జనవరి 20 ప్రయత్నం విఫలమై మదన్‌లాల్ పట్టుబడగానే హంతకబృందం వేర్వేరుగా విడిపోయారు. శంకర్ కిష్టయ్య రైల్లో పూనా వెళ్లిపోయాడు. గోడ్సే, ఆప్టే కాన్పూరు వెళ్లి ఒక రోజు వుండి అక్కణ్నుంచి 23కి బొంబాయి చేరారు. విష్ణు కర్కారే, గోపాల్ గోడ్సే ఢిల్లీలోనే వేరే హోటల్‌కు మారిపోయి మారుపేర్లతో వుండి, 21 న రైలెక్కి పూనా చేరారు. కర్కారే తలిదండ్రులు అతన్ని అనాథాశ్రమంలో పడేశారు. అక్కణ్నుంచి అతను పారిపోయి హోటళ్లలో, రెస్టారెంట్లలో అవీ యివీ చేస్తూ నాటకమాజంలో చేరాడు. చివరకు అహ్మద్‌నగర్‌లో ఓ రెస్టారెంటు తెరిచాడు. హిందూ మహాసభలో చురుగ్గా పనిచేశాడు. ఆ విధంగా ఆప్టేతో పరిచయమై అతని సహాయంతో అహ్మద్‌నగర్ మునిసిపల్ కమిటీకి ఎన్నికయ్యాడు. 1946 అల్లర్లు జరిగినప్పుడు నౌఖాలీ వెళ్లి అక్కడ మూడు నెలలు వున్నాడు. అక్కడ హిందువుల కష్టాలు, హిందూ స్త్రీల బలాత్కారాలు చూసి చలించిపోయాడు. ఆ అత్యాచారాలు జరిపిన ముస్లిముల పట్ల శాంతి, సహనం చూపాలని బోధిస్తున్న గాంధీపై పగ పెంచుకున్నాడు.
25వ తారీకున బొంబాయిలో వున్న కర్కారే బి.ఎమ్. వ్యాస్ అనే మారుపేరుతో పూనాలో వున్న ఆప్టేకు ఒక టెలిగ్రాం యిచ్చాడు ''మీ యిద్దరూ వెంటనే రండి'' అని. మర్నాటికి వాళ్లు వచ్చారు. బొంబాయిలో ఒక హోటల్లో మారుపేర్లతో వున్నారు. ఆ రాత్రి 9.45 కి ముగ్గురూ ఠాణే రైల్వే స్టేషనులో గూడ్సు యార్డ్ వద్ద సిమెంటు ప్లాట్‌ఫాంపై కూర్చుని తర్వాతి కార్యక్రమం గురించి చర్చించారు. గోడ్సే చెప్పినదిది – ''గతం గతః! దాని గురించి చర్చ అనవసరం. మదన్‌లాల్ మన గురించి చెప్పాక పోలీసులు మనను అరెస్టు చేస్తారు. గాంధీని చంపే మన లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. నేను బాగా ఆలోచించాను – పదిమంది కలిసి హత్య చేసి, తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఘట్టాల్లో వైఫల్యమే ఎక్కువగా వుంటోంది. ఎవడో ఒకడు ఆత్మత్యాగానికి సిద్ధపడి, ఒంటరిగా సాహసిస్తేనే ఫలితం వుంటోంది. అంతమంది మధ్య గాంధీని చంపడం కష్టం. ఎదుటపడి కాల్చేయడమే మార్గం. అప్పుడు పట్టుబడడమూ, శిక్షా ఖాయమే. ఆ పని నేనే చేస్తాను. ఎందుకంటే గోపాల్‌కు, ఆప్టేకు కుటుంబాలున్నాయి. నేను ఒంటరివాణ్ని.'' అప్పుడు ఆప్టే ''నేను నిన్ను ఒంటరిగా వెళ్లనీయను. తోడుగా వస్తాను.'' అన్నాడు. గోడ్సే నిట్టూర్చి కర్కారేతో ''నేను ఒకటి రెండు రోజుల్లో రివాల్వర్ సంపాదిస్తాను. నేననుకున్న లక్ష్యం సాధించాకనే మహారాష్ట్రలో మళ్లీ అడుగుపెడతాను.'' అన్నాడు. ఆప్టే కర్కారేకు రూ.300 యిచ్చి 'నువ్వు రేపు ఢిల్లీకి రైల్లోకి వెళ్లి అక్కడ వుండు, మేం విమానంలో వస్తాం. నిన్ననే వి వినాయకరావు, డి వినాయకరావు అనే మారుపేర్లతో టిక్కెట్లు బుక్ చేశాం' అన్నాడు.
ఇదీ జరిగినది. ఇవన్నీ కోర్టులో కర్కారే, యితరులు యిచ్చిన సాక్ష్యాల ద్వారా నిరూపితమైంది. అయితే గోడ్సే తన సహచరులను కాపాడడానికి చాలా అబద్ధాలాడాడు. తన వాఙ్మూలంలో అతను చెప్పినది – ''మేం 1948 జనవరి 20న ఢిల్లీ వచ్చాం కానీ గాంధీని చంపడానికి కాదు. ప్రార్థనాస్థలం వద్ద ప్రదర్శన చేయడానికి మాత్రమే. నాకు తీవ్రమైన తలనొప్పి రావడంతో నేను అక్కడకు వెళ్లలేకపోయాను. నాకు తెలిసినంత వరకు గోపాల్ అవేళ ఢిల్లీలోనే లేడు. గన్కాటన్ స్లాబులు, చేతిగ్రెనేడ్లు, ఫ్యూజ్‌వైర్లు యిత్యాదులు మా హోటల్ గదిలో ఏర్పాటు చేయలేదు, మేం మారుపేర్లు పెట్టుకోవడం అదీ సర్వాబద్ధం. సాయంత్రం ఆరు గంటలకు ఆప్టే హోటలుకు తిరిగి వచ్చి ప్రార్థనాస్థలాన్ని చూసి వచ్చానని, ఒకటి రెండు రోజుల్లో నిరసన ప్రదర్శన చేయిస్తానని చెప్పాడు. అతను తిరిగి వచ్చిన ఒక గంటకు గాంధీ ప్రార్థనాస్థలం వద్ద ఒక ప్రేలుడు జరిగిందని, ఒక శరణార్థిని నిర్బంధంలోకి తీసుకున్నారనీ విన్నాము. వెంటనే ఢిల్లీ వదిలివెళ్లడం మంచిదనుకున్నాం. వెళ్లిపోయాం.'' కానీ బాహ్‌ాడగే అప్రూవర్‌గా మారడంతో అవేళ జరిగిన ప్రతి చిన్న విషయం పోలీసులకు తెలిసిపోయి, సంబంధిత వ్యక్తుల సాక్ష్యాలు సేకరించి, కోర్టులో చూపగలిగారు. గోడ్సే అబద్ధం చెప్తున్నాడని కోర్టు గ్రహించగలిగింది.
ఇక హత్యాయుధం గురించి, హత్యకు దారి తీసిన పరిణామాల గురించి జరిగినదేమిటి? దానిపై గోడ్సే చెప్పినదేమిటి? అదీ చూద్దాం. కర్కారేతో మాట్లాడాక మర్నాడు విమానంలో గోడ్సే, ఆప్టే ఢిల్లీకి మధ్యాహ్నం 12.40కి చేరారు. అవేళ సాయంత్రమే గ్వాలియర్ రైలెక్కి రాత్రి 10.30కి చేరారు. జట్కాలో డా|| పర్చూరే యింటికి చేరి రాత్రి అక్కడే పడుక్కున్నారు. డా|| దత్తాత్రేయ పర్చూరే తండ్రి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటులో ఉన్నతోద్యోగం చేశారు. ఈయన ఎంబిబియస్ చదివి స్టేట్ మెడికల్ సర్వీసులో చేరాడు. 1934లో ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయడంతో ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకున్నాడు. హిందూ మహాసభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. స్థానిక హిందూ రాష్ట్ర సేనకు నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఆ హోదాలోనే గోడ్సే, ఆప్టేలతో పరిచయం కలిగింది. వీళ్లు యిప్పుడు వచ్చి పిస్టల్ కావాలనడంతో తన సేనలో వున్న గోయెల్ అనే అతని దగ్గర్నుంచి సంపాదించి యిచ్చాడు. అది పట్టుకుని గోడ్సే, ఆప్టే