ఎమ్బీయస్‌ :మధ్యప్రదేశ్‌లో బిజెపి పరిస్థితి

ఏడాది క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించింది. ఆ స్ఫూర్తితో యీ పార్లమెంటు ఎన్నికలలో మొత్తం 29 స్థానాలూ గెలవాలనే లక్ష్యంతో 'మిషన్‌ 29' అనే కోడ్‌నేమ్‌తో బిజెపి ఎన్నికలకు తయారైంది.…

ఏడాది క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించింది. ఆ స్ఫూర్తితో యీ పార్లమెంటు ఎన్నికలలో మొత్తం 29 స్థానాలూ గెలవాలనే లక్ష్యంతో 'మిషన్‌ 29' అనే కోడ్‌నేమ్‌తో బిజెపి ఎన్నికలకు తయారైంది. 2009 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 16 స్థానాలు గెలిచింది. 2013 ఎన్నికలలో 26 లోకసభ నియోజకవర్గాలలో బిజెపికి కాంగ్రెసు కంటె 8% ఓట్లు ఎక్కువ వచ్చాయి. అదే పరిస్థితి కొనసాగితే 26 తెచ్చుకోవడం కష్టం కాదనే భావన బిజెపిది. 230 సీట్లున్న అసెంబ్లీలో 58 స్థానాలు మాత్రమే తెచ్చుకోగలిగిన కాంగ్రెసు హీనస్థితి నుండి యింకా కోలుకోలేదు. రాష్ట్ర అధ్యకక్షుణ్ని, శాసనసభలో ప్రతిపక్ష నాయకుణ్ని మార్చినా కార్యకర్తల్లో ఉత్సాహం పుంజుకోలేదు. అది కూడా బిజెపికి ధీమా నిస్తోంది. అందుకే సుష్మా స్వరాజ్‌ యిక్కడి నుండి పోటీ చేస్తున్నారు. తప్పకుండా గెలుస్తామనగానే ఆశావహులు పెరుగుతారు. ఆశాభంగం కలిగితే తిరగబడతారు. అంతర్గత కలహాలు పెరుగుతాయి. నాయకత్వం ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొడదామనే లక్ష్యంతో బయటివారిని చేర్చుకుని తన కార్యకర్తలను ఉసూరుమనిపిస్తుంది. మన రాష్ట్రంలో వివిధ పార్టీల్లో జరుగుతున్న కథే అక్కడ ఎంపీలోనూ జరుగుతోంది. కాంగ్రెస్‌ నుండి ఫిరాయించిన ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌కు బిజెపి హోషంగాబాద్‌ టిక్కెట్టు యిచ్చింది. భగీరథ్‌ ప్రసాద్‌ సింగ్‌ అనే రిటైర్డ్‌ ఐయేయస్‌ అధికారి కాంగ్రెసులో వున్నాడు. కాంగ్రెసు అతనికి టిక్కెట్టు యిచ్చింది. తన పేరు జాబితాలో వెలువడిన రోజే అతను బిజెపిలోకి మారాడు. రోజే బిజెపి భిండ్‌ టిక్కెట్టు యిచ్చేసింది. సహజంగానే స్థానిక బిజెపి నాయకులకు కోపం వచ్చింది. 

మోదీ ప్రభంజనంలో గడ్డిపోచను నిలబెట్టినా గెలుస్తాడనే అతివిశ్వాసంతో బిజెపి నాయకత్వం రాజధాని ఐన భోపాల్‌ టిక్కెట్టును అలోక్‌ సంజార్‌ అనే అతనికి యిచ్చింది. అతను పార్టీ ఆఫీసులో పనిచేస్తాడంతే. ఇచ్చేముందు ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను సంప్రదించలేదు. వారిలో ఐదుగురు యీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ గౌర్‌ భోపాల్‌ మేయర్‌గా వున్న తన కోడలికి టిక్కెట్టు యిమ్మన్నాడు. ఆయన్నూ నిరాశపర్చడంతో ఆయన రచ్చ కెక్కాడు. తన కొడుక్కి టిక్కెట్టు యివ్వలేదని గోపాల్‌ భార్గవ అనే గ్రామీణాభివృద్ధి మంత్రి ఒకరోజు మౌనవ్రతం పట్టాడు. తన భార్యకు గాని, కూతురుకి గాని టిక్కెట్టు యివ్వలేదని ఆగ్రహించిన వ్యవసాయ మంత్రి గౌరీశంకర్‌ బిషన్‌ ప్రచారం చెయ్యను పొమ్మన్నాడు. భార్యలకు టిక్కెట్టు అడిగి భంగపడిన రవాణామంత్రి భూపేందర్‌ సింగ్‌, ఆర్థికమంత్రి జయంత్‌ మాలయా రుసరుసలాడుతున్నారు. 

కాంగ్రెసు సంగతి చూడబోతే – సుష్మా స్వరాజ్‌కు వ్యతిరేకంగా విదిశాలో కాంగ్రెసు పార్టీ లక్ష్మణ్‌ సింగ్‌ను నిలబెట్టింది. ఇతను దిగ్విజయ్‌ సోదరుడు. అన్నపై అలిగి 2004లో పార్టీ వీడి బిజెపిలో చేరి, మళ్లీ పార్టీలో చేరాడు. కమల్‌ నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియాలకు గెలిచే అవకాశాలు  వున్నాయట. సింధియాకు వ్యతిరేకంగా బజరంగ్‌ దళ్‌ నాయకుడు జైభాన్‌ సింగ్‌ పవయా నిలబడ్డాడు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి యశోధర రాజేను సింధియాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని అడిగితే 'ఏ పార్టీకి చెందినా, అతను నా మేనల్లుడు. నేను వ్యతిరేకప్రచారం చేయను' అని చెప్పేసిందామె. అంతేకాదు, ప్రచారం సందర్భంగా సింధియా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తన పార్టీ అభ్యర్థి పవయాపై కేసు పెట్టింది కూడా. ఇవన్నీ చూస్తే ఎంపీలో బిజెపికి 25 సీట్ల కంటె ఎక్కువ వచ్చే అవకాశాలు లేవనిపిస్తుంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]