బాబు నివాసం నుంచి ‘సాక్షి’ లైవ్..!

చంద్రబాబు వెనక్కు తగ్గారు.. సాక్షి టీవీని తన ఇంట్లోకి స్వాగతించారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా నిర్వహించిన ప్రెస్ మీట్ కు ఆయన సాక్షి టీవీ వారికి అనుమతిని ఇచ్చారు. గురువారం సాయంత్ర జరిగిన చంద్రబాబు…

చంద్రబాబు వెనక్కు తగ్గారు.. సాక్షి టీవీని తన ఇంట్లోకి స్వాగతించారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా నిర్వహించిన ప్రెస్ మీట్ కు ఆయన సాక్షి టీవీ వారికి అనుమతిని ఇచ్చారు. గురువారం సాయంత్ర జరిగిన చంద్రబాబు ప్రెస్ మీట్ ను సాక్షి టీవీ వారు లైవ్ లో ప్రసారం చేశారు. దీంతో అధికారిక కార్యక్రమాల్లో సాక్షి టీవీ పై చంద్రబాబు నిషేధాన్ని ఎత్తి వేసినట్టు అవుతోంది. 

ఇటీవలే సాక్షి వాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై  వివక్ష పాటిస్తోందని అంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మొరపెట్టుకొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా తమను రానివ్వడం లేదంటూ వారు ఫిర్యాదు చేశారు. తమ ఛానల్ ఓనర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు అనే నెపాన్ని కోపంగా చూపుతూ తమ కెమెరాలను రానివ్వడం లేదంటూ వారు పీసీఐకి ఫిర్యాదు చేశారు.

సాక్షితో పాటు నమస్తే తెలంగాణ టీ మీడియా కూడా పీసీఐకి చంద్రబాబుపై ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో తమపై నిషేధాజ్ఞలు విధిస్తోందని వారు పేర్కొన్నారు. మరి అంతర్గతంగా ఏమనుకొన్నారో ఏమో కానీ ఈ నిషేధాలు తొలగిపోయాయి. చంద్రబాబు ప్రెస్ మీట్ సాక్షి టీవీలో లైవ్ లో ప్రసారం అయ్యింది.

మరి జగన్ ను బూచిగా చూపుతూ ఇన్ని రోజులూ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరం పెడుతూ వచ్చిన తెలుగుదేశం వాళ్లు ఈ విధంగా వెనక్కుతగ్గారు. మరి ఈ నిషేధం ఎత్తివేత కేవలం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలవిషయంలోనేనా.. లేక తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యక్రమాల కవరేజి కూడా అనుమతి ఇచ్చేసినట్టేనా?!