సీపీఎస్ ఉద్యోగులు రకరకాల రూపాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సీపీఎస్ విధానం ద్వారా.. ఉద్యోగులు నష్టపోతుంటే గనుక.. వారికి ఆ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం పరంగా ఏం చేయగలమో చాలా విపులంగా వివరిస్తూ ప్రభుత్వం వారికి తమ ప్రతిపాదనల్ని తెలియజేసింది. అయితే.. సీపీఎస్ విధానం రద్దు అనే ఒకే ఒక డిమాండ్ ను పట్టుకున్న ఉద్యోగులు అదే మంకుపట్టు కొనసాగిస్తున్నారు.
వాస్తవంలో ఇక్కడ మరికొన్ని అంశాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సీపీఎస్ రద్దు అనే డిమాండ్ తో రెచ్చిపోయి ఆందోళనలు చేస్తున్న వారికి.. అలాంటి ఆందోళన గానీ, ఉద్యమంగానీ చేయడానికి నైతిక అర్హత ఉన్నదా అనే అంశాన్ని ప్రధానంగా గమనించాలి. ఎప్పుడైనా సరే.. ప్రభుత్వం వారికి చట్టబద్ధంగా ఇచ్చిన మాట తప్పి, వ్యవహరించినప్పుడు దానికి సంబంధించి ఆందోళనలు చేస్తే అర్థముంటుంది.
అలా కాకుండా, ప్రభుత్వంతో ఒక రకంగా ఒప్పందానికి కట్టుబడి, ఆ తర్వాత ఆ ఒప్పందం తమకు నచ్చలేదని ప్రభుత్వం మీదే నిందలు వేస్తూ ఆందోళనలు చేయడం విజ్ఞత అనిపించుకోదు.
ఎలాగంటే..
ఇప్పుడు సీపీఎస్ పథకం వర్తించే ఉద్యోగులు అందరూ.. ఆయా ఉద్యోగాల్లో చేరకముందే వారికి ఈ పద్ధతి ఉంటుందనే సంగతి తెలుసు. అప్పటికే నిబంధనలు మారి ఉన్నాయి. సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాతనే వారు ఉద్యోగాల్లో చేరారు. ఆరోజునే వారికి సీపీఎస్ అంటే అయిష్టం, అసహ్యం ఉంటే గనుక.. ఆ ఉద్యోగాన్నే వద్దనుకుని వారికి తగిన, అద్భుతమైన ఇతర ఉద్యోగాల్లో చేరి ఉండవచ్చు.
సీపీఎస్ కు అంగీకరించి విధుల్లో చేరిన తర్వాత.. ఇప్పుడు ఆ సీపీఎస్ వద్దు, పాత పెన్షన్ విధానమే కావాలి అనే డిమాండ్ ను తెరమీదికి తేవడం ఎలా కరెక్టు అవుతుంది? సీపీఎస్ అనేది వాళ్లంతా ఒప్పుకుని చేరిన విధానమే కదా. ఇప్పుడు వారే దానిని వ్యతిరేకిస్తున్నారు. అదే చోద్యం.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఒక్కటే. తాను ప్రభుత్వంలోకి వస్తే గనుక.. వెంటనే సీపీఎస్ రద్దు చేసేస్తానని ఆయన ఏకపక్షంగా ఎలాంటి ముందు ఆలోచన లేకుండా ఎన్నికలకు ముందు అన్నారు. కనీసం సీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పిఉంటే సరిపోయేది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. వనరుల పరంగా రాష్ట్రం ఉన్న దీన స్థితి, ఆర్థిక ఇబ్బందులు అన్నింటి దృష్ట్యా సీపీఎస్ రద్దు అనేది ఎంత ప్రమాదకరమైన పనో ఆయనకు అవగతం అవుతోంది.
అప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల మీద సానుభూతితో మధ్యేమార్గంగా మరో పథకాన్ని ప్రతిపాదిస్తోంది. ఉద్యోగులకు ఉన్న సాధకబాధకాలను వివరిస్తోంది. అయితే ఉద్యోగులు మాత్రం మంకుపట్టు వీడడం లేదు. వాస్తవాలను గ్రహించకుండా.. వారు ఇలా పోరాడుతుండడం వల్ల ఎవరికి ఉపయోగం?
ఉద్యోగులే అర్థం చేసుకోవాలి. వారు ఆందోళన చేస్తోంటే.. ప్రభుత్వాన్ని నిందించడానికి, జగన్ ను తూలనాడడానికి చంద్రబాబు తెగిస్తున్నారు గానీ.. ఇంత రచ్చ జరుగుతున్నా కూడా.. ఈసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తే సీపీఎస్ ను తక్షణం రద్దు చేస్తానని చంద్రబాబునాయుడు ఒక్కటంటే ఒక్క మాట కూడా అనడం లేదు. ఈ విషయం గమనించి అయినా.. అందులో ఉన్న క్లిష్టతను వారు అర్థం చేసుకోవాలి. జగన్ సర్కారు ప్రతిపాదిస్తున్న మధ్యేమార్గమే పరిష్కారమని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మేలు.