ఎమ్బీయస్‌ : ఎన్నికల ఫలితాలు – 3

గమనిక – ఎన్నికల ఫలితాలు – 2లో కాంగ్రెసు ఓట్ల శాతం రాసినపుడు సున్నాలు ఎక్కువ పడ్డాయి. వారికి ఉత్తరాంధ్రలో వచ్చినవి 5%, సరాసరి 3%. క్షంతవ్యుణ్ని. Advertisement ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్‌…

గమనిక – ఎన్నికల ఫలితాలు – 2లో కాంగ్రెసు ఓట్ల శాతం రాసినపుడు సున్నాలు ఎక్కువ పడ్డాయి. వారికి ఉత్తరాంధ్రలో వచ్చినవి 5%, సరాసరి 3%. క్షంతవ్యుణ్ని.

ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్‌ జిల్లాలు)లో 34 సీట్లుంటే టిడిపికి ఓట్లలో 45%, సీట్లలో 71% వచ్చాయి. వైకాపాకు ఓట్లలో 41%, సీట్లలో 26% మాత్రమే దక్కాయి. కోస్తా (ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు)లో 67 సీట్లుంటే టిడిపికి ఓట్లలో 45%, సీట్లలో 71% రాగా, వైకాపాకు ఓట్లలో 43% వచ్చినా 22 సీట్లు మాత్రమే వచ్చాయి. తీరప్రాంతాలైన ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 22 సీట్లుంటే టిడిపికి 44% ఓట్లు వచ్చిన సీట్లలో 36% మాత్రమే వచ్చాయి. వైకాపాకు 48% ఓట్లు వచ్చినా సీట్లలో 59% వచ్చాయి. రాయలసీమ (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు)లో 52   సీట్లుంటే టిడిపికి 44% ఓట్లు, 42% సీట్లు వచ్చాయి, వైకాపాకు 47% ఓట్లు, 58% సీట్లు వచ్చాయి. అంటే ఓట్లు-సీట్లు కన్వర్షన్‌ విషయంలో వైకాపాకు తీరప్రాంతపు జిల్లాలు, రాయలసీమలో అడ్వాంటేజి వచ్చింది కానీ అక్కడున్న సీట్లు 74 మాత్రమే. 101 సీట్లున్న ఉత్తరాంధ్ర, కోస్తాలలో ఆ అడ్వాంటేజి టిడిపికి వచ్చింది. రావడం కూడా భారీగా వచ్చింది. 45% ఓట్లతో 71% సీట్లు గెలుచుకుంది. జగన్‌కు సపోర్టుగా నిలిచిన కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరులో కొంతభాగం రెడ్డి జనాభా ఎక్కువగా కలిగినవే. తక్కిన చోట్ల వారి జనాభా తక్కువ. ఈ పోలరైజేషన్‌ టిడిపికి లాభించింది.  పోలరైజేషన్‌ వలన హోరాహోరీ పోరాటం జరిగిన తక్కువ మార్జిన్‌తోనే గెలిచిన సందర్భాలున్నాయి. 19 నియోజకవర్గాలలో 2 వేల మెజారిటీతో గెలుపు లభించిన వారిలో 13 మంది వైకాపావారు, 6గురు టిడిపివారు. వైకాపా గెలిచిన 67 నియోజకవర్గాల్లో దానికి 49.1% ఓట్లు వస్తే, టిడిపికి 41.3% ఓట్లు వచ్చాయి. టిడిపి-బిజెపి గెలిచిన 106 నియోజకవర్గాల్లో వాటికి 50.42% ఓట్లు వస్తే వైకాపాకు 41.79% వచ్చాయి. 

కులపరంగా ఓటింగు అనేది ఉత్తరభారతంలో జరిగినంతగా మన దగ్గర జరగదు. కానీ ఒక్కోప్పుడు దాన్ని రెచ్చగొడుతూ వుంటారు. ప్రతీ ప్రాంతంలోనూ అన్ని కులాల వారూ వుంటారు. కులాలకు అతీతంగా రాజకీయభావాలతో ఓట్లు వేస్తారు. అందువలన దీన్ని 'బ్రాడ్లీ స్పీకింగ్‌..' ధోరణిలోనే తీసుకోవాలి. ఇక వైకాపా విషయానికి వస్తే – నెగ్గినచోట కూడా బ్రహ్మాండంగా నెగ్గలేదు. ఓడినచోట మరీ దారుణంగా ఓడలేదు. తొలిసారి సాధారణ ఎన్నికలలో పాల్గొన్న పార్టీకి యీ మాత్రం సాధించడం గొప్పేనని – ముఖ్యంగా నాయకుడు 16 నెలలు జైల్లో వున్న తర్వాత – చెప్పి వాళ్లు తప్పించుకోవచ్చు. కానీ ఉపయెన్నికలలో అద్భుతమైన విజయాలను సాధించిన వైకాపా సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి చతికిలబడడానికి కారణాల గురించి వెతికితే ప్రధానంగా కనబడేది – ఆంధ్రులకు సోనియాపై, కెసియార్‌పై విపరీతమైన కోపం వుంది. జగన్‌ వారిద్దరితో కుమ్మక్కయ్యాడని సందేహం వారికి వుందని అర్థమవుతోంది. ఎన్నో ఏళ్ల కాంగ్రెసుకు 3% ఓట్లు వచ్చాయంటేనే తెలుస్తోంది కోపం డిగ్రీ ఎంత వుందో! కిరణ్‌ కుమార్‌ పార్టీ కూడా అంత చేటుగా దెబ్బ తినడానికి కారణం – సోనియా చెప్పినట్లు కిరణ్‌ ఆడాడన్న ప్రతికకక్షుల ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. అందుకే అతనికీ వాత పడింది. రాష్ట్రవిభజనకు సహకరించాలన్న షరతుపైనే జగన్‌కు బెయిల్‌ సోనియా యిప్పించిందని నమ్మిన జనాలు జగన్‌కు వ్యతిరేకమయ్యారు. కాంగ్రెసుకు ఉరిశిక్ష వేసి, జగన్‌కు తక్కువ శిక్షతో పోనిచ్చారు.

అలాగే కెసియార్‌తో ఒప్పందం విషయం కూడా! కెసియార్‌ను జగన్‌ పల్లెత్తు మాట అనకపోవడం, జగన్‌ కెసియార్‌ను అనకపోవడం జనాలలో సందేహం కలిగించింది. పవన్‌ కళ్యాణ్‌ ఆ విషయాన్ని పదేపదే ప్రస్తావించి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. తెలంగాణలో తెరాసకు మెజారిటీ తగ్గితే వైకాపా ఆదుకుంటుందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. బలం లేకపోయినా తెరాస వ్యతిరేక ఓట్లు చీల్చడానికై వైకాపా అనేక చోట్ల అభ్యర్థులను నిలబెట్టిందన్న ప్రచారం కూడా ఆంధ్రులు నమ్మారు. ఎన్నికల తర్వాత కెసియార్‌ 'ఆంధ్రకు జగన్‌ సిఎం' అని చెప్పి, జగన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్న సమయంలో చాలా పేచీలు వస్తాయని, తమ ప్రయోజనాలను కాపాడగలిగిన మొనగాడు తమకుండాలని యిరుప్రాంతాల ప్రజలు గట్టిగా నమ్మారు. ఆంధ్రలో చంద్రబాబు వచ్చే సూచనలు బలంగా కనబడుతున్నాయి కాబట్టి, అతనితో ఢీకొని తెలంగాణకు నష్టం కలగకుండా చూసే సత్తా కెసియార్‌కు మాత్రమే వుందని తెలంగాణ ప్రజలు నమ్మడం చేతనే పార్టీవ్యవస్థ లేనిచోట్ల కూడా తెరాస గెలిచింది. ఉద్యమం కోసం పోరాడిన బిజెపికి కూడా వాళ్లు ఓట్లేయలేదు. కాంగ్రెసులాగే బిజెపికు కూడా రెండు చోట్ల యూనిట్లు వున్నాయి కాబట్టి రాజీ పడతారన్న శంక వుంది. బిజెపికి వచ్చిన సీట్లన్నీ ఆంధ్రమూలాలున్నవారు అధికంగా వున్న ప్రాంతాలవే. ఉద్యమం నడిచిన చోట్ల బిజెపి నెగ్గలేదు. తెలంగాణ ప్రజల్లాగానే ఆంధ్రప్రజలు కూడా తమకోసం తెలంగాణ పాలకులతో పోరాడే ఉద్దేశం, శక్తి బాబుకి మాత్రమే వుందని అనుకున్నారు. జగనైతే కెసియార్‌తో రాజీ పడి, తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తాడని సందేహించారు. బాబుకి గాని, జగన్‌కు గాని, అనేకమంది ఆంధ్రనాయకులకు గాని హైదరాబాదులో అనేక ఆస్తులున్నాయి. వాటిని రక్షించుకోవాలంటే కెసియార్‌తో సఖ్యంగా వుండాలి. అందుకే కెసియార్‌ నెగ్గగానే సినీప్రముఖులంతా క్యూలు కట్టి దణ్ణాలు పెట్టి వచ్చారు. ఆ ఆస్తులను కాపాడుకోవడానికి తమ రాష్ట్రానికి రావలసిన న్యాయమైన వాటాలు కూడా అడగరని ఆంధ్రులకు భయం.

జగన్‌ యీ సందేహాలను దూరం చేయలేదు. అసలు అలాటి అవసరమే లేదన్నట్లు ప్రవర్తించారు. వైయస్‌ సంక్షేమపథకాల గురించి చెప్పుకుంటూ జనాల్లో తిరిగితే చాలనుకున్నారు. తన పార్టీలో వున్న మైసూరా రెడ్డి వంటి వారికి వీటిని ఖండించే పని అప్పచెప్పి వుంటే డామేజి కొంతైనా తగ్గేది. కెసియార్‌ను తప్పుపట్టి వుంటే అనుమానాలు తగ్గి వుండేవి. కానీ జగన్‌ రాజకీయాల కంటె కెసియార్‌తో స్నేహధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత యిచ్చినట్టున్నారు. ఇప్పుడు ఉద్యోగుల పంచాయితీయే చూడండి. విభజన చట్టంలో వున్నది కూడా అమలు చేయకూడదని తెలంగాణ ఉద్యోగి సంఘాలు, కెసియార్‌ అంటున్నారు. కెసియార్‌ ఆంధ్ర ఉద్యోగులను సెక్రటేరియట్‌ గేటు దాటనియ్యం అంటున్నారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో యితర రాష్ట్ర వుద్యోగులున్నా ఫర్వాలేదు కానీ ఆంధ్ర ఉద్యోగులు వుంటే కల్తీ అయిపోతుందని ముఖ్యమంత్రి స్థాయికి చేరిన తర్వాత కూడా అంటున్నారు. దాన్ని బాబు ఖండించినంత ధాటీగా జగన్‌ ఖండించటం లేదు చూశారా. హుందాగా ప్రవర్తించాలని కెసియార్‌కు హితవు చెప్తున్నారంతే. ఇలాటి ప్రవర్తనే ప్రజల విశ్వాసం కోల్పోయేట్లు చేసింది.  (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)

[email protected]

Click Here for Part-1

Click Here for Part-2