టీడీపీ శ్రేణుల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. 2024లో అధికారం తమదే అని నమ్మబలుకుతున్నారాయన. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త ఇంటిపై మున్సిపల్ చైర్‌పర్సన్ రమాదేవి భర్త, కుమారులు, బంధువులు దాడికి పాల్పడడంపై ఆయన సీరియస్‌గా స్పందించారు.
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయలేదని దాడి చేయడం ఏంటని ఆయన ఆగ్రహించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, ఆగడాలకు హద్దు లేకుండా పోతోందని ఆయన ధ్వజమెత్తారు.
ప్రజలకు మంచి చేయాలన్న ఆశయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏ మాత్రం లేదని విమర్శించారు. ఎంతసేపూ ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు అక్రమ కేసుల బనాయింపుపైనే సీఎం దృష్టి వుందన్నారు. వైసీపీ నేతల ఆలోచనలన్నీ దాడులు, ప్రాణాలు తీయడం మీదే ఉందని మండిపడ్డారు.
దాచేపల్లిలో తమ కార్యకర్తపై దాడి చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త, కుమారులు, బంధువులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 2024లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అరాచక వైసీపీ రౌడీ మూకలకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించడం గమనార్హం.
ఇంతకూ బాధితులను నేరుగా పరామర్శించి ఓదార్పు మాటలు ఏవైనా చెప్పడం ఉందా? లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులను హెచ్చరించినంత మాత్రాన టీడీపీ బలపడదని, క్షేత్రస్థాయికి వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు.