సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురిగా చలామణీ అవుతున్న వారిలో అల్లు అరవింద్ , దిల్ రాజు, సురేష్ బాబు, ఇప్పుడు కొత్త ఎత్తుగడకు తెరతీసారు. సినిమా వ్యయం కంట్రోలు పేరిట, మీడియాను కంట్రోలు చేసే పనికి సిద్ధపడ్డారు. కేవలం టీవీ 9, ఎన్ టీవీ, టీ న్యూస్ అనే మూడు న్యూస్ చానెళ్లకు, ప్రకటనలివ్వాలని, మిగిలిన న్యూస్ చానెళ్లకు( సాక్షి, ఈటీవీ 2, ఎబిఎన్ సహా) ప్రకటనలివ్వరాదని నిర్ణయించారు. ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల సంగతి మామూలే.
ఈ వ్యవహారం ఎలా వుందంటే, కొండనాలుకకు మందేస్తే, వున్న నాలుక ఊడిన చందంగా వుంది. బంగారపు పళ్లానికైనా గోడ చేర్పు కావాలని, ఎంతటి సినిమానైనా జనం దగ్గరకు చేర్చేది పబ్లిసిటీ. అనవసరపు వ్యయాల కింద కోట్లాదిరూపాయిలు ఖర్చు చేస్తూ, పబ్లిసిటీ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఆలోచించడం అంటే ఏమనుకోవాలి. అక్కడ కూడా చిత్రమైన వ్యవహారం. టీవీ 9 కు అనుబంధ టీవీ 1, ఎన్ టీవీ అనుబంధ వనిత టీవీ అంత పాపులర్ కావు. వాటి ప్రధాన చానెళ్లు మాత్రం పాపులర్.
పాపులర్ చానెళ్లు కాని వాటికి (టీఆర్పీ రేటింగ్ ల ప్రకారం) ప్రకటనలు ఇవ్వకూడదనుకున్నపుడు మరి ఈ చానెళ్లకు ఎందుకు ఇవ్వడమో? మరోపక్క టీ న్యూస్ కు కూడా ప్రకటనలిస్తారు. మరి అది టీఆర్పీ ప్రకారం పైన వుందా? కానీ ఇవ్వాలి. ఎందుకంటే అది తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ చానెల్. దానికి ఇవ్వకుంటే తేడా వచ్చేస్తుంది. అంటే తీసుకున్న నిర్ణయంలో చిత్తశుధ్ది కరువైందని తెలిసిపోతూనే వుంది. భయపెట్టే వారికి దండం పెడతారు. లేని వాటిని వదిలేస్తారు.
సరే, అసలు నిజంగా అన్ని చానెళ్లకు ప్రకటనలు ఇస్తే లేదా కొన్నింటికే ఇస్తే, ఎంత తేడా వస్తుంది..మహా అయితే యాభై లక్షల రూపాయిలు. కానీ ఇక్కడ పెద్ద సినిమాలకు పబ్లిసటీతో పని లేదు. వాటికి సహజంగానే పబ్లిసిటీ వచ్చేస్తుంది. కానీ చిన్న సినిమాను జనం దగ్గరకు తీసుకెళ్లాలంటే పబ్లిసిటీ కావాలి. కోటి రెండు కోట్లతో సినిమా తీసి, ఓ కోటి అదనంగా ప్రచారం కోసం ఖర్చుచేస్తాయి చిన్న సినిమాలు. కానీ పెద్ద నిర్మాతలు, ముఫై నలభై కోట్లు సినిమా కు ఖర్చు చేసి, పబ్లిసిటీ దగ్గర అర కోటి రూపాయిలకు నిబంధనలు విధిస్తున్నారు.
నిజానికి పెద్ద సినిమాలకు అయ్యే వృధా ఖర్చు ఇంతా అంతా కాదు. ఒక్కో పెద్ద హీరో 10 నుంచి పదిహేను కోట్లు తీసుకుంటున్నారు. ఒక్కో పెద్ద డైరక్టర్ 10 కోట్లు తీసుకుంటున్నారు. చిన్న చిన్న కమెడియన్లు కూడా రోజువారీ వసూళ్లు, కేరవాన్ లు అడుగుతున్నారు. ఒక్కో కేరవాన్ కు రోజుకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇలా రకరకాల ఖర్చల దగ్గర వేల కొద్దీ తగ్గించినా, సినిమా పబ్లిసిటీ మొత్తం వచ్చేస్తుంది. కానీ అలా చేయడానికి, నియంత్రణలకు, నిర్ణయాలకు మాత్రం ఈ సినిమా పెద్దలకు ధైర్యం చాలడం లేదు.
తేరగా పాకులాడుతూ కనిపించేది మీడియానే కాబట్టి దానిపైనే అంక్షలు. చానెళ్లు, మీడియా సినిమాల మెటీరియల్ కోసం, సాఫ్ట్ వేర్ కోసం పాకులాడబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అదే కనుక వాటి వంక చూడకుండా, సినిమాలపై తమ దారిన తాము వెళ్లినట్లయితే, ఈ పెద్ద నిర్మాతలు ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు ధైర్యం చేసేవారు కాదు.
దీని వల్ల నష్టపోయేది చిన్న నిర్మాతలే. ఎందుకంటే అందరూ కొన్ని చానెళ్లు మాత్రమే చూడరు.
ప్రతి చానెల్ కు కొంతయినా వ్యూవర్ షిప్ వుంటుంది. ఇప్పుడు ఆ పార్ట్ కు, ఈ సినిమాల ప్రకటనలు చేరకుండా పోతాయి. దాంతో చిన్న సినిమా నిర్మాతలు దారుణంగా నష్టపోతారు. పైగా ఎప్పుడైతే ఈ చానెళ్లకే ప్రకటనలు అన్నది డిసైడ్ అవుతుందో, రేట్లలో మోనోపలీ పెరుగుతుంది. దాంతో ఖర్చు పెరుగుతుందే తప్ప తరగదు. అంటే అన్ని చానెళ్ల మూతులు కట్టి, కొన్ని చానెళ్లుకు అందిస్తారన్నమాట.
నిజంగా వ్యయం తగ్గించాలని వుంటే, విదేశాల్లో రికార్డింగ్ లు, విదేశాలకు వెళ్లి కాస్ట్యూమ్ లు కొనడాలు, అవసరం లేకుండానే విదేశీ నేపథ్యంలో కథలు అల్లడాలు తగ్గించాలి. ఒక్కపక్క గొప్ప గొప్ప సినిమాటోగ్రాఫర్ లను పెట్టుకుంటూనే, మళ్లీ డిఐ అంటూ డిజిటిల్ కరెక్షన్, లాంటి వ్యవహారాలు ఎందుకు? మన గాయకులు వుండగా, లక్షల్లో పారితోషికం ఇచ్చి, ఎక్కడి నుంచో ఏవేవో గొంతులు తెప్పించడం ఎందుకు? మన దగ్గర సత్తా వున్న నటులు వుంటే, బాలీవుడ్, పక్క భాషా నటులను కోట్లు ఇచ్చి తెచ్చుకోవడం ఎందుకు?
నిజంగా వ్యయం తగ్గించాలని వుంటే, బాటమ్ లెవెల్ నుంచి మొదలు పెట్టాలి. హీరోలకు, దర్శకులకు కోట్లాది రూపాయిలు పోసేస్తూ. నిర్మాణం కోసం మంచినీళ్లలా వ్యయం చేస్తూ, దాన్ని కంట్రోలు చేయడం మరిచిపోయి, కేవలం ప్రకటనలు కట్టడం చేయడం ద్వారా మీడియాను నియంత్రించగలం అంటే అది అపోహే.