బాపు: నేనూ- సంగీతం – 3

మళ్లీ మెహదీ విషయానికి వస్తే పైన చెప్పిన 'అబ్‌కే హం బిఛడే' పాట విని వీణ బాలచందర్‌, మన్నా డే మొదలైన వారు కూడా త్రిల్‌ అయిపోయారట.'78లో మద్రాసు వచ్చినపుడు మెహదీ గారు అడిగిన…

మళ్లీ మెహదీ విషయానికి వస్తే పైన చెప్పిన 'అబ్‌కే హం బిఛడే' పాట విని వీణ బాలచందర్‌, మన్నా డే మొదలైన వారు కూడా త్రిల్‌ అయిపోయారట.'78లో మద్రాసు వచ్చినపుడు మెహదీ గారు అడిగిన కర్నాటక సంగీతం మీద ఓ పెద్ద గ్రంథంతోబాటు వీణ బాలచందర్‌ గారు ఎల్‌.పి.రికార్డ్స్‌లో మేళకర్త రాగాలు ఆరోహణ అవరోహణలు వాయించిన సెట్టు ఇచ్చాను. ఎటొచ్చీ బాలచందర్‌ గారు రికార్డు కవర్లమీదా అట్ట పెట్టి మీదా మార్కింగ్‌ పెన్‌తో 'గాడ్‌ బ్లెస్‌ మెహ్‌ాది ది గ్రేట్‌' అంటూ అడ్డంగా నిలువుగా సంతకాలు పెట్టేశారు.

వీణబాలచందర్‌ గురించి ఓ జోకు – మా స్నేహితుల్లో ఆశ్శెగాడొకడు. ఆయన గురించి ప్రస్తావన వస్తే ''ఎవరూ ఆ వీణా రాక్షసుడా?' అనేవాడు. 

'తప్పు పెద్దలని అలా అనకూడదు, మహా పండితుడు' అని కోప్పడేవాళ్లం. 

వాడు 'తప్పేమన్నాను – వారు వీణ జైంట్‌ కాదా – ఎటొచ్చీ యుద్ధాని కెడుతున్నట్టు వయొలెంట్‌గా బరికేస్తుంటే అలా అనిపించింది' అని పారిపోయాడు.

78లో మద్రాసులో మెహాదీ గారి కచేరీ పెట్టినపుడు ఎకూస్టిక్స్‌ సరిచూసేందుకు యస్‌.పి.బాలు గారు కాస్త ముందుగానే మెహదీని కారులో హాలుకి తీసుకెళ్ళారు. ట్రాఫిక్‌ జంక్షన్‌లో కారాగినపుడల్లా హోటళ్లలో వినిపించే రేడియోలోని ఫోక్‌ సంగీతాన్ని శ్రద్ధగా, మాటలాపి  మరీ వినేవారు మెహదీ.                    

నేను గజల్స్‌్‌ ఎంజాయ్‌ చేయడం గురించి చెప్పాలంటే – 'నాకు తెలుగే సరిగ్గా రాదు సంస్కృతం నిల్లు' అని ''అందాలరాముడు'' లో రాజబాబు అన్నట్టు నాకు ఉర్దూ, హిందీ నిల్లు. ఇది మెహదీ విని 'ఏమిటీ నీకు గజల్స్‌ భాష అర్థం కాదా! కేవలం సంగీతం మాత్రమే ఇంత ఇష్టమా!' అని బోలెడు ఆశ్చర్యపడిపోయారు.

వీలు చూసుకుని 'వాట్‌ ఈజ్‌ యువర్‌ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్‌' అనడిగా. 

'ఫిఫ్టీంత్‌ డిశంబర్‌-ఆప్‌కా?' అనడిగారాయన. 

'ఐయామ్‌ ఆల్‌సో 15 డిశంబర్‌ 1933 సర్‌' అన్నా'. 

ఆయన ''ఐయామ్‌ … తర్టీ ఫోర్‌. ఒన్‌ ఇయర్‌ ఓల్డెర్‌ ద్యాన్‌ యు'' అన్నారు నవ్వుతూ.

ఆయన చోళా హోటల్‌లో దిగారు. హోటల్‌ వారు 'వుయ్‌ ఆర్‌ ప్రౌడ్‌ టు హోస్ట్‌ షాహెన్‌ షా ఆఫ్‌ గజల్‌' అని బయట పేద్ద బేనర్‌ కట్టుకున్నారు. ఆ కచేరీ టైమ్‌లో స్పాన్సర్స్‌ మిస్‌బిహేవ్‌ చేసినందువల్ల ఎయర్‌పోర్ట్‌ కి కారు సౌకర్యం లేకపోయింది. ఆయన్ని నా కారులో దింపే భాగ్యం నాకు కలిగింది. దారిలో పాన్‌ కావాలన్నారు. టి.నగర్‌లో ఓ చిన్న పాన్‌ షాప్‌ దగ్గర ఆపి పాన్‌ తీసుకున్నారు.

