ప్రత్యేక హోదా వ్యాసంలో నేను రాసిన 'ప్రపంచంలోని అన్ని దేశాలు మనతో భాగస్వామ్యానికై ఉవ్విళ్లూరుతున్నాయని మనని ఊరిస్తారు. దానికి గాను మనం నోచుకున్న నోములేమిటో నాకు తెలియదు, మన దగ్గర వున్న క్వాలిటీ ఏమిటో తెలియదు.' అనే వాక్యాలకు స్పందిస్తూ ఒక పాఠకుడు నేను నెగటివిటీని వ్యాపింపచేస్తున్నానని ఆరోపించారు. తను అమెరికా వెళ్లానని, అమెరికన్లు చవటలని (ఆయన ఉపయోగించిన పదం – డమ్బ్) చెప్పారు. ఇలాటి విషయాల్లో ఎవరి అనుభవాలు వారివి. అమెరికన్లలో వారు ఎవరిని కలిశారో మనకు తెలియదు కదా. మనవాళ్ల ప్రతిభకు లోటేమీ లేదని, యిలాటి రాతల ద్వారా మన వాళ్లలో నిరాశ నింపుతున్నాననీ అభిప్రాయపడ్డారు. జన్మతః వచ్చిన స్వయంప్రతిభ వున్నా, దాన్ని వెలికి తీసే గురువులు వుండాలి. తీర్చి దిద్దే వాతావరణం స్కూళ్లల్లో, కాలేజీల్లో వుండాలి. ఉన్నాయా? అనే ప్రశ్నకు మనను మనం మభ్యపెట్టుకోకుండా సమాధానం చెప్పుకుంటే చాలు. ఆయన ఉటంకించిన వాక్యం వెనక్కాలే నేను రాశా – 'మన యింజనీరింగు కాలేజీల క్వాలిటీ అతి పూర్ అని మన యూనివర్శిటీలే చెప్తున్నాయి, మన విశ్వవిద్యాలయాల్లో చాలావాటికి వైస్ ఛాన్సలర్లే లేరు' అని. అబద్ధమా?
ముందుగా ఫ్యాకల్టీ సంగతి చూడండి – ఇంజనీరింగు కాలేజీలో ఫ్యాకల్టీ కొరత 30% వుందని అందరూ చెప్పే మాటే. అక్కడ స్టాఫ్‌గా పని చేసే కంటె సాఫ్ట్వేర్ యింజనియర్‌గా చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని ఫస్ట్ గ్రేడ్ వాళ్లందరూ తమ బ్రాంచ్ మారైనా సరే, ఆ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. లెక్చరర్లుగా ఉన్నవాళ్లకు జీతాలు సవ్యంగా యిస్తేనే నిలుస్తారు. కాలేజీ ఫీజుల రీయంబర్స్మెంట్ స్కీము పుణ్యమాని ఉత్తుత్తి స్టూడెంట్లు, ఉత్తుత్తి కాలేజీలు పెరిగిపోయాయి. వీళ్లందరికీ ఫీజు రీయంబర్స్ చేయలేక ప్రభుత్వాలు చేతులెత్తేసి, బకాయిలు పెట్టేస్తున్నాయి. బకాయిలొస్తేనే మీ జీతాలు యిస్తామని కాలేజీలు అంటూండడంతో టీచింగ్ స్టాఫ్‌కు పాఠాలు చెప్పాలన్న ఉత్సాహం చచ్చింది. వారిపై ప్రిన్సిపాల్‌కు అదుపు తప్పింది. అందుకే నాణ్యతా ప్రమాణాలు లేవని అనేక కాలేజీల గుర్తింపు రద్దు చేయడం జరిగింది. కాలేజీలు ఆ మాటను ఖండించలేకపోతున్నాయి. సవరించడానికి కొంత సమయం కావాలంటూ, ప్రభుత్వ కాలేజీల్లోనే లేని సౌకర్యాలు తామెక్కడ తెస్తామని వాదిస్తూ కోర్టు తలుపు తడుతున్నాయి. ప్రమాణాలు లేని కాలేజీల్లో విద్యార్థులు చేరడం మానేశారు కాబట్టి మూతపడుతున్నాయి కూడా. ఇక మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత 40% దరిదాపుల్లో వుంది. ప్రైవేటు ప్రాక్టీసు ద్వారా అపారంగా ఆర్జించే అవకాశం వున్న వైద్యులు టీచింగులో రావడానికి ఉత్సుకత ప్రదర్శించటం లేదు.
