సినిమా రివ్యూ: బీరువా

రివ్యూ: బీరువా రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఉషాకిరణ్‌ మూవీస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ తారాగణం: సందీప్‌ కిషన్‌, సురభి, నరేష్‌, ముఖేష్‌ రిషి, షకలక శంకర్‌, సప్తగిరి, అజయ్‌ తదితరులు సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌…

రివ్యూ: బీరువా
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: ఉషాకిరణ్‌ మూవీస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, సురభి, నరేష్‌, ముఖేష్‌ రిషి, షకలక శంకర్‌, సప్తగిరి, అజయ్‌ తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత: రామోజీరావు
కథ, కథనం, దర్శకత్వం: కన్మణి
విడుదల తేదీ: జనవరి 23, 2015

‘బీరువా’ నేపథ్యంలో కథ నడుస్తుందంటే వినడానికి ఆసక్తికరంగానే అనిపించింది. ఏదో వెరైటీ వినోదం ఉంటుందేమో అని వెళ్లిన వారిని ‘బీరువా’ నీరుగార్చేస్తుంది. రెండు గంటల పాటు కామెడీ మీదే ఫోకస్‌ పెట్టినా… కడుపుబ్బ నవ్వు రాకపోగా, రెండు గంటల పాటు బీరువాలో బంధించిన ఫీలింగ్‌ వస్తుంది. 

కథేంటి?

ఒకావిడ తన కొత్త ఫ్లాటులోకి ఫర్నిచర్‌ మొత్తం కొంటుంది. ఇంటికి తెచ్చిన బీరువా ఓపెన్‌ చేస్తే అందులోంచి సంజు (సందీప్‌ కిషన్‌) బయటకి వస్తాడు. అసలు సంజు ఆ బీరువాలోకి ఎలా వచ్చాడు అనేదంతా ఆమెకి వివరిస్తాడు. విజయవాడకి చెందిన ఆదికేశవ (ముఖేష్‌ రిషి) అనే పెద్ద రౌడీ కూతురైన స్వాతి (సురభి), సంజు ప్రేమించుకుంటారు. తన తండ్రికి (నరేష్‌) ఏదో కష్టం వస్తే ఆదికేశవ దగ్గరకి వెళ్దామని సలహా ఇస్తాడు సంజు. అలా వెళ్లిన తండ్రీకొడుకులిద్దరి పని సాఫీగా అయిపోతుంది. కానీ తమతో పాటుగా స్వాతిని కూడా తెచ్చేస్తాడు సంజు. అక్కడ మొదలైన ఛేజ్‌లో సంజు ఆ బీరువాలోకి ఎలా వస్తాడు? తర్వాత తన ప్రేమని దక్కించుకోవడానికి ఏం చేస్తాడు? 

కళాకారుల పనితీరు:

సందీప్‌ కిషన్‌ ఎప్పటిలానే చలాకీగా చేసుకుపోయాడు. నటుడిగా తనకి కొత్తగా ఎలాంటి పరీక్షలు పెట్టలేదీ చిత్రం. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ… అవసరాన్ని బట్టి కండ బలం చూపించే పాత్ర. ఇంతకుముందు పలు చిత్రాల్లో ఇలాంటివి చేసాడు. సురభికి హీరోయిన్‌ ఫీచర్స్‌ తక్కువ. నటన కూడా అంతంత మాత్రమే. 

Video: Beeruva Movie Public Talk

కొడుకు కారణంగా ఒక రౌడీ ఇంట్లో ఇరుక్కుపోయే పాత్రలో భయస్తుడిగా నరేష్‌ బాగా నవ్వించాడు. సన్నివేశాల్లో బలం లేకపోయినా, సంభాషణలు చాలా సాదా సీదాగా ఉన్నా కేవలం తన హావభావాలతో నరేష్‌ కామెడీ పండిరచాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ షకలక శంకర్‌ కూడా అక్కడక్కడా రిలీఫ్‌ ఇచ్చాడు. ముఖేష్‌ రిషికి ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. సప్తగిరి అన్ని సినిమాల్లోను ఒకే తరహా పాత్రలతో, ఒకే టైప్‌ నటనతో విసిగిస్తున్నాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

టెక్నికల్‌ టీమ్‌లో చాలా మంది పెద్ద వాళ్లున్నారు. అందుకే సినిమా క్వాలిటీ అయితే బాగా వచ్చింది. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధానాకర్షణ. లో బడ్జెట్‌ సినిమా అయినా కానీ రిచ్‌ విజువల్స్‌తో కలర్‌ఫుల్‌గా కనిపించింది. థమన్‌ స్వరపరిచిన పాటలు ఓకే అనిపిస్తాయి. ఓవరాల్‌ రన్‌ టైమ్‌ తక్కువే ఉన్నా కానీ కొన్ని సీన్లు మరీ ఎక్కువ సమయం సాగతీసారనిపిస్తుంది. వాటి నిడివి తగ్గించాల్సింది. ఈ చిత్రానికి మరో ఆకర్షణ ప్రొడక్షన్‌ డిజైన్‌. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చేసిన వర్క్‌ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలకి వంక పెట్టడానికేం లేదు. ఒక చిన్న సినిమాకి ఇంతకంటే వనరుల్ని ఏ దర్శకుడూ అడగలేడు. 

దర్శకుడు కన్మణి ‘బీరువా’ని అడ్డం పెట్టుకుని ఏదో వెరైటీ సినిమా తీసినట్టుగా మభ్య పెట్టాడు. బీరువా వల్ల ఈ కథకి యాడ్‌ అయిన అడ్వాంటేజ్‌ ఏమీ లేదు. ఇంకా మాట్లాడితే ఈ కథలో దాని అవసరమే లేదు. రొటీన్‌ లవ్‌ స్టోరీకి కాస్త కామెడీ జోడిరచి కథ చెప్తే ‘ఇందులో ఏముంది’ అనేస్తారని అనుకున్నాడో ఏమో… ఆ కథని తీసుకెళ్లి బీరువాలో పడేసి ఇదే కొత్తదనం అని కన్విన్స్‌ చేసేసినట్టున్నాడు. ఆర్టిస్టుల వల్ల కొన్ని కామెడీ సీన్లు పండాయి కానీ దర్శకుడిగా కన్మణి పూర్తిగా ఫెయిలయ్యాడు. ఏ క్షణంలోను ఈ బీరువా ఆసక్తి రేకెత్తించకపోగా, శుభం కార్డు కోసం పడిగాపులు పడేట్టు చేసింది. 

హైలైట్స్‌:

  • సినిమాటోగ్రఫీ
  • ప్రొడక్షన్‌ డిజైన్‌
  • నరేష్‌, శంకర్‌ కామెడీ

డ్రాబ్యాక్స్‌:

  • బీరువా కాన్సెప్ట్‌
  • రొటీన్‌ లవ్‌స్టోరీ
  • నస పెట్టే కామెడీ

విశ్లేషణ:

నిద్ర రావట్లేదు.. ఏదైనా కథ చెప్పమని మారాం చేసే పసి పిల్లలకి ఈ బీరువా కథ చెప్తే… మధ్యలో అడ్డు తగిలి ‘ఇదేంటి సిల్లీగా.. ఏదైనా మంచి కథ చెప్పు’ అంటూ గొడవ పెట్టేస్తారు. మరి ఇలాంటి కథని విని ఇంత మంది పెద్దలు ఎలా కన్విన్స్‌ అయ్యారో… ఎలా ఈ సినిమా తీసేసారో అర్థం కాదు. టైటిల్స్‌లో ‘బీరువా’ యానిమేషన్‌ సెల్ఫ్‌ ఇంట్రడక్షన్‌ దగ్గర్నుంచీ ఈ చిత్రం రాంగ్‌ ట్రాక్‌ పట్టేస్తుంది. చిన్నతనంలో తన తండ్రి కొట్టడానికి వస్తుంటే బీరువాలో దాక్కుంటాడు హీరో. అలా ఆ బీరువా అతని ఫ్రెండ్‌ అయిపోయిందట. అప్పట్నుంచే అందులోనే తిని, అందులోనే చదువుకుని, అందులోనే పడుకుని పెరిగాడట!

Video: Beeruva Movie Public Talk

ఎంబీఏ కూడా పూర్తి చేసేసిన హీరో.. ‘కాసేపు వెళ్లి బీరువాలో ఉంటా’ అని పేరెంట్స్‌తో చెప్పేసి సీరియస్‌గా బీరువాలోకెళ్లి తలుపేసుకుంటాడు. అసలు ఇలాంటి సీన్లు ఎలా కన్సీవ్‌ చేసారనేది పక్కన పెడితే, వాటితో రామోజీ, చోటా, తమన్‌ తదితర ప్రముఖుల్ని కూడా ఒప్పించేసారు చూడండి… దానికి మాత్రం కన్మణికి, రచయితలకీ సలామ్‌ చేయాల్సిందే. రౌడీల నుంచి పారిపోయిన హీరో ఒక బీరువాలో దాక్కుంటే అది విజయవాడ నుంచి పార్సిల్‌ అయి హైదరాబాద్‌ వచ్చేస్తుందట. తిరిగెళ్లడానికి రైలో బస్సో ఎక్కితే ప్రమాదం కాబట్టి మళ్లీ ఆ బీరువాలోనే దూరి వెనక్కి పార్సిల్‌ అయిపోతాడట. 

ఇలాంటి వాటిని ఆడియన్స్‌ ఎలా యాక్సెప్ట్‌ చేస్తారని అనుకున్నారో, అసలు ఏం ఆలోచిస్తూ ఇటువంటి సీన్లకి ఇంతమంది తలూపేసి, బీరువాని సిద్ధం చేసేసారో మరి. బీరువాకి సంబంధించిన ఏ ఒక్క సీన్‌ కూడా కన్విన్సింగ్‌గా లేకపోగా నేస్టీగా, పరమ సిల్లీగా తయారైంది. పోనీ ఆ బీరువా గోల వదిలేసి వేరే దాని గురించి మాట్లాడుకుందామంటే, అందులో రొటీన్‌ సొద తప్ప ఏమీ లేకపోయింది. బీరువా కాన్సెప్ట్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టి కనీసం దాని చుట్టూ టామ్‌ అండ్‌ జెర్రీ టైప్‌ కామెడీ ఏదైనా నడిపి ఉండాల్సింది. బీరువాని కథలోకి ఇరికించారు కానీ దానిని ఏం చేయాలో మాత్రం వారికే ఐడియా లేకుండా పోయింది. 

ఉషాకిరణ్‌ మూవీస్‌, ఆనంది ఆర్ట్స్‌ బ్యానర్‌ పేర్లు చూసి… ‘బీరువా’ అనే టైటిల్‌ చూసి… దీంట్లోకి వెళ్లారంటే నవ్వుకోడం మాట దేవుడెరుగు. మన ఇంటెల్లిజెన్స్‌కి ఇంచ్‌ కూడా రెస్పెక్ట్‌ ఇవ్వని సిల్లీ స్క్రిప్ట్‌తో రెండు గంటల పాటు బీరువాలో ఉక్కిరిబిక్కిరి అయిపోవడం గ్యారెంటీ. 

బోటమ్‌ లైన్‌: బీరువా: బాబోయ్‌ ఇదేం గొడవ!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Video: Beeruva Movie Public Talk