నేను టిడిపికి ఘనవిజయం దక్కలేదు అని రాస్తే కొందరు నొచ్చుకున్నారు. టిడిపికి వచ్చినవి 58% సీట్లు. పాస్ మార్కు 50% అయినపుడు, ఫస్ట్ క్లాసు రావాలంటే కనీసం 60% రావాలి కదా. వైకాపా కంటె 35 సీట్లు అంటే 20% సీట్లు ఎక్కువ వచ్చాయి కానీ ఓట్ల శాతంలో తేడా చూస్తే 2% మాత్రమే. 2004లో టిడిపి ఓడిపోయినప్పుడు బాబు దగ్గర్నుంచి అందరూ – కాంగ్రెసుకు మాకంటె కేవలం 2% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి అన్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే చెప్పుకుంటున్నారు – మా కంటె కేవలం 6 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని! కేంద్రంలో కాంగ్రెసుపై బిజెపి సాధించిన ఘనవిజయంతో పోలిస్తే టిడిపి విజయం తేలిపోతోంది కదా. కానీ ఏ మాట కా మాట చెప్పాలంటే – ఆంధ్రలో వైకాపా, తెలంగాణలో తెరాస గెలిచి తీరతాయని గత కొన్నేళ్లగా విపరీతంగా ప్రచారం జరుగుతున్నా ఆత్మవిశ్వాసంతో, స్థయిర్యంతో బాబు పోరాడుతూ రావడం వలననే యీ విజయం సాధ్యపడింది. ఫలితాలు రావడానికి ముందే నేను రాశాను – విభజన వలన టిడిపి లాభపడుతోంది అని. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో టిడిపికి వచ్చిన మొత్తం సీట్లు 92, యీ రోడు రెండు రాష్ట్రాలలో కలిపి వాళ్లకు వచ్చినవి 117! 25 పెరగడం అంటే మాటలు కాదు కదా! రెండు రాష్ట్రాలలో బలంగా వున్న పార్టీ అదొక్కటే. కాంగ్రెసుకు ఆంధ్రలో సున్నా, వైకాపాకు తెలంగాణలో కేవలం 3. టిడిపి తెలంగాణలో కాంగ్రెసు తర్వాతి స్థానం. ఆంధ్రలో పాలకపక్షం!
ఆంధ్రరాష్ట్రంలో వచ్చిన ఫలితాలను పరిశీలించినపుడు కొన్ని ధోరణులు స్ఫుటంగా కనబడుతున్నాయి. పోరాటం రెండు పార్టీల మధ్యనే కేంద్రీకృతం అయింది. కాంగ్రెసు, యితర పార్టీలకు కొన్ని సీట్లు వస్తాయని, రెబెల్స్, యిండిపెండెంట్స్ ఓట్లు చీల్చి, ఎన్నికల చిత్రాన్ని గందరగోళ పరుస్తారని నేను అనుకుంటూ వచ్చాను. అందువలననే స్పష్టమైన ఫలితాలు రావని, ఏ పార్టీకీ వాళ్లనుకుంటున్న 130లు, 140లు రావని చెప్తూ వచ్చాను. అయితే కాంగ్రెసు, కానీ యితర పార్టీలు కానీ సోదిలోకి లేకుండా పోయాయి. ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కాంగ్రెసుకు 20% ఓటు బ్యాంకు వుంటూ వచ్చింది. ఎమర్జన్సీ తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెసు గెలిచింది. కానీ యీసారి దేశమంతా కాంగ్రెసు వ్యతిరేక పవనాలు బలంగా వీచి వారి ఓటింగు శాతం 28% నుండి 19.3%కి పడిపోయింది. (బిజెపికి 12% పెరిగింది) కాంగ్రెసుకు కంచుకోట అయిన ఆంధ్రలో నేడు 19.3% కాదు కదా, 3% తెచ్చుకుంది. బొత్స కుటుంబం బలంగా వున్న ఉత్తరాంధ్రలో 5% తెచ్చుకోబట్టి కానీ లేకపోతే ఆ అంకె యింకా పడిపోయి వుండేది. 289 లక్షల ఓట్లలో కేవలం 8 లక్షల ఓట్లు తెచ్చుకుందంటే పరిస్థితి ఎంత ఘోరంగా వుందో చూడండి. బిజెపి 15 రెట్ల స్థానాల్లో పోటీ చేసి దాని కంటె కేవలం 1.70 లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకుందంటే అంతకంటె సిగ్గుచేటు వుందా?
సుమారు డజను మంది కాంగ్రెసు వారికి మాత్రమే 10 వేలకు పైగా వచ్చాయి. 150 మంది కాంగ్రెసు అభ్యర్థులకు డిపాజిట్ పోయింది. వాళ్లకు 5 వేల కంటె తక్కువ ఓట్లు వచ్చాయి. వారిలో చాలామంది 2 వేలు కూడా రాలేదు. 8 నియోజకవర్గాల్లో వెయ్యి కంటె తక్కువ వచ్చాయి. పిరమిడ్ పార్టీ కంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్న మహానుభావులున్నారు. ముఖ్యమంత్రి పదవికై ఆశ పడిన ఆనం రామనారాయణరెడ్డికి 9000 కూడా రాలేదు. పిసిసి అధ్యకక్షుడు రఘువీరారెడ్డికి మూడో స్థానం దక్కింది. గాండ్రించిన కొండ్రు మురళీమోహన్‌కు 5 వేలు కూడా రాలేదు. చివరకి దాకా ఊగుతూనే వున్న సాకె శైలజానాథ్‌కు 2 వేల పైన చిల్లర వచ్చింది. బొత్స ఒక్కరే 42 వేలు తెచ్చుకుని మర్యాద దక్కించుకున్నారు. కొందరు ఎంపీల ఓట్లు చూస్తే అవి పార్లమెంటు సీటుకా, అసెంబ్లీ సీటుకా అన్న సందేహం వచ్చింది. రాష్ట్రం ఏమైనా సరే, సోనియాకు విధేయులమంటూ చెప్పుకున్న పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిశోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి.. ఒకరని ఏముంది, అంధరూ.. మట్టి కరిచారు. కాంగ్రెసుతో పాటు తక్కిన పార్టీలు కూడా పూర్తిగా గుండుసున్న చుట్టేశాయి. కిరణ్ కుమార్‌ను ఎవ్వరూ నమ్మలేదు. ఆయన తమ్ముడు కూడా నెగ్గలేదు. సమైక్యపార్టీ, లోకసత్తా ఒకే స్థాయిలో వున్నాయనుకుంటా.