ఇదంతా సిబ్బంది గురించి, యిక సౌకర్యాల గురించి, కరికులమ్ గురించి క్లుప్తంగా ముగిస్తాను. నేను చదువుకున్న హైస్కూలు, డిగ్రీ కాలేజీ గవర్నమెంటువే. రెండింటిలో విశాలమైన ఆటస్థలం వుండేది. 9వ తరగతి నుండి మాకు ల్యాబ్ సౌకర్యాలు వుండేవి. వారం వారం ప్రాక్టికల్స్ వుండేవి. నా తర్వాతి తరానికి ఇంటర్లోకి వచ్చినా ల్యాబ్ లేదు. ఒక 15 రోజులు వేరే కాలేజీకి తీసుకెళ్లి అన్ని ఎక్స్పెరిమెంట్స్ వరసపెట్టి ఒకసారి చేసి చూపించేశారు. అలా అయితే సైన్సు తలకెక్కుతుందా? పెద్ద పెద్ద భవంతులున్న జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులకు సైన్సు ప్రయోగాలు స్వయంగా చేసే అవకాశం వుండటం లేదు. ఈ మాట నిజమో కాదో పాఠకులకే తెలుసు. హైస్కూలులో మాకు ఆఖరి పీరియడ్ డ్రిల్ వుండేది. మోరల్ సెషన్ అని వారానికి ఒక పీరియడ్. వారానికి రెండు పీరియడ్లు క్రాఫ్ట్ (ఉడ్‌వర్క్/మెటల్ వర్క్/వీవింగ్), రెండు పీరియడ్లు డ్రాయింగ్. రెండు పీరియడ్లు లైబ్రరీ. స్కూలు పీరియడ్ అయిపోయాక వారానికి రెండు రోజులు ఎన్సిసి లేదా సోషల్ సర్వీసు. వారానికి రెండు రోజులు కో-కరికులర్ యాక్టివిటీ పేర మెటిరియాలజీతో సహా అరడజను హాబీల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. అంతటి సమగ్రమైన విద్యావ్యవస్థ వున్నా మాలో కొంతమందే పైకి వెళ్లగలిగారు. ఇప్పుడు వీటిలో ఎన్ని మిగిల్చారో పాఠకులకే తెలుసు. ఈనాటి విద్యార్థుల్లో చాలామందికి బట్టీ వేయించి పాస్ చేయిస్తున్నారు. సబ్జక్ట్ వంటబట్టటం లేదు. అనేక విషయాలపై అవగాహన కొరవడుతోంది. పుస్తకపఠనం వంటి హాబీలు లేవు. ఆటలు లేవు. క్రికెట్ మ్యాచ్ టీవీలో చూసి క్రీడాభిమానం అంటే యిదే అనుకుంటున్నారు. స్వయంగా ఆడితేనే క్రీడాస్ఫూర్తి వస్తుంది, ఆరోగ్యం ఒనగూడుతుంది.
