్న ఫొటోలు వైసీపీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రూ.70 ల‌క్ష‌లు ఎగ్గొడితే అనిత కోర్టుకు హాజ‌రు కావ‌ద్దా? అంటూ వ్యంగ్యంగా ప్ర‌శ్నిస్తున్నారు. అనితను కోర్టుకు లాగిన వేగి శ్రీ‌నివాసరావు మీడియాతో మాట్లాడారు. 2015లో త‌న వ‌ద్ద తెలుగు మ‌హిళా రాష్ట్ర నాయ‌కురాలు అనిత రూ.70 ల‌క్ష‌లు అప్పు తీసుకున్నార‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి అనిత 2018లో చెక్ ఇచ్చార‌న్నారు.

చెక్ బౌన్స్ కావడంతో 2019లో కోర్టులో కేసు వేసిన‌ట్టు శ్రీ‌నివాస్ చెప్పారు. తనలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పారు. టీడీపీలో కీల‌క పోస్టులో ఉన్న అనిత ఇలా చేయ‌డం సంస్కారం కాద‌న్నారు. ఇప్పటికైనా అనిత తన డబ్బులు ఇస్తే కోర్టులో ఉన్న కేసు విత్‌డ్రా చేసుకుంటానని ఆయ‌న చెప్పారు. 

ఈ ప్ర‌తిపాద‌న‌పై అనిత ఎలా స్పందిస్తుందో మ‌రి. ఇదిలా వుండ‌గా అనిత‌ను వైసీపీ సోష‌ల్ మీడియా ట్రోల్ చేయ‌డంపై టీడీపీ దీటుగా స్పందించింది. మ‌రి జ‌గ‌న్ అన్న 16 నెల‌ల జైలు మాటేంట‌ని టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నారు.