అక్కడ నుంచీ హైదరాబాద్‌ వెళ్లారు. మా స్నేహితుడు పోలీసెంకటసామి అనబడే సదాశివరావు పోలీసు హోదాలో విమానం మెట్లదాకా తీసుకెళ్లిపోయాడు. ఆయన దిగ్గానే పలువురితో బాటు నాకూ ఆయనకి పాదాభివందనం చేసే అదృష్టం కలిగింది. కారులో వస్తూ ఆయన చెప్పిన ముచ్చటోటి మిత్రులు అనువదించి చెప్పారు –

ఆయన చిన్నతనంలో వారి తండ్రి ఓ జమీందారు ఆస్థానంలో తోటమాలిగా వుండేవారట. రాజుగారు భోంచేసేటపుడు అన్నంమీద పల్చటి బంగారం – వెండి రేకులు పరిచే వారట. అవి వేడికి కరిగి అన్నంలో కలుస్తాయి. పూర్తిగా కరిగే వరకూ ఓపికలేక – రాజాగారు ఆ మిగిలిన రేకులను వుండలుగా నలిపి కిటికీలోంచి బయటకు విసిరేవారట. చిన్న మెహదీగారు తోటి పసిపిల్లలూ వాటితో గోళీ కాయలు ఆడుకునే వారట.     

ఇది జరిగుండచ్చు-వుండక పోవచ్చు గానీ ఆయన ఊహ ఎంత అందమైనది! ఆయన సంగీతమంటే అదీ! అనుభవించి భావప్రధానంగా పాడతారు. చరణం చరణానికీ పాటల సొగసూ భావమూ చెప్తూ కవిగారి పేరు చెప్పి, ఓహో-ఆహా 'క్యా బాత్‌ హై' అంటూ మురిసిపోయి అప్పుడు పాట అందుకుంటారు.

మెహఫిల్స్‌లో ఆయన చెప్పిన మరో జోకు. పాకిస్తాన్‌లో నూర్జహాన్‌ని అంతా గౌరవంగా మేడమ్‌ అని పిలుస్తారట భర్తతో సహా. ఇక్కడ  నూర్జహాన్‌ గురించి కాస్త చెప్పాలి. ఆవిడే ఒకపుడు (అంటే దేశవిభజన తర్వాత పాకిస్తాన్‌కి వెళ్లిపోకముందు) హిందీ వెండితెరను ఏలిన తార ప్లస్‌ గాయని. 'అన్‌మోల్‌ ఘడీ' గుర్తుందా? లతా మంగేష్కర్‌ అంతటావిడ శ్వాస చప్పుడు లేకుండా మైకు ముందు పాడే పద్ధతి నూర్జహాన్‌ రికార్డులు పదే పదే విని నేర్చుకునేదట -(అన్నట్టు బడే గులాం ఆలీ లతా మంగేష్కర్‌ని 'శ్రుతీకీ (కే?) అవతార్‌' అని మెచ్చుకుంటే లతా- మెహదీ హసన్‌ గొంతుకలో భగవంతుడున్నాడని మెచ్చుకుంది) కొన్నేళ్ల క్రితం నూర్జహాన్‌ లతా కలుసుకుని ఇద్దరూ పాడగా విన్న వాళ్లదే అదృష్టం, పుణ్యం. 

మెహాదీ గారి జోక్‌ ఏవిటంటే నూర్జహాన్‌, తను ఒకప్పుడు గ్లామర్‌ క్వీన్‌ అన్నమాట మరచిపోలేదు. ఆవిడ ఏ ఫంక్షన్‌కి వచ్చినా తన వయసు కిందటి సారి కన్నా తగ్గించి చెప్పేదట ఒక పార్టీలో – తన వయసు 48 అంటే నెక్‌స్ట్‌ ఫంక్షన్‌లో 45కి తగ్గించేసేదట. ఆ తరువాత 40… ఇలా 32కి వచ్చేసరికి ఆమె భర్త ''మేడమ్‌ – ఈ లెక్కన మీరు జన్మస్థలానికి వెళ్లిపోయేట్టున్నారు' అన్నారట!

మెహదీ గారు కచేరీ చేస్తూ -'ఎదురుగా అరేబియన్‌ భాయి వున్నాడు' అంటూ అరబ్‌ పాట అందుకుంటారు. రాజస్థాన్‌ వారిని చూస్తే దోహా అందుకుంటారు. పంజాబీని చూస్తే – పంజాబీ పాట – బంగ్లా ఆయన్ని చూస్తే బెంగాలీ పాటోటి అందుకుంటారు. మన ప్రధాని వాజ్‌పేయి గారి పరిపాలన ఎలావున్నా ఆయన మెహదీ హసన్‌ అభిమాని అవడం చాలా గొప్పవాడే అనిపిస్తుంది.

మెహదీ గారు ఆ మధ్య స్ట్రోక్‌ వచ్చి ఆస్పత్రిలో చేరారని తెలిసి చాలా బాధ కలిగింది. ఆ మధ్య హైదరాబాదులో 'సదా – ఎ – ఇష్క్‌' అనే ఆల్బమ్‌ హరిహరన్‌చే రిలీజ్‌ చేయించారు. ఎంత పేతటిక్‌గా ఉందంటే – సిక్‌ బెడ్‌ వద్దకు మైక్‌ తీసికెళ్లి రికార్డు చేయించారా అనిపించింది.

సంగీత సార్వభౌములు పద్మభూషణ్‌ బడే గులాం ఆలీఖాన్‌, మెహదీ హసన్ల సంగీతం పరిచయం చేసి వాటిలోని సొగసులన్నీ తెలియజెప్పిన మిత్రులు పి.బి. శ్రీనివాస్‌ గారికి, అనేక కేసెట్ల సంగీతం ఇచ్చిన మోహన్‌ హెమ్మాడీ గారికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఈ జన్మంతా చాలదు. గాడ్‌ బ్లెస్‌ దెమ్‌.

నేను ముందు చెప్పిన బడే ఆలీ ప్రయివేట్‌ సంగీతం నా కెవరేనా సంపాదించి పెట్టి పుణ్యం కట్టుకుంటే భగవంతుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు. (సమాప్తం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]