మణిరత్నం..నిజంగా మణిలాంటి దర్శకుడు. కానీ సరైన కథలు దొరకకో, ఎంచుకోకనో బాక్సాఫీసు దగ్గర విఫలమవుతూ వస్తున్నాడు. చాన్నాళ్లుగా ఏంటి..చాలా ఏళ్లుగా సరైన హిట్ లేదు. ఇప్పుడు మళ్లీ తనదైన మార్కు ప్రేమ కథను జనాలకు చూపించడానికి సిద్ధమయ్యాడు. అదే ఓకె కణ్మణి…తెలుగులో ఓకె బంగారం.
ఈ సినిమాపై మెలమెల్లగా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. మణిరత్నం సినిమాలకు ఏ సెంటర్లలో ఇంతో అంతో క్రేజ్ వుంది. అది మరీ థియేటర్లు మొదటి రోజే ఫుల్ అయిపోయేంత కాదు కానీ, దానికోసం ఎదురు చూసేవారు అంటూ వుంటారు. ఇప్పుడు మణి రత్నం లవ్ స్టోరీ తీస్తున్నాడు అనేసరికి యువత కూడా కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు.
అందునా దాదాపు పదిహేనేళ్లయింది..సఖి సినిమా వచ్చి. మళ్లీ అలాంటి జోనర్ సినిమాగా కనిపిస్తోంది. పైగా నాడు సఖికి పనిచేసిన తరువాత ఏస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ మళ్లీ మణిరత్నంతో పని చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాకు జత కలిసారు. రెహమాన్ తోడు ఎలాగూ వుంది. మరి ఈ ముగ్గురు కలిసి ఆనాటి సఖి మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.
ఇదిలా వుంటే ఈ సినిమా మీద తెలుగు హక్కులు తీసుకున్న దిల్ రాజు మాత్రం మాంచి కాన్ఫిడెన్స్ తో వున్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఓవర్ సీస్ లో కూడా ఆయనే నేరుగా విడుదల చేసుకోవడం ఆ కాన్ఫిడెన్స్ కు నిదర్శనం.