ఈ రోజుల్లో 400 గజాల స్థలం వుంటే చాలు కాలేజీ పెట్టేస్తున్నారు, ఎకరం వుంటే యూనివర్శిటీయే పెట్టేయవచ్చు. సౌకర్యాలు తర్వాత సమకూరుస్తామని ఒప్పందం చేసుకుని అనుమతి తెచ్చేసుకుని, డొనేషన్లు, ఫీజులు వసూలు చేసేస్తున్నారు. తర్వాత యుజిసి నుంచి టీము వచ్చి గుర్తింపు రద్దు చేస్తామంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందనే సాకు చూపించి కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. ఈ లోగా కొత్త విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇలాటి పరిస్థితుల్లో మనకు చదువులు అబ్బుతున్నాయని, మనం చాలా తెలివితేటలు సంతరించుకుంటున్నామనీ ఎలా నమ్మగలం? పాసయిన వాళ్లలో 30% మందికి కూడా ఉద్యోగార్హత లేదని మన వ్యాపార, పారిశ్రామిక ఫెడరేషన్ ప్రకటిస్తూనే వున్నాయి. అందుకే ఓ పక్క ఖాళీగా వున్న ఉద్యోగాలు, మరో పక్క నిరుద్యోగులు. ఇంజనీరింగు చదివి రిసెప్షనిస్టుగా పనిచేసే వాళ్లు నాకు తెలుసు. నాకు తెలిసున్నవి సాధారణ కాలేజీలు, యూనివర్శిటీలే. ఐఐటిలు, ఐఐఎమ్‌లు చాలా గొప్పవనే అభిప్రాయంలో వుంటూ వచ్చాను. ''ద వీక్'' ఆగస్టు 9 సంచిక చూడండి. ఐఐటిలను యిష్టం వచ్చినట్లు విస్తరించడం వలన దాని బ్రాండ్ వేల్యూ చెడిపోయిందని పెద్ద వ్యాసం రాశారు. అక్కడా ఫ్యాకల్టీ కొరతే. హైదరాబాదు ఐఐటిలో 19% కొరత అంటే అది అతి తక్కువన్నమాట. మండీ, గువాహటీ, మద్రాస్‌లలో 27-29% వుంది. బొంబాయిలో 31%, కాన్పూరులో 38%, భువనేశ్వర్‌లో 42%, రూర్కీ, ఢిల్లీలలో 44%, జోధ్‌పూర్, ఖడ్గపూర్లలో 46%. ఈ ఏడాది ఐఐటిలో ఎడ్మిషన్ వచ్చిన 591 మంది చేరమన్నారట. జెఇఇకి అప్లయి చేసిన వారి సంఖ్య 50 వేలు తగ్గిందట. పరిస్థితి బాగు చేయాలంటే నిధులు కావాలి. కానీ ఈ ఏడాది మన మోదీ సర్కారు బజెట్‌లో ఉన్నత విద్యకు రూ. 800 కోట్ల కోత పెట్టింది. ఐఐటి, ఐఐఎంలు ఎందుకలా వున్నాయో ''ద హిందూ''లో ఆగస్టు 4 న ఒక వ్యాసం వివరించింది.
ఐఐటిలను, బెంగుళూరులో వున్న ఇండియన్ యిన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌ను ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఉతికి ఆరేశారు – స్వాతంత్య్రం వచ్చిన యిన్నాళ్లలో యీ సంస్థలు రిసెర్చి ఏమీ చేయలేదని అన్నారు. టెక్నోక్రాట్ అయి వుండి, యితర టెక్నోక్రాట్లతో కలిసి స్థాపించిన ఇన్ఫోసిస్‌కు ఎన్ని పేటెంట్లు వున్నాయి స్వామీ అని ఆయన్ను ఎవరూ అడగలేదు. అడిగివుంటే ఆయనేం చెప్పేవారో! వాస్తవం ఏమిటంటే వివిధ రంగాల్లో వున్న మన కార్పోరేట్లు టర్నోవర్‌పై పెట్టిన శ్రద్ధ బేసిక్ ఆర్ అండ్ డిపై పెట్టలేదు. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనల స్థితిగతుల గురించి గణాంకాలతో సహా ఈనాడులో ఆగస్టు 8 న ఆర్టికల్ వచ్చింది. చూడండి. 