ఈ రోజు పొద్దున్న వార్తలు చదువుతుండగా పలు ప్రముఖ పత్రికలలో “London NRI చే పరాభవించబడిన చిరంజీవి” అనే ముఖ్యాంశం చదివాను. ఐదు ఏళ్ళ క్రితం బహుశా ఈ ఘటన జరిగి వుండేది కాదేమో. చాలా బాధ కలిగింది.
“ఐదు ఏళ్ళ తరువాతా ఇప్పుడు బాధ కలిగిందా?” అని మీరు అడగచ్చు. తను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఇవన్నీ అవసరమా ఈయనకి అని ప్రశ్నించాను. ఎన్నికల ముందు తన సొంత పార్టీ లోనే తను ఒక తోలుబొమ్మ అన్న విషయం తెలిసేసరికి ఆశ్చర్యపోయాను. ఉత్తుత్తి సంభాషణలు, గాలి ప్రమాణాలు చూసి ఛీదరించాను. ఈ ఐదేళ్ళలో జరిగిన రాజకీయ చదరంగం చూసి అసహ్యించుకున్నాను, ఆగ్రహించాను. ఈ రోజు నిజంగా, హృదయపూర్వకంగా బాధ పడ్దాను.
“జై చిరంజీవా”, “జై చిరంజీవా” అనే కోట్లాది అభిమానుల మధ్య రారాజులా నడుస్తూ, తెలుగు వెండి తెర సింహాసనం పై మహారాజు లా కొలువున్న “చిరూ”ని, ఈ రోజు కార్తీక్ అనే ఒక సామాన్య voter (आम आदमी), “ఛీ చిరంజీవా?, వెనక్కి ఫో” అని మర్యాదపూర్వకంగా చెప్పి పంపేసాడు.
ఆనాడు ఆ రాజుని పువ్వులు జల్లి రధం ఎక్కించిన ప్రజలు ఈనాడు ఈ మంత్రిని కోడిగుడ్లు మొహాన కొట్టి గద్దె దించుతున్నారు.
కార్తీక్ చేసిన పనిలో ఏ మాత్రం తప్పు లేదు. అహంకారం, చిన్నచూపు, నిర్లక్ష్యం, కుతంత్ర రాజకీయ మేధస్సుతో నిర్ణయాలు తీసుకునే “అధిష్ఠానానికి” తలొగ్గి, గంగిరెద్దులా తల ఊపి, సలాం చేసే బానిసకి ఏ మాత్రం గౌరవం ఇవ్వాలో అంత కన్నా ఎక్కువే ఇచ్చాడు కార్తీక్. కాని నేను ముందుగా అన్నట్టు ఒకప్పటి చిరంజీవికి ఈ చుక్కెదురయ్యేది కాదేమో.
ఒక వీరాభిమాని గా నాకు ఒక మాట చెప్పాలని వుంది. రాజకీయ నాయకుడిగా తను గత ఎన్నికల్లో గెలిచినా నిజానికి అభిమానుల గుండెల్లో ఓడిపోయాడనీ, ఈ ఎన్నికల్లో రెండు వైపులా ఓడిపోతాడనీ చిరంజీవికి ఈపాటికే తెలిసి వుంటుంది. తన రాజకీయ జీవితం నశించబోతోంది. ఈ నిజాన్ని స్వీకరించి, తానూ చేసిన తప్పు తెలుసుకుని, ఈ నాటి “మూగ” మంత్రి మళ్లీ ఆ నాటి Megastar చిరంజీవిగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను.
“ఖడ్గం” సినిమాలో సంగీత పాత్ర heroine అవ్వాలనే ఆకాంక్షతో “ఒక్క Chance” అని అందరి వెంటా పడుతుంది. చిరంజీవికి “chance”ల కొరత లేదు. తనకి కావలసింది, తన అభిమానులకి కావలసింది కేవలం …
“ఒక్క Step , ఒకే ఒక్క Step”
-Vikram Kolluru, Maryland, USA