ఢిల్లీకి 29 పొద్దున్న చేరారు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే రిటైరింగు రూములో బస చేసి, 29 మిట్ట మధ్యాహ్నం బిర్లా టెంపుల్ దగ్గర కర్కారేను ముందు అనుకున్న ప్రకారం కలిశారు. ''నువ్వు ఒక్కడివే భారం మోయడం భావ్యమా?'' అని కర్కారే గోడ్సేని అడిగాడు. గోడ్సే ''నేను మంచి రచయితే కాక వక్తను కూడా. గాంధీని చంపడంలో మహోన్నత ఆశయం వుందని ప్రభుత్వాన్ని, కోర్టుని ఒప్పించగలను. అందువలన నేనే ముందుండాలి. ఆప్టే వక్త కాదు, కానీ వ్యవహారజ్ఞానం తెలిసినవాడు. అతను మన హిందూ రాష్ట్ర పత్రికను నడుపుతూ మన ఉద్యమం కొనసాగించాలి. నువ్వు అహ్మద్‌నగర్ వెళ్లు. హిందూ రాష్ట్ర పేపరు షేర్లు అమ్మడానికి చూడు. ఆప్టేకు అండగా నిలబడు.'' అని చెప్పాడు. సాయంత్రం చల్లబడేసరికి కర్కారే ఏదైనా సినిమాకు వెళదామన్నాడు. గోడ్సే అవేమీ వద్దు, నాకు విశ్రాంతి కావాలి' అన్నాడు. 'ఎప్పుడూ హత్య గురించే ఆలోచించడం మంచిది కాదు, కాస్త డైవర్షన్ వుంటే మంచిది, సినిమాకు వెళదాం రా' అప్టే నచ్చచెప్పబోయాడు. గోడ్సే వినలేదు, పుస్తకం తీసి చదువుకోసాగాడు. కర్కారే, ఆప్టే అతన్ని వదిలేసి దగ్గర్లో వున్న సినిమాహాల్లో దూరారు.
30 వ తారీకు ఉదయం గోడ్సే అందరి కంటె ముందుగా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ముగ్గురూ కలిసి అల్పాహారం తీసుకున్నాక, జట్కా ఎక్కి కొత్త ఢిల్లీకి వెళ్లారు. దగ్గర్లో వున్న ఒక చిట్టడవిలోక తీవెళ్లారు. గోడ్సే మూడు, నాలుగు రౌండ్లు కాల్చి చూసుకుని తుపాకీ బాగానే పనిచేస్తోందని నిర్ధారించుకున్నాడు. ముగ్గురూ కలిసి పాత ఢిల్లీకి తిరిగి వచ్చారు. సాయంత్రం 4.30కు మిత్రులిద్దరికీ గుడ్‌బై చెప్పి టోంగా చేసుకుని బిర్లా హౌస్‌కు చేరాడు. కర్కారే, ఆప్టే యిద్దరూ వెనక్కాల మరో టోంగా ఎక్కి అక్కడికి చేరారు. ప్రార్థన సమావేశం యింకా ప్రారంభం కాలేదు. 200 మంది దాకా అక్కడ వున్నారు. గోడ్సే వాళ్లలో కలిసిపోయాడు. కొద్ది సేపటికి గాంధీ రెండు చేతులూ యిద్దరమ్మాయిల భుజాల మీద వేసుకుని నడిచి వస్తున్నాడు. జనాలంతా రెండు భాగాలుగా చీలి, దారి యిచ్చారు. ప్రజలను చూసి అభివాదం చేయడానికి గాంధీ చేతులెత్తుతూండగా గోడ్సే జనం లోంచి ముందుకు వచ్చి గాంధీకి కుడివైపు వున్న అమ్మాయిని పక్కకు తోసేసి, గాంధీ ఎదురుగా నిలబడి ఛాతీలోకి పాయింట్ బ్లాంక్ రేంజిలో మూడుసార్లు కాల్చాడు. 'హాయ్ రామ్' అంటూ గాంధీ కుప్పకూలిపోయాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)