అభివృద్ధి చెందిన చొటా..అభివృద్ది కావాల్సిన చోటా?
నలుగురు ఎక్కడ వుంటే, అక్కడే నగరం తయారవుతుంది. నగరం అంటూ వుంటే దారులూ వుంటాయి..రాదారులూ వస్తాయి. రాజధాని ఏర్పాటు విషయంలో పాలకుల దృష్టి ఈ విధంగా యోచించాలి కానీ, నగరాల వెంట వెర్రి పరుగులు తీయడం కాదు. మొన్నటి దాకా విభజన సమస్య. నిన్నంటి దాకా ఎన్నికల తలకాయనొప్పి, ఇప్పుడు తాజాగా రాజధాని రగడ. చిత్రంగా రాజధాని ఎంపిక అన్నది జటిలం అవుతుందనుకున్నారంతా. కానీ చంద్రబాబు ఎన్నిక ఆ సమస్య లేకుండా చేసింది. లేకుంటే సీమ సింహాలు, కోస్తా చిరుతలు రాజధాని మాకంటే, మాకు అని నానా యాగీ చేసేవి. తమకు గిట్టని వారికి అధికారం వస్తే అస్సలు సహించలేని మీడియా మెగళ్లు, వీధిలో ఒక్క ఓటు కూడా తెచ్చుకోలేని వాడు, తమకు నచ్చని వాడిపై స్టేట్‌మెంట్ పడేస్తే చాలు, కళ్ల కద్దుకుని ముందు పేజీలో దడిగట్టి మరీ ప్రచురించేసేవి. ఎ
టోచ్చీ ఇప్పుడు బాబుకు అధికారం అందింది. ఇక్కడ రెండు సంగతులన్నాయి. ఒకటి అతగాడికి ఎటువంటి సమస్యలు రాకూడదు. రెండు అతగాడి అభీష్టమే నెరవేరాలి. అందువల్ల చోటా మోటా నోళ్లు ఇక వినపడవు. వినిపించినా ‘మన’ పత్రికల్లో కనపడవు. రెండవది బడా నాయకులు అయిదేళ్ల పాటు రాజకీయ పైరవీలు సాగించుకోవాలి. అందువల్ల బాబుకు వ్యతిరేకంగా మాట్లాడనే మాట్లాడరు. ఇంకేముంది..డాక్టరు పాలే తాగమన్నాడు..రోగి పాలే కావాలన్నాడు అన్న చందమైంది. బాబుకు ఇష్టమైన చోట రాజధాని ఏర్పాటుకు మార్గం చకచకా సిద్ధమైపోతోంది. మంచిది. రాష్టం విడిపోయిన తరవాత ఎక్కడో అక్కడ రాజధాని అంటూ ఏర్పాటు చేసుకోవాలి తప్పదు కదా.
అందుకు కేంద్రం ఓ కమిటీని వేసింది. అధికారుల కమిటీ. సాధారణంగా ఈ కమిటీ ముందుగా చూసేది. స్థలం ఎంత అందుబాటులో వుంటుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏ మేరకు కనెక్ట్ అయి వుంటుంది. రోడ్డు, రైలు, విమాన సదుపాయాలు వున్నాయా లేవా? ఇవీ చూసేది. వీటిని ఎవరూ కాదనరు. వాటి అవసరాలను కూడా కాదనరు. కానీ ఇక్కడ తార్కిక దృష్టి, వనరుల విలువ, వాటి వినియోగం వంటి విషయాలను కూడా దృష్టిలో వుంచుకోవాలి. ఎంతసేపూ విమానాశ్రయం వుందా లేదా, దగ్గరలో రెడీగా వుంటే దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలమా లేదా అన్నదే తపన. ఎందుకంటే ఈ బడా బాబులంతా ఆకాశంలో తప్ప నేలపై విహరించరు కదా.
సరే ఆ సంగతి అలా వుంచితే, రాజధానికి అన్నది అన్ని జిల్లాలకు అనుసంధానంగా వుండాలి అనడంలో సందేహం లేదు. కానీ అన్ని విదాలా అభివృద్ధి అయిన ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్నదే, ప్రశ్నించడానికి వీలుగా వుంది. అసలు రాజధాని అన్నది ఎక్కడ నిర్మిస్తే అక్కడ అభివృద్ధి అన్నది ఆటోమెటిక్‌గా జరిగిపోతుందన్నది వాస్తవం. ఒకసారి రాజధాని అంటూ అడవిలోనైనా ఏర్పాటు కావాలే కానీ దాని చుట్టూ వంద కిలోమీటర్ల పరిథిలో అభివృధ్ధి పరుగులు తీస్తుంది. ఎందుకంటే అక్కడ సమారు ముఫై వేలకు పైగా ఉద్యోగులు ఉండాల్సి వస్తుంది. ముఫై వేల కుటుంబాలు ఓ చోట వుంటే, ఇంక ప్రగతి పరుగులు తీయడానికే ముంది. వారికి కావాల్సిన సదుపాయాలతోనే అది సరిపోతుంది. అందువల్ల అన్ని విధాల అభివృద్ది చెందిన ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం అన్న పాయింట్ అసంబద్ధమైనది.
