గోవిందుడు అందరి వాడూలే సినిమాలో శ్రీకాంత్ చేసిన పాత్రకు మొదట విక్టరీ వెంకటేశ్ ను అనుకొన్నారు కృష్ణవంశీ అండ్ బ్యాచ్. తన తోటి హీరోలతోనూ, యువ హీరోలతోనూ కలిసి నటించడానికి అభ్యంతరాలు ఏమీ లేని వెంకీ ఆ విషయంలో సంప్రదించారట కూడా. అప్పటికే మహేశ్ బాబుతో కలిసి నటించి, పవన్ తో కలిసి నటించడానికి పచ్చ జెండా ఊపిన వెంకీ.. ఎందుకో గోవిందుడు అందరి వాడూలే సినిమా విషయంలో వెనక్కు తగ్గారు.
చివరకి ఈ పాత్ర విషయంలో శ్రీకాంత్ లైన్ లోకి వచ్చాడు. చిరంజీవి కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉండటం అప్పటికే చిరుతో కూడా కలిసి నటించడం, కృష్ణవంశీతో కూడా సాన్నిహిత్యం ఉండటంతో శ్రీకాంత్ ఈ పాత్ర దక్కేసింది. అవకాశం సంగతి ఎలా ఉన్నా.. పాత్ర పరంగా చూసుకొంటే.. కథకు శ్రీకాంత్ క్యారెక్టర్ ఇంపార్టెంటే.. అయితే మరీ అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు. “బంగారి''అనబడు పాత్రను శ్రీకాంత్ బాగా చేశాడు. చక్కటి టైమింగ్ తో లీడ్ చేశాడు. అయితే దీని వల్ల ఆయన కెరీర్ కు కొత్తగా వచ్చే లాభం ఏమీలేదు.
ఇది వరకూ ఇండస్ట్రీలో లీడ్ లో ఉన్న హీరోలతో కలిసి చేసిన పాత్రల ద్వారా ఎంత లాభం వచ్చిందో.. ఇప్పుడు కూడా అంత కన్నా లభించేది ఏమీలేదు! మరి ఒకవేళ వెంకీ ఈ పాత్రను చేసి ఉంటే… ఆయన స్థాయి కచ్చితంగా చాలా వరకూ తగ్గిపోయేది! ఒకవేళ వెంకీనే ఈ పాత్రకు ఓకే చెప్పి ఉంటే… ఆ పాత్రకు మరిన్ని మెరుగులు దిద్దేవాళ్లేమో! కమిలినీ ముఖర్జీ పాత్రతో ఒక పాట కూడా పెట్టించి కొన్ని శొభగులు దిద్దే వారేమో క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ.