ఏపీలో రాజకీయం చిత్రంగా ఉంటుంది. అందునా టీడీపీ రాజకీయం బహు చిత్రం. ఆ పార్టీ ఎపుడెవరితో దోస్తీ చేస్తుందో అధినాయకత్వానికి తప్ప ఎవరికీ అర్ధం కాదు. ఇక నాయకులు అయితే కొన్నిసార్లు తమ లైన్ లో తాము మాట్లాడేస్తూంటారు.
అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా లేటెస్ట్ గా మాట్లాడారు. ఆయన మాటలలో కొత్త విషయంగా పాత విషయం ఒకటి చెప్పుకొచ్చారు. అదే బీజేపీతో విడాకుల విషయం. బీజేపీ నాలుగేళ్ల పాటు ఏపీకి ఎంతో మేలు చేసిందని నాడు పొత్తు ఉన్నపుడు టీడీపీ తమ్ముళ్ళు చెప్పుకున్నారు. అయితే ఇన్నాళ్ళకు అశోక్ గజపతి రాజు ఒక మాట అన్నారు.
అదేంటి అంటే బీజేపీ కేంద్రం నుంచి ఏ రకమైన సహాయం చేయకపోవడం వల్లనే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాను అని. నిజంగా ఇది ఆయన నిజాయతీగా చెప్పిన మాటగానే తీసుకోవాలి. అదే టైమ్ లో కేంద్రంలోని బీజేపీ ఏపీకి ఈ రోజుకీ చాలా విషయాల్లో అన్యాయం చేస్తూ వస్తోంది.
మరి అధికారంలో ఉన్నపుడూ విపక్షంలో ఉన్నప్పుడూ తాము ఒకేలా ఉంటామని చెబుతున్న అశోక్ ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదు అన్నదే ఇక్కడ ప్రశ్న. అదే టైమ్ లో నాడు బీజేపీ మీద కోపంతో ఏపీ మీద ప్రేమతో పొత్తు బంధం తెంచుకున్నామని చెబుతున్న అశోక్ తమ పార్టీ రేపటి ఎన్నికల్లో బీజేపీతో ఏ రకమైన పొత్తు పెట్టుకోదు అని చెప్పగలరా అన్న ప్రశ్నకు ఎలా జవాబు చెబుతారో చూడాలి.
ఇక గత మూడేళ్ళుగా కేంద్రంలోని బీజేపీ మీద టీడీపీ ఏ రకమైన యుద్ధం చేసిందో కూడా చెప్పాల్సి ఉంది. అంతే కాదు, వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ఒక వైపు టీడీపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది అన్న ప్రచారం సాగుతున్న వేళ కోపమంతా వైసీపీ మీద మాత్రమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
మొత్తానికి అశోక్ చెప్పిన మాటలో సత్యం ఉంది. బీజేపీ ఏపీకి నాడూ ఏపీ చేయలేదు, ఈనాడూ ఏమీ చేయలేదు. అయితే నాడు బీజేపీని తెగనాడిన తమ్ముళ్లకు నేడు మాత్రం మాటలే కరవు అవడమే రాజకీయ చిత్రం అంటున్నారు.