2013లో దాఖలైన పేటెంట్ దరఖాస్తుల సంఖ్య చూడబోతే – మన పాఠకుడు చవటలని తీసిపారేసిన అమెరికానుండి 2.88 లక్షలు, మన మహాన్ భారత్ నుండి 11 వేలు! అమెరికా సబ్మిట్ చేసినవాటిలో మంజూరైనవి 47%, 1.60 లక్షల దరఖాస్తులు పంపిన దక్షిణ కొరియాకు యీ శాతం 60%, 2.72 లక్షల దరఖాస్తులు పంపిన జపాన్కైతే 83%, 7.05 లక్షలు పంపిన చైనాకు 20%, జర్మనీకి 31%, మరి మన ఇండియాకు 6%. అంటే 594 పేటెంట్లు మంజూరయ్యాయి. ఇదీ మన మేధోపటిమ! మనవాళ్లలో కొంతమంది యితరదేశాలకు వెళ్లి రాణించవచ్చు కానీ మనలో అత్యధికులు ప్రతిభాశూన్యులుగా మిగులుతున్నాం. దానికి మన దేశంలో నెలకొన్న పరిస్థితులే కారణం. ఒకలా చెప్పాలంటే అమెరికాలో సరస్వతిని ఆరాధిస్తారు. ఏ దేశస్తుడైనా సరే విద్య వుంటే చాలు, ఆదరిస్తారు. అందుకే అక్కడ లక్ష్మి వుంటుంది. మన దగ్గర లక్ష్మిని ఆరాధిస్తున్నాం. మనవాళ్లలో లక్ష్మి పేర్లు ఎక్కువ, సరస్వతి పేర్లు తక్కువ. చదువుకున్న వాడి ంటె డబ్బున్నవాడికే ఎక్కువ గౌరవం యిస్తున్నాం. చదువును (సరస్వతిని) డబ్బుతో (లక్ష్మితో) కొంటున్నాం. అందుకే సరస్వతి మనను విడిచిపెడుతోంది. పరిశోధనలు, పేటెంట్లు మనకు అందరాని ఫలంగా మారాయి.
విదేశాల్లో మనవాళ్లకు అనేకమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా అంటే అవి సేవారంగంలోనే. కష్టపడే తత్వం, నిజాయితీ, ఇంగ్లీషు తెలిసి వుండడం మనకు తిండి పెడుతున్నాయి. మన సాఫ్ట్వేర్ కంపెనీలు సేవలు అందించి (కొందరు 'బాడీ షాపింగ్' అనేస్తారు) గడిస్తున్నాయి తప్ప పరిశోధనల ద్వారా కాదు. చైనావాళ్లు ఇంగ్లీషులో మనతో పోటీ పడిన రోజున మనకు అవస్థలు తప్పవు. ఆ రోజు వచ్చేలోగా మన విద్యావ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. ఆ వ్యవస్థలో వున్న లోపాలేమిటో విద్యావేత్తలు అనేకమంది చెప్తూ వచ్చారు. అనేక కమిటీ నివేదిక లున్నాయి. వాటిని అమలు చేసే నాధుడే లేడు. అమలు చేయకపోగా 'మనం గొప్పవాళ్లం, మనల్ని చూసి అందరూ మురిసిపోతున్నారు, మనతో జట్టుకట్టడానికి క్యూ కడుతున్నారు' అని చెప్పడం ప్రజల్ని జోకొట్టడమే. బయటివాళ్లు వచ్చేది మన సహజవనరులను దోచుకోవడానికే. దాన్ని నివారించాలంటే మన స్కిల్స్ మనం పెంచుకోవాలి. వ్యక్తిగతంగా, సంస్థాగతంగా నైపుణ్యం సంపాదించినప్పుడు, నూతన ఆవిష్కరణలను సాధించినప్పుడు మాత్రమే మనం కాలరెగరేసుకోవాలి. ఈ విషయం చెప్పడం నెగటివిటీ కాదు. కరకు వాస్తవాలు చెప్పి కళ్లు తెరిపించడం. ఆ పని నాయకులు ఎలాగూ చేయడం లేదు. మనలో మనం అనుకోవడానికి కూడా జంకితే, కళ్లు మూసుకుంటే ఎలా?
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)