ఎమ్బీయస్‌: ఇదీ ఉపముఖ్యమంత్రి స్థాయి…

తెలంగాణ ఏర్పడితే ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, సామాజిక న్యాయం నెలకొంటాయని కలలు కన్నవారు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వుదంతం  చూశాక నిర్ఘాంతపోతున్నారు. కెసియార్‌ను వెనకేసుకుని వచ్చే మేధావులందరూ సైలంటు అయిపోయారు. ఇక టీవీ చర్చల్లో పాల్గొనే…

తెలంగాణ ఏర్పడితే ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, సామాజిక న్యాయం నెలకొంటాయని కలలు కన్నవారు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వుదంతం  చూశాక నిర్ఘాంతపోతున్నారు. కెసియార్‌ను వెనకేసుకుని వచ్చే మేధావులందరూ సైలంటు అయిపోయారు. ఇక టీవీ చర్చల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 'రాజయ్యకు దండన పడిందని ఎందుకనుకుంటారు? ఆయన సేవలను ఎలా వుపయోగించుకోవాలో మా నాయకుడికి తెలియదా?' అంటూ అస్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాతి రోజుల్లో ఆయనకు పార్టీ అధ్యకక్షుడు కూడా చేస్తే చేయమను. కానీ యీ రోజు మాత్రం రాజయ్యపై సానుభూతి కురుస్తోంది. ఆయన దళితుడు కాకపోయినా యీ స్థాయి జాలి వుండేది. ఎందుకంటే రాజయ్య రాజకీయంగా కెసియార్‌పై కుట్ర పన్నలేదు. ఏనాటికైనా దళితుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడు అని తన ఆశలు హింట్‌ చేస్తూ ప్రసంగాలు చేయలేదు. తనపై కెసియార్‌ తాలూకు పత్రికలో వ్యతిరేక వార్తలు వెలువడినపుడు సంజాయిషీ చెప్పుకుందామంటే అవకాశం యివ్వలేదు. తనపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి నిజనిర్ధారణ చేసుకోమంటే వినలేదు. నేను తప్పు చేసి వుంటే దండించండి అంటూ సిగ్గు విడిచి లేఖ రాసి పట్టుకెళ్లినా కలవలేదు. ఆఫీసులో చప్రాసీని తీసేయాలన్నా షోకాజ్‌ నోటీసు యివ్వాలి. డిప్యూటీ సిఎం స్థాయి వ్యక్తికి ఓ నోటీసు లేదు, సమాచారం లేదు, తీసి పారేశారు. అంటే ఆయన పరిస్థితి ఎంత కనాకష్టంగా వుందో చూడండి. ఇంత ఘోరంగా అవమానింపబడినా రాజయ్య తిరగబడలేదు. కెసియార్‌ ఏసుప్రభువు, నా తండ్రి, హోలీ ఘోస్ట్‌ అంటూ దండకం వల్లించాడు. ఆసుపత్రిలో ఎడ్మిట్‌ కావలసినంత మానసిక క్షోభ అనుభవించాడు. గుండెపోటు వచ్చి వుండదు కానీ సుగర్‌ 400 వరకు షూటప్‌ కావడంలో ఆశ్చర్యం లేదు. డాక్టర్లు వద్దంటున్నా బయటకు వచ్చేశాడు. కెసియార్‌కు చెడ్డపేరు వస్తుందన్న భయం కాబోలు! ఆవేశంలో తీసిపారేసినా రాజయ్య వినయం చూసి, మనసు కరిగి కెసియార్‌ ఆయన్ను పిలిపించి మాట్లాడినా కొంత డామేజి కంట్రోలు అయ్యేది. కెసియార్‌కు ఆ ధ్యాసే లేదు. ఏం చేసినా చెల్లిపోతోందన్న ధీమాలో వున్నారు.