ఇక రెండవ విషయం. అవసరమైనంత స్థలం వుంటుందా వుండదా అన్నది. ఇది చాలా కీలకమైన సంగతే. అయితే ఈ స్థలం ఎలాంటిదై వుండాలన్న నియమం ఏమన్నా వుందా..కొండలు గుట్టలు అయితే కష్టం. నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అందువల్ల వీలయినంత వరకు ప్లెయిన్ లాండ్స్ వుంటే చాలు. కానీ ఇప్పుడు అధికారులు, నాయకులు ఎంత సేపూ విజయవాడ, గుంటూరు, విశాఖ లాంటి పెద్ద నగరాల పేర్లు వల్లే వేస్తున్నారు. విశాఖ సంగతి పక్కన పెట్టండి. అక్కడ దాదాపు అన్నీ వర్షాధార భూములు. పైగా మూడు వంతుల భూములు రియల్ ఎస్టేట్లుగా మారిపోయాయి. కానీ కృష్ట, గుంటూరు జిల్లాల భూమలు అలాంటివి కావు. అత్యంత సారవంతమైనవి. పొగాడు, మిర్చి, పసుపు వంటి మాంచి విలువైన పంటలు పండే భూములు. ఇప్పటికే గుంటూరు కేపిటల్ అవుతుందని తెలిసి, కాడి వదిలేసి, భూములు రియల్ ఎస్టేట్‌కు ధఖలు పరిచినవారెందరో,.
ఇప్పుడు రాజధానికిగా గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేస్తే జరిగేదేమిటి? సారవంతమైన భూములన్నీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుగా మారిపోతాయి,. పంటల ఉత్పత్తి పడిపోతుంది. రైతులకు డబ్బులు తాత్కాలికంగా వస్తే రావచ్చు, కానీ ఆ తరువాత పరిస్థితి ఏమిటి? వ్యవసాయం లేకపోతే రైతు కూలీల పరిస్థితి ఏమిటి?
కానీ తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిని పట్టించుకునేలా లేదు. ఎంతసేపూ తమకు ఇష్టమైన విజయవాడ-గుంటూరుల నడుమే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తొంది. దీనివల్ల ఇప్పటికే అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఆ ప్రాంతం మరింత అభివృద్ది చెందవచ్చు. కానీ అలా అభివృద్ధి చెందే అవకాశం మరో ప్రాంతానికి లేకుండా పోతుంది. అదే సమయంలో ఇక్కడ వ్యవసాయం అడుగంటుతుంది. అయితే ఈ పరిస్థితి చంద్రబాబుకు తెలియకపోవడం లేదని, కృష్ణా జలాలు ఇప్పటికే రాను రాను తగ్గిపోతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి సరిపడా నీరు రావడం లేదు. పైగా ఇప్పుడు తెలంగాణతో పంపకాలు తప్పవు. అప్పుడు ఈ భూములన్నీ వ్యవసాయానికి ఇబ్బందులు ఎదుర్కోంటాయి. అందుకే ముందు జాగ్రత్తగా వాటిని రియల్ ఎస్టేట్ వైపు తరలించేందుకే ఈ ప్రయత్నం అనీ తెలుస్తోంది.
కానీ ఇదే ప్రకాశం-కృష్ణా-గుంటూరు సరిహద్దుల్లోని అభివృద్ది చెందని, నీటి సదుపాయం అంతగా అందని భూములను ఎంపిక చేస్తే, అటు రాయలసీమకు, ఇటు ప్రకాశానికి కూడా మెరుగైన అభివృద్ధి అందుతుంది. రాజధాని అంటూ పెట్టాక, అన్ని వసతులు అవే పరుగెత్తుకు వస్తాయి. కృష్ణ, గుంటూరు ఎలాగూ వాటి అభివృద్ధిని అవి అందుకుంటాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా సంస్థలు విజయవాడలో తమ సీమాంధ్ర హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసుకున్నాయి..చేస్తున్నాయి. వీటిలో పెద్ద మీడియా సంస్థలు కూడా వున్నాయి. అందువల్ల చంద్రబాబు దూర దృష్టితో ఆలోచించి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడం అవసరం.
చాణక్య