తక్కిన పార్టీలు తుడిచిపెట్టుకుపోవడంతో ఇక టిడిపి, వైకాపాల మధ్య ముఖాముఖీ యుద్ధం జరిగింది. టిడిపి గెలిచింది. కానీ యీ విజయం అంత సులభంగా దక్కలేదు. బాబు తన స్ట్రాటజీ మార్చుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ పోయారు. మానిఫెస్టో విడుదల చేసిన తర్వాత కూడా కాపు, బిసి డిప్యూటీ సిఎం పదవుల హామీ యిచ్చారు. ప్రతీ ఓటూ ముఖ్యమే అనుకుంటూ పోరాడారు. కాంగ్రెసునుండి ఫిరాయింపులను ప్రోత్సహించారు. బిజెపితో పొత్తు కోసం ఆరాటపడ్డారు. గీచిగీచి బేరాలాడి చివరకు వెంకయ్యనాయుడు సహాయంతో నిలుపుకున్నారు. పవన్ కళ్యాణ్ యింటికి వెళ్లి పిలుచుకుని వచ్చారు. ఆయన స్థాయి నాయకుడికి యిది అవసరమా? ఈ ఫిరాయింపులు పార్టీకి చేటు తేవా? క్యాడర్ నిస్పృహ చెందదా? అనే సందేహాలు పరిశీలకులను బాధించినా, ఆయన అనుకున్నది చేశారు. మనసుకు కష్టం కలిగినా టిడిపి కార్యకర్తలు సర్దిచెప్పుకుని పనిచేసినట్లున్నారు. ఈసారి అధికారంలోకి రాకపోతే జగన్ పవర్లోకి వచ్చి యింకో పదేళ్ల దాకా పాలిస్తాడన్న భయం పట్టుకుందిలాగుంది. కసితో కష్టపడ్డారు. ఎక్కడెక్కడినుండో ఓటర్లను రప్పించి ఓట్లు వేయించారు. ఓటింగు శాతం పెరగడం టిడిపికి లాభించింది.
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏ మేరకు పనిచేసింది? అంటే కాపు కులస్తులు అధికంగా వున్న ప్రాంతాల్లో టిడిపి-బిజెపి బాగా గెలిచింది కాబట్టి ప్రభావం వుందనే అనుకోవాలి. ఆయన రాకపోయినా కాపులు యీసారి టిడిపికి వేసేవారేమో అని కూడా అనుకోవచ్చు. కానీ పవన్ రావడం వలన ఆ ఓట్లు కన్సాలిడేట్ అయి వుండవచ్చు. ఆయన టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వుంటే, లేదా ఒంటరిగా పోటీ చేసి వుంటే కాపు ఓట్లపై ఆయన ప్రభావం గురించి స్పష్టంగా తెలిసేది. పవన్ ప్రభావితం చేయగల యింకో వర్గం యువత – వాళ్లు అన్ని కులాలలో వుంటారు. వారిని ఏ మేరకు చేశారనేది మరి కొన్ని గణాంకాలు వస్తే తెలుస్తుంది. కమ్మ – కాపు కలిశారన్న సమీకరణంతో చూడడం ఏ మేరకు కరక్టో నాకూ తెలియదు కానీ ఫలితాలను ప్రాంతాల వారీగా విడగొట్టి చూస్తే ఒక ట్రెండ్ కనబడుతోంది. దాని ప్రకారం యీ కులాలు ఎక్కువగా వున్నచోట టిడిపి బాగా గెలిచింది. 'ఉమ్మడి రాష్ట్రంలో రెడ్ల ప్రాబల్యం వుంటూ వచ్చింది, రాష్ట్ర విభజన జరిగాక కూడా యింకా వారేనా? మరొకరికి ఛాన్సు యిద్దాం.' అన్న భావనతో ఆ ప్రాంతాల్లో వైకాపాకు వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు తోస్తోంది. వైయస్ అనంతరం రోశయ్య సిఎం అయ్యారు. వైశ్యులకు అలాటి ఛాన్సు రావడం అరుదు. జగన్ తిరుగుబాటు చేయడంతో అతన్ని కట్టడి చేయడానికి రోశయ్యను అధిష్టానం తీసేసింది. ఆ చర్య వైశ్యులను బాధించి వుంటుంది. వైకాపాకు వ్యతిరేకం చేసి వుంటుంది. ఇలా అనేక వర్గాలు ఏకమై వైకాపా ఉధృతిని కట్టడి చేసి వుంటాయి. లేకపోతే ఉపయెన్నికలలో ఘనవిజయం సాధించిన వైకాపా, మొన్నటిదాకా జాతీయ మీడియా సర్వేలన్నీ తప్పక గెలుస్తాడని ఘోషిస్తూ వచ్చిన వైకాపా యింత వెనకబడిపోదు. ఇలా వెనకబడడానికి కారణం – అది కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బ తినడమే. కాస్త వివరంగా అంకెలతో సహా చెప్తాను. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)