విద్యుత్ అధికార చీకట్లకు తోడు ప్రధాన ప్రతిపక్షం కుట్రల చీకట్లు తోడయ్యాయి. అంతిమంగా అధికార పార్టీ మూల్యం చెల్లించు కోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కెనమాకులపల్లిలో విద్యుత్ కోతపై వెలుగు చూసిన నిజాలు అధికార పార్టీకి షాక్ ఇచ్చాయి.
కుప్పం నుంచి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తుండడం విద్యుత్ కోతలను కృత్రిమంగా సృష్టించడం చర్చనీయాంశమైంది. ఇందులో చీకటి కోణాలు వెలుగు చూడడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరెక్కడైనా ఇలాంటి కుట్రలున్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఉద్దేశ పూర్వకంగా కరెంట్ కట్ చేసి, ఆ తర్వాత కోతలకు నిరసన పేరుతో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టడం టీడీపీకే చెల్లింది. ఈ ఘటనలో షిఫ్ట్ ఆపరేటర్‌ను తొలగింపునకు ఎస్పీడీసీఎల్ ఆదేశాలు ఇచ్చింది. కుప్పంలో టీడీపీ కుట్రను గుర్తించి చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపగలూ, అది కూడా సమయ పాలన లేకుండా కోతలు విధించడంపై అధికార పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సిబ్బందిలో తమ వాళ్లను అడ్డు పెట్టుకుని కృత్రిమ కోతలను విధిస్తున్నారా? అధికారిక కోతలకు భిన్నంగా ఎక్కడెక్కడ ఏఏ సమయాల్లో కోత విధిస్తున్నారని ఆరా తీయడం మొదలు పెట్టారు.
అసలే ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. వివిధ అంశాల్లో ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆవేదనలో ఉద్యోగులున్నారు. అలాంటి వాళ్లు ప్రభుత్వానికి వీలైతే ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికే ఆలోచిస్తారు. ఈ కోణంలో విద్యుత్ కోతలపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరాన్ని కుప్పం ఎపిసోడ్ తెలియజేస్తోంది.