సాధారణంగా ఎవరైనా మంత్రిని తీసేద్దామనుకున్నపుడు ముఖ్యమంత్రి పిలిచి అవసరమైతే కొన్ని ఫైళ్లు అవీ చూపించి, చెమటలు పట్టించి అప్పుడు రాజీనామా యిచ్చి గదిలోంచి వెళ్లిపో అంటారు. ఇవ్వనని మొరాయించిన వాళ్లపై మాత్రమే బర్తరఫ్‌ అస్త్రం ఉపయోగిస్తారు. రాజయ్య తెరాస ఉద్యమంతో మాత్రమే పైకి వచ్చిన నాయకుడు కాడు. ముందే రాజకీయాల్లో వున్నవాడు. ఇప్పుడు తన బదులు తెచ్చిన కడియం శ్రీహరిని ఎన్నికల్లో ఓడించినవాడు. కాస్త మర్యాదగా ట్రీట్‌ చేసి వుంటే బాగుండేది. కానీ కెసియార్‌ చాలా దురుసుగా, అమర్యాదాకరంగా వ్యవహరించారు. ఇంత కాఠిన్యానికి కారణం ఏమిటి? అవినీతి, అలసత్వం రెండిటిలో ఏదో ఒకటి కావాలి. స్వైన్‌ ఫ్లూ పట్ల అలసత్వమే దీనికి కారణం అనుకుంటే మరి వందల రైతుల ఆత్మహత్య చేసుకున్నందుకు వ్యవసాయ శాఖా మంత్రిని, ఫాస్ట్‌ పథకం యిప్పటికీ తేల్చనందుకు విద్యామంత్రిని, విద్యుత్‌ కొరతను పసిగట్టి ముందు జాగ్రత్తగా విద్యుత్‌ ఒప్పందాలు చేసుకోని విద్యుత్‌ మంత్రిని, టైమ్‌టేబుల్‌ ప్రకారం డిసెంబరు కల్లా చెఱువులు ఖాళీ చేయించని జలవనరుల మంత్రిని.. అందర్నీ బర్తరఫ్‌ చేయాలి. చేయలేదు. అంటే మరో కారణం అవినీతి అన్నమాట. అవినీతి ఆరోపణ అంటే సీరియస్సే. ఎన్నో ఆశలు కల్పించి ఏర్పరచిన కొత్త తెలంగాణలో ఆర్నెల్లలోనే అవినీతి బయటపడిందంటే అది నిరాశాజనకమే. పాతప్రభుత్వపు అలవాట్లను అధికారులు మాన్పుకోలేకపోతున్నారు అనుకుందామంటే యిప్పుడు వేటు పడింది మంత్రికి. అవినీతి వలన ప్రభుత్వానికి ఏర్పడిన నష్టాన్ని ఎలా పూడ్చారు? డబ్బు రికవరీ చేశారా? బాధితులకు పరిహారం యిచ్చారా? తెలియదు. ఏదీ బయటకు చెప్పడం లేదు. పారదర్శకత లేకపోతే ఎలా? యువకులు, మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, గాయకులు, కళాకారులు అందరూ యిది తమ ప్రభుత్వం అనుకుంటున్నారు కదా వారితోనైనా యిబ్బందులు పంచుకోకపోతే ఎలా?

రాజయ్య అవినీతిపరుడే అయితే మంత్రి పదవి పీకేయడంతో సరిపెట్టకూడదు. లంచం తీసుకుంటే కుటుంబసభ్యులనైనా జైలుకి పంపుతా అన్న కెసియార్‌ మాట నిలబెట్టుకుని ఆయన్ను జైలుకి పంపాలి. ఎమ్మెల్యేగా తీసేయాలి, పార్టీలోంచి బర్తరఫ్‌ చేయాలి. లేకపోతే అవినీతిని ఓ స్థాయిలో సహిస్తున్నారన్న సంకేతం వెళుతుంది. తనకు కావలసిన వాళ్లను నియమించుకుని రాజయ్య వారి ద్వారా లంచాలు పట్టారని వార్తలు రాయిస్తున్నారు. వాళ్లను నియమించినది రాజయ్య కాదు, కెసియార్‌, కెటియారూ అని బిజెపి నాయకులు పేర్లతో సహా చెప్తున్నారు. రాజయ్య కోరినట్లు విచారణ జరిపిస్తే వివరాలు బయటకు వస్తాయి. అలా రావడం కెసియార్‌కు యిష్టం లేదా? అని అడుగుతున్నారు. ఇలాటి ప్రశ్నలు వస్తాయని ముందే వూహించి కాస్త దస్త్రం తయారు చేయాల్సింది. 'కొత్తగా పెట్టిన అవినీతి ఫిర్యాదు ఫోన్‌ నెంబరుకి రాజయ్య గురించి ఫిర్యాదులు ఎక్కువ వచ్చాయి. జనాలంతా అతను అవినీతిపరుడని నమ్ముతున్నారు అందుకనే చర్య తీసుకున్నా' అని చెప్పాల్సింది.  నిజానికి జనవరి 11 నుంచి పెట్టిన అవినీతి ఆరోపణలకై టోల్‌ఫ్రీ నెంబరుకి 15 రోజుల్లో 29,275 కాల్స్‌ వచ్చాయి. వాటిల్లో 11486 జనరల్‌ ఫిర్యాదు లున్నాయి. అంటే నీళ్లు లేవని, కరంటు లేవని, రోడ్లు లేవని, ఉద్యోగాలు కావాలని, అమ్మాయిలను ఏడిపిస్తున్నారనీ.. యిలా. 1306 ఫిర్యాదులు అవినీతి గురించి వచ్చాయి. ఆ ఆరోపణలు రాజయ్య మీదే అనుకోకండి. ప్రభుత్వాధికారులు, మధ్యవర్తులు, బ్యాంకు అధికారులు, సంక్షేమపథకాల జారీ చేయడానికి సర్పంచ్‌లు – వీళ్లందరిపై కలిపి. వీరిలో సర్టిఫికెట్లకై, రేషన్‌ కార్డులకై లంచాలడిగారని చెప్పి మండల్‌ రెవెన్యూ ఆఫీసర్లపై, సివిల్‌ సప్లయిస్‌ వారిపై ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. వికలాంగుల సర్టిఫికెట్టు యిమ్మనమంటే లంచం అడిగిన వైద్య అధికారులపై కూడా వచ్చాయి. పెన్షన్లు అందలేదని వచ్చిన ఫిర్యాదులు 5906, హౌసింగ్‌ గురించి ఫిర్యాదులు 5906…యిలా వున్నాయి గణాంకాలు.

ఆధారాలు చూపకుండా, కారణాలు చెప్పకుండా తీసేయడం వలన రకరకాల వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. రాజయ్య దళితత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. భట్టి విక్రమార్క మాంచి పొయెటిక్‌గా 'మేకల్ని మాత్రమే బలి యిస్తారు, పులుల్ని యివ్వరు' అన్నారు. దళితులు బలహీనులు కాబట్టి బలి అవుతున్నారన్న భావంలో! గతంలో వరంగల్‌ కాళోజీ యూనివర్శిటీ సందర్భంగా వేదికపై రాజయ్యను అవమానించిన తీరు యిప్పుడు అందరికీ గుర్తు వచ్చి రెండిటిని కలిపి చూస్తున్నారు. దళిత అంశం వస్తుందని తెలిసే కెసియార్‌ కడియం వారిని దింపారు. ఆ గుణకారభాగారాలలో ఎమ్మెల్యేలలో ఎవరూ ఫిట్‌యిన్‌ కాలేదేమో! కడియం ఎస్సీ కాదని టిటిడిపి వారనసాగారు. టిడిపి వారి లెక్కలే వేరు. సి.రామచంద్రయ్యగారు వారి పార్టీలో వున్నంతకాలం బిసి, వేరే పార్టీలోకి మారగానే అగ్రకులస్తుడు. అలాగే కడియం గురించి కూడా చెపుతూండవచ్చు. ఏదైనా వుంటే కోర్టుకి వెళ్లి నిరూపించాలి. 

దళితుల పట్లే కెసియార్‌ యిలా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు కానీ మరి కొన్ని రోజుల్లో ఓసి, బిసిల పట్ల యిలాగే ప్రవర్తించినా ఆశ్చర్యపడనక్కరలేదు. కెసియార్‌లో తొలినాళ్ల ఎన్టీయార్‌ తరహా కనబడుతోంది. ప్రజలు తన వెంట వున్నారు, తనను నమ్ముకుని ఓట్లేశారు, వీళ్లు వుంటే ఎంత, పోతే ఎంత, ఏం చేసినా పడి వుంటారు అనే ఆయన అనుకున్నాడు. అందుకే నాదెండ్ల కుట్ర జరిపినపుడు అనేకమంది ఎమ్మెల్యేలు నాదెండ్లతో చేతులు కలిపారు. కుట్రను కాంగ్రెసు వారు సరిగ్గా హేండిల్‌ చేయకపోవడం వలన, మీడియా, ప్రజలు ఎన్టీయార్‌ వెంట నిలబడి పోరాడడం వలన నాదెండ్ల ఫెయిలయ్యారు. ఆ పొరపాట్లు సరిదిద్దుకుని యింకో పదేళ్లు పోయాక చంద్రబాబు విజయవంతంగా కుట్ర చేయగలిగారు. ఆ కుట్ర సఫలం కావడానికి కారణం ఎన్టీయార్‌ వైఖరే. ఎమ్మెల్యేకు కూడా ఒక స్థాయి వుంటుంది, కొంత బలం వుంటుంది, నచ్చినా నచ్చకపోయినా అతగాడు చెప్పినది వినాలి, లేదా విన్నట్టు నటించాలి అనే మౌలిక సూత్రాలను ఎన్టీయార్‌ పట్టించుకోలేదు. వీళ్లంతా గడ్డిపోచలు, నేను నిలబెడితేనే నిలబడ్డారు అనుకుని అహంకరించారు. అప్పుడు కెసియార్‌ వంటి గడ్డిపోచలే వెంటిగా ఏర్పడి ఆ మదగజాన్ని బంధించి నేలకు పడగొట్టాయి. ఇప్పుడు కెసియార్‌ ఎమ్మెల్యేలకు యిస్తున్న గౌరవం యింతకు మించి లేదు. మరి యీ చలిచీమలకు ఎప్పుడు ధైర్యం వస్తుందో తెలియదు. 

ఈరోజు కెసియార్‌ దేమీ పొరపాటు లేదు అంటున్న రాజయ్యే అప్పుడు ప్లేటు ఫిరాయిస్తారు. 'పేదలకోసం వూరి మధ్యలో కట్టిన ఛాతీ ఆసుపత్రి తరలింపును అడ్డుకోబోయాను. దాన్ని రియల్‌ ఎస్టేటుకి అప్పగిద్దామనుకున్న కెసియార్‌ నా అడ్డు తొలగించుకున్నారు' వంటి కారణం ఏదో చెప్పి సింపతీ సంపాదిస్తారు. రాజయ్యకు అంత సీను లేదు, ఆయన చెప్పినా ఎవరూ నమ్మరు అని యీరోజు అనిపిస్తుంది. భవిష్యత్తు ఎలా వుంటుందో ఎవరికి తెలుసు? విజయరామారావుగారికి మంత్రి పదవి యిచ్చి అదే కులానికి చెందిన కెసియార్‌కు డిప్యూటీ స్పీకరు పదవితో సరిపెడదామనుకున్నపుడు బాబుకు కెసియార్‌ లైట్‌వెయిట్‌గానే అనిపించారు – ఎంత పాత కొలీగ్‌ అయినా, ఎంత మంచి స్ట్రాటజిస్టు అయినా! పుష్కరం తిరిగేసరికి కెసియార్‌ బాబుతో సమానఫాయాలో కూర్చుంటున్నారు. రాజయ్య ఆ లెవెల్‌కు వెళతారని అనుకోవడం టూ మచ్‌ కానీ ఆయన కథ యిక్కడితో ముగిసిపోయిందని అనుకుంటే మాత్రం టూ లిటిల